Abn logo
Jul 10 2021 @ 15:47PM

Corona నెమ్మదించట్లేదు.. WHO చీఫ్ సైంటిస్ట్ హెచ్చరిక!

జెనీవా: కరోనా సంక్షోభం ఇప్పటికీ నెమ్మదించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా హెచ్చరించారు. దూకుడు మీదున్న డెల్టా వేరియంట్‌కు తోడు టీకా కార్యక్రమం ఆశించిన వేగంతో ముందుకెళ్లని కారణంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సంక్షోభం ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. సౌమ్య ఈ విషయాలను వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో కరోనా సంక్షోభం ముదురుతోందని, గత రెండు వారాల్లో ఆఫ్రికా ఖండంలో కరోనా మరణాల రేటు దాదాపు 40 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ను సడలించడం, ఫలితంగా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకపోవడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదిగా సాగడంతో కరోనా వ్యాప్తి ఇంకా నెమ్మదించట్లేదని డా. సౌమ్య తెలిపారు. కొన్ని దేశాల్లో టీకా కార్యక్రమం కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం, కరోనా తీవ్రత తగ్గుతుంటే మరికొన్ని దేశాలు మాత్రం ఇప్పటికీ ఆక్సీజన్, ఆస్పత్రి బెడ్ల కొరతతో సతమతమవుతున్నాయని పేర్కొన్నారు.