May 2 2021 @ 00:58AM

రెండుసార్లు రెడ్‌సిగ్నల్‌!

ప్రపంచ చిత్ర పరిశ్రమకు కరోనా సినిమా చూపిస్తోంది. కరోనా ప్రభావంతో కొన్ని తెలుగు చిత్రాల షూటింగ్‌ రెండుసార్లు నిలిచిపోయింది. అంతా సాఫీగా జరిగితే గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రాలు అవి. అకస్మాత్తుగా విధించిన కరోనా లాక్‌డౌన్‌ తొలిసారి ఆ సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్‌లు వేసింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక చకచకా షూటింగ్‌ పూర్తిచేసి ఈ వేసవి బరిలోకి దింపుదామని చిత్రబృందాలు భావించాయి. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా మరోసారి తెలుగు సినిమా ఆశలు ఆవిరి చేసింది. గతేడాది, ఈ ఏడాది రెండు సార్లు కొవిడ్‌ ఎఫెక్ట్‌కు గురైన కొన్ని చిత్రాలు ఇవే. 




ఆచార్యకు మళ్లీ బ్రేక్‌

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ తొలిసారి చిరంజీవితో కలసి పూర్తి నిడివి ఉన్న పాత్ర చేస్తున్నారు. సైరా నరసింహరెడ్డి తర్వాత చిరంజీవి చేస్తోన్న చిత్రం ఇది. 2019 విజయ దశమికి షూటింగ్‌ ప్రారంభమైంది. గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది. మార్చిలో ఆగిపోయిన షూటింగ్‌ తిరిగి నవంబర్‌లో ప్రారంభమైంది. 

ఈ ఏడాది వేసవికి ‘ఆచార్య’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. చిత్రబృందం ప్రణాళిక ప్రకారం శ్రమించింది. మధ్యలో రామ్‌చరణ్‌కు కరోనా వచ్చిన సమయంలో మినహా పెద్ద ఆటంకాలు లేకుండా షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ కొనసాగించారు. దీంతో ముందు ప్రకటించిన విధంగా మే 13న ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రావటంఖాయం అని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా చివరి దశలో చిత్రీకరణకు బ్రేక్‌లు పడ్డాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో ఇప్పుడు మరోసారి చిత్రీకరణకు సడెన్‌ బ్రేక్‌ పడింది. దీంతో మే 13న ‘ఆచార్య’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా సాధ్యంకాక విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

రామ్‌చరణ్‌ పై చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలు, ఓ పాట మినహా సినిమా అంతా పూర్తయింది. ఏప్రిల్‌ ఆఖరుకు షూటింగ్‌ పూర్తిచేసి మేలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభించాలనుకున్నారు. కానీ కొద్దిభాగం షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉందనగా కరోనా విజృంభణతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం ప్రకటించారు. కరోనా వ్యాప్తితో ఇప్పటికిప్పుడు షూటింగ్‌ తిరిగి ప్రారంభించే అవకాశాలు లేవు. కరోనా వ్యాప్తి నెమ్మదించాక కేసుల శాతం భారీగా తగ్గితేనే మళ్లీ చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌చరణ్‌ సరసన పూజాహెగ్డే హీ రోయిన్లుగా నటిస్తున్నారు. 


రాధేశ్యామ్‌కు కరోనా అడ్డం

కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడుగా నటిస్తోన్న పీరియాడిక్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమా కరోనా బారి నుంచి రెండు సార్లు తప్పించుకోలేకపోయింది. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రబృందం జార్జియా  వెళ్లింది. అక్కడ సగం షెడ్యూల్‌ పూర్తి చేశాక కరోనా కారణంగా తిరిగొచ్చేశారు. అక్టోబర్‌లో ఇటలీలో తిరిగి షూటింగ్‌ పున :ప్రారంభించారు. హైదరాబాద్‌, ఇటలీ, జార్జియాల్లో కొంత చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ ఏడాది జులై 30న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కానీ చిత్రీకరణ అంతా పూర్తయినా కొంత ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది. కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్‌ చేయటం ప్రారంభించారు. కానీ కరోనా కలకలంతో చిత్రీకరణను నిలిపివేశారు. ఇప్పుడు ఈ చిత్రం అనుకున్న విధంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. 


పుష్పకు కరోనా  బ్రేక్‌

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. 2019లో ఈ చిత్రం షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. 2020 మార్చిలో కేరళలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్లాన్‌ చేశారు. అయితే లాక్‌డౌన్‌తో షూటింగ్‌ ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత నవంబర్‌లో మారేడుమిల్లిలో షూటింగ్‌ తిరిగి ప్రారంభించారు. ఈ ఏడాది ఆరంభంలో రంపచోడవరం, కేరళలో కొంత షూటింగ్‌ జరిపారు. ఏప్రిల్‌లో డబ్బింగ్‌ కూడా ప్రారంభించారు. ఇంకా రెండు రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉండగా అల్లు అర్జున్‌ కరోనా బారిన పడటంతో నిలిపివేశారు. పరిస్థితులు అనుకూలించాకే తిరిగి ప్రారంభమవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు ప్రకటించిన విధంగా ఆగస్టు 13న ‘పుష్ప’ విడుదలవుతుందా అంటే డౌటే. 


ఆర్‌ఆర్‌ఆర్‌ 2022లో?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రణం రౌద్రం రుధిరం’. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులు. గతేడాది జులై 30న విడుదల చేయనున్నట్టు తొలుత చిత్రబృందం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో షూటింగ్‌కు  ఏడు నెలల విరామం వచ్చింది. తిరిగి అక్టోబర్‌లో షూటింగ్‌ పున:ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 8కి విడుదలను వాయిదా వేసినా కార్యరూపం దాల్చలేదు. దాంతో ఈ ఏడాది అక్టోబర్‌ 13న  సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు సెకండ్‌వేవ్‌ ప్రభావంతో ఆ డేట్‌కైనా కచ్చితంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అంటే గట్టిగా ఔనని చెప్పలేని పరిస్థితి. ఇప్పటికి 80 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తయింది. ఇంకా క్లైమాక్స్‌ షూటింగ్‌ మిగిలి ఉంది. సినిమా విడుదలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. కానీ సినిమా పూర్తి చేయాలంటే ముందు కరోనా తీవ్రత తగ్గాలి. పోస్ట్‌ ప్రొడక్షన్‌కు కూడా చాలా సమయం పడుతుంది. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల మరోసారి ముందుకు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


నాడు నారప్ప షూటింగ్‌కు నేడు విడుదలకు 

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్‌ కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం ‘నారప్ప’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకుండా కరోనా రెండుసార్లు అడ్డుపడింది. గతేడాది జనవరిలో షూటింగ్‌ ప్రారంభమైంది. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిన దశలో లాక్‌డౌన్‌తో మార్చిలో నిలిచిపోయింది. తిరిగి నవంబర్‌లో పున:ప్రారంభమైంది. ఫిబ్రవరిలో షూటింగ్‌ పూర్తయింది. మే 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోసారి సినిమా విడుదలకు కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో అడ్డుపడింది. 


లైగర్‌పై డబుల్‌ ఎఫెక్ట్‌

విజయ్‌ దేవరకొండ  బాక్సర్‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘లైగర్‌’. గతేడాది జనవరిలో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లింది. 40 రోజుల షూటింగ్‌ జరిగాక లాక్‌డౌన్‌తో నిలిచిపోయింది. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో షూటింగ్‌ ప్రారంభమైంది. అయినా ఈ సినిమాపై కరోనా ఎఫెక్ట్‌ తప్పలేదు. కరోనా సేకండ్‌ వేవ్‌తో  ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ మరోసారి నిలిచింది.


అఖండను అడ్డుకుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను క లయికలో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ చిత్రం షూటింగ్‌ గతేడాది మార్చిలో ప్రారంభమైంది. ఒక షెడ్యూల్‌ పూర్తయ్యాక, లాక్‌డౌన్‌ విధించటంతో షూటింగ్‌ ఆపారు. తిరిగి అక్టోబర్‌లో సెట్స్‌ పైకి వెళ్లింది. ప్రస్తుతం కరోనాతో చాలా చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. కానీ బాలకృష్ణ మాత్రం ఎలాగైనా చిత్రాన్ని పూర్తిచేయాలనే పట్టుదలతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలో షూటింగ్‌ పూర్తవుతుంది. అయితే ముందు ప్రకటించినట్టుగా మే 28న ప్రేక్షకుల ముందుకు రావటం కష్టమే.