‘పందికోన’ వైల్డ్‎డాగ్స్

ABN , First Publish Date - 2021-04-04T18:15:20+05:30 IST

మీరు ఇంటి బయట కాపలా కాసే కుక్కలను చూసి ఉంటారు. కొందరు తమ డాబు దర్పాన్ని ప్రదర్శించేందుకు హైబ్రీడ్‌ శునకాలను పెంచుకోవడం చూసి ఉంటారు. స్టేటస్‌ సింబల్‌ కోసం వేలు, లక్షల రూపాయలు...

‘పందికోన’ వైల్డ్‎డాగ్స్

మీరు ఇంటి బయట కాపలా కాసే కుక్కలను చూసి ఉంటారు. కొందరు తమ డాబు దర్పాన్ని ప్రదర్శించేందుకు హైబ్రీడ్‌ శునకాలను పెంచుకోవడం చూసి ఉంటారు. స్టేటస్‌ సింబల్‌ కోసం వేలు, లక్షల రూపాయలు వెచ్చించి... విదేశీ శునకాలను తెచ్చుకునే బడా బాబులకూ ఈ ఆధునిక ప్రపంచంలో కొదవే లేదు. కానీ అసలు సిసలైన దేశీ వేట కుక్కలను చూడాలంటే మాత్రం కర్నూలు జిల్లాలోని ‘పందికోన’ గ్రామానికి వెళ్లాల్సిందే. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వేటలో మేటిగా ఎదిగి, సీమ పౌరుషాన్ని పుణికిపుచ్చుకుని, యజమానికి రక్షణ కవచంలా నిలిచే ఈ అరుదైన జాతి జాగిలాలు ఆ ఊరి ఖ్యాతిని దేశాంతరాలు దాటేలా చేస్తున్నాయి. ‘పందికోన’ జాగిలం అంటే ‘పక్కా లోకల్‌’ అండ్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌...


కర్నూలు జిల్లా పత్తికొండకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న ఊరు పందికోన. ఒకప్పుడు ఆంగ్లేయుల హయాంలో పాలెగాళ్లు పాలించేవాళ్లు. చుట్టూ అడవులు... మధ్యలో కొండలు, గుట్టలున్న ప్రాంతం. వర్షాలకు మాత్రమే పంటలు పండేవి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. కొందరు మేకలు, గొర్రెలు కాసుకుంటూ బతికేవాళ్లు. అటవీప్రాంతం మధ్యలో ఊరు ఉంటుంది కాబట్టి చిరుతలు జనావాసాల మధ్యకు వచ్చేవి. ఏళ్ల కిందట ఒక రోజు అడవుల్లో నుంచీ కడుపుతో ఉన్న ఒక చిరుత ఊర్లోని సత్రంలో సేదతీరింది. అక్కడే దాక్కుని పిల్లల్ని కనింది. ఆ చిరుత పిల్లలు శునకాలతో కలిసి సంచరించేవి. అవి పెరిగి పెద్దయ్యాక... అందులోని ఒక మగ చిరుత, ఆడ శునకంతో కలిసింది. అప్పుడు పుట్టిన పిల్లలే పందికోన శునకాలు అనేది ఇప్పటికీ ప్రచారంలో ఉన్న సమాచారం. అయితే అందులో నిజమెంత? అది సాధ్యమేనా? అనే విషయాన్ని వైద్యులు శాస్త్రీయంగా నిర్దారించలేదు. అప్పటి నుంచీ ‘పందికోన బ్రీడ్‌ డాగ్స్‌’గా ప్రచారం లభించింది. నలభై ఏళ్ల కిందటే అమెరికాకు చెందిన ఒక బృందం ఈ శునకాలను పరిశీలించేందుకు పందికోనకు వచ్చింది. ఇది అరుదైన అంతరించిపోతున్న జాతి అనీ, వీటి సంరక్షణకు అవసరమైన నిఽఽధులు ఇస్తామనీ చెప్పారు అమెరికన్లు. అందుకు గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆ తరువాత రక్షణశాఖ అధికారులు, పోలీసులు పందికోన జాగిలాలను తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఆ శునకాలకు శిక్షణనిచ్చి దర్యాప్తునకు వాడుకుంటున్నారు. 


రెండూ రెండే...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు రకాల దేశీ కుక్కలున్నాయి. వాటిలో ఒకటి ‘పందికోన’ కాగా, రెండోది ‘జొన్నంగి’. మొదటి జాతికి చెందినవి పందికోన గ్రామంలో మాత్రమే కనిపిస్తే... ‘జొన్నంగి’ జాతి కుక్కలు కృష్ణా, పశ్చిమ గోదావరి సరిహద్దుల్లో ఉన్న కొల్లేటి సరస్సు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ రెండు జాతుల ప్రధాన లక్షణం... యజమాని పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వేటకు సిద్ధం కావడం. మిగతా కుక్కల్లాగా బద్ధకంగా ఉండకుండా, ఎప్పుడూ జాగరూకతను ప్రదర్శించడం వీటి ప్రత్యేకత. ప్రమాదంపై నిఘా వేసి, యజమానికి వీర సైనికుల్లా రక్షణనిస్తాయి. కొత్తవాళ్లను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వవు. ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వవు. వీటిని మచ్చిక చేసుకుంటే మాత్రం విశ్వాసాన్ని చాటుకుంటాయి. అడవుల్లో బతికే పల్లె జీవులకు పెద్ద భరోసా. 


పొలాల్లో వ్యవసాయం చేసుకునే వాళ్లు, గొర్రెల కాపర్లు బయటికి వెళ్లక తప్పదు. అయితే వారి ధైర్యం... స్థయిర్యం... వారి పక్కనుండే వేట కుక్కలు. వాటి చూపు చాలా చురుకు... అవి మొరిగాయంటే గుండెలు జారిపోతాయంతే! రాత్రిపూట గొర్రెలు, మేకల్ని ఎత్తుకెళ్లే దొంగల్ని, తినేందుకు వచ్చే జంతువుల్ని దగ్గరకు రానివ్వవు. అంతకు మించి, విశ్వాసం, విధేయతలో వాటి తర్వాతే ఏ జాగిలాలైనా. యజమానికి రక్షణ కవచంగా, చివరి క్షణం దాకా ‘విజయమో వీరస్వర్గమో’ అన్న చందంగా శత్రువుతో పోరాడతాయి. ఎదురుగా ఉన్నది చిరుతైనా, పులైనా, మరేదైనా వాటి దాడికి జడుసుకుని తోక ముడవాల్సిందే. ఈ పౌరుషం, విశ్వాసాలే పందికోన జాగిలాలను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 


దేని ప్రత్యేకత దానిదే!

విశ్వాసానికి మారుపేరు జాగిలాలు. అందుకే ఆదిమ కాలం నుంచి ఆధునిక యుగం దాకా మనిషి వాటిని మచ్చిక చేసుకుంటూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల జాతుల కుక్కలున్నాయి. దేని ప్రత్యేకత దానిదే. కొన్ని జాగిలాలు ఇళ్లలో సందడి చేస్తే, మరికొన్ని యుద్ధక్షేత్రాల్లో, నేర పరిశోధనల్లో తోడ్పాటును అందిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని వేటకుక్కలు ‘దేశీ’ ముద్రతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కొల్లేటికి చెందిన ‘జొన్నంగి’, తమిళనాడుకు చెందిన ‘రాజాపాళ్యం’ దేశీ గ్రామ సింహాల్లాగే, ఒక విశిష్టమైన జాతికి చెందినవి ‘పందికోన’ జాగిలాలు. ఒక రకంగా ఇవి నాటు శునకాలు అని చెప్పవచ్చు.


దాడులను ఎదుర్కొనేందుకు...

శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ జాతి శునకాల పెంపకానికి బీజం పడిందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఉన్న పత్తికొండ సమీపంలోని పాలెగాళ్లు, దొరలు ఈ కుక్కలను పెంచారు. పందికోన గ్రామంలో అప్పట్లో ఇలాంటి 30 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు సుమారు ఏడువందలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. దాదాపు ఇంటింటికీ ఒక శునకం ఉంటుంది. వీటికి ఎంతో ఆప్యాయంగా చిత్రవిచిత్రమైన పేర్లు కూడా పెట్టుకుంటారు పల్లెవాసులు. ‘ఇదిగో ఇందిరమ్మా.... ఉరుకు... దొంగోడు వస్తున్నాడు చూడు... ఉరుకు’ అంటే చాలు. దొంగలపైకి అరవకుండా గుడ్లురిమి ఉరుకుతాయి. ఇవి మొరిగే కుక్కలు కాదు. చప్పుడు చేయకుండానే పని కానించేస్తాయి. కొన్ని శునకాలకు రాముడు, భీముడు, రాజు అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. రాత్రీపగలు లేదు. ఇంటి నుంచీ పొలానికి, గొర్రెల కాపలాకు యజమాని బయలుదేరిన వెంటనే, వెనకే వస్తాయివి.


రైతులకు పంట చేతికొచ్చే సమయానికి చుట్టుపక్కల ఉన్న అడవుల్లో నుంచి తరచూ పులులు, చిరుతలు, అడవి పందులు, తోడేళ్లు, జింకలు పొలాల్లో పడి పంటను నాశనం చేయడమేగాక... కొన్నిసార్లు గ్రామస్థులపై దాడి చేసేవి. వాటి భయంతో ఇళ్ల బయటికి వెళ్లాలంటే జడుసుకునేవారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లేది. ఇక, రాత్రిళ్లు అయితే ఊపిరి బిగబట్టి వెళ్లాల్సిందే!. ఎన్నాళ్లిలా... పంట నష్టమే కాకుండా, ప్రాణనష్టం కూడా జరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోలేదు. క్రూరమృగాలను ఎదుర్కొనేందుకు, వాటి ఆచూకీ కనిపెట్టేందుకు కుక్కలను పెంచాలనే ఆలోచన తట్టింది. అప్పటి పాలెగాళ్లు వాటికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు. సాధారణ కుక్కలను వేటకుక్కలుగా తీర్చిదిద్దారు.


చాటింపు వేయగానే...

ఈ ప్రాంతంలో క్రూరమృగాల దాడులు శ్రుతి మించిన సమయంలో దొరలు, పాలెగాళ్లు వేటకు పిలుపునిచ్చేవారు. గ్రామ నడిబొడ్డున ఉన్న కొండపై తప్పెటతో చాటింపు వేయగానే గ్రామస్థులు వేటకు సమాయత్తం అయ్యేవారు. ఇళ్లలోని ఈటెలు, బరిసెలను చేతబూని గ్రామ నడిబొడ్డుకు చేరుకునేవారు. వేటకుక్కలను ముందుకు పంపించి, వాటి వెనుక వేటకు బయలుదేరేవారు. పొలాలను ధ్వంసం చేస్తున్న అడవి పందుల దండుపై వేట కుక్కలు అరుస్తూ దాడిచేసేవి. అవి వెనక్కిపోయేదాకా పోరాడేవి. భయపెట్టేవి. ఈ క్రమంలో కొన్నిసార్లు చిరుతలు కంటపడేవి. కుక్కలపై అవి దాడి చేసినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, ధైర్యంగా తిరగబడేవి. దాడిలో రక్తమోడినా సరే పట్టువదలకుండా పౌరుషంతో పోరాటం సాగించడం పందికోన వేట కుక్కల ప్రత్యేకత. ఈ దాడుల్లో చాలా జాగిలాలు మరణించాయి. అయినా వాటి పోరాట పటిమ వల్ల చాలాసార్లు చిరుతలు వెనుదిరిగి పారిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతారు. ‘‘నేను 70వ దశకంలో ఒకసారి వేటకు వెళ్లాను. కుక్కలు ఒక చిరుతను నిలేశాయి. వెంటనే దానిపైకి బరిసెలు విసిరాం. చిరుత పడిపోవడంతో మృతి చెందిందని భావించి దగ్గరకు వెళ్లి చూశాను. అదే అదునుగా చిరుత నాపై అకస్మాత్తుగా దాడికి దిగి గాయపరిచింది. వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై చిరుతను చంపేయడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను’’ అని పందికోన గ్రామస్థుడైన బాలరంగప్ప నాయుడు తెలిపారు. అప్పట్లో మృగాల దాడుల్లో గాయపడిన వారికి ప్రత్యేక నాటు వైద్యం అందించేవారు. 1973లో గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం వచ్చింది. మరో పదేళ్లకు రోడ్లు వచ్చాయి. దాంతో క్రూరమృగాల బెడద కొంత వరకు తగ్గింది. దాంతో క్రమంగా ఊరి ప్రజలు వేటను మానుకున్నారు.


ఏవీ సాటి రావు..

చూడటానికి వీధి కుక్కల్లా కనిపించినప్పటికీ పందికోన జాగిలాలు కచ్చితంగా విశిష్టమైనవి. వేటకుక్కల స్వభావం వీటి సొంతం. శరీరాకృతి దృఢంగా ఉంటుంది. బక్కపల్చగా కనిపిస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటాయి. మెరుగైన కంటి చూపు వీటికుంటుంది. ఎంత దూరంలో ఉన్నా సరే, అడవి జంతువుల్ని పసిగడతాయి. పరుగులో వేగం ఎక్కువ. చురుకుగా కదులుతూ ప్రత్యర్థులను కట్టడి చేస్తాయి. నాటు కుక్కల కంటే ఎత్తుగా, బలిష్టంగా కనిపించే వీటి సామర్థ్యం విదేశీ జాతికుక్కలైన డాబర్‌మన్‌, ఆల్షేషన్‌, జర్మన్‌ షఫర్డ్‌, లాబ్రడార్‌కు దీటుగా ఉంటుందని పోలీసు జాగిలాలకు శిక్షణ ఇచ్చేవారు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే పోలీసు జాగిలాలుగా కూడా ఉపయోగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘1988లో పత్తికొండలో సీఐగా పనిచేస్తున్నప్పుడు ఈ జాతి కుక్కల గురించి తెలుసుకుని ఇంటికి తెప్పించుకున్నాను. వాటి పౌరుషం, విశ్వాసం మరే కుక్కలకు ఉండదు. అందుకే అప్పటి నుంచి మా ఇంట్లో వాటిని పెంచుతున్నాం. ఇటీవల మా అల్లుడు హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌కు ఒక కుక్క పిల్లను తీసుకెళ్లి పెంచుతున్నాడు. నా స్నేహితులకు కూడా ఇక్కడి నుంచి పందికోన కుక్కలను పంపించా. వీటిని చిన్నప్పుడే తెచ్చుకోవాలి. పెద్దయ్యాక పెంచడం కష్టం. ఒకసారి విశ్వసిస్తే బాగా కలిసిపోతాయి’’ అన్నారు రిటైర్డ్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌. ఆయన లాగే చాలామంది పోలీసు అధికారులు పందికోన కుక్కలను తమ ఇళ్లల్లో పెంచుకోవడం విశేషం. 


పందికోన శునకం దేశవాళి శునకం. అడవుల్లాంటి ఊళ్లలో ఉంటాయివి. చాలా గట్టివి. దేనికీ భయపడవు. పశువులు, గొర్రెల కాపర్లకు అండగా ఉంటాయి. ఎవరైనా ఈ కుక్కల కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలంటే భయపడతారు. అంత చురుగ్గా చూస్తాయివి. నేను చదువుకునే రోజుల్లో ‘డాగ్‌ బ్రీడ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సబ్జెక్ట్‌లో భాగంగా ఈ జాతి గురించి తెలుసుకున్నాం. వీటిని నేరుగా చూశాక మరిన్ని విషయాలు తెలిశాయి. జాగిలాలు ముఖ్యంగా డాల్‌ (ఫ్రెండ్లీ), హింటింగ్‌, స్పోర్ట్స్‌, వాచ్‌ (కాపలా) ఇలా పలు రకాలు ఉంటాయి. పందికోన శునకాలు స్పోర్ట్స్‌ విభాగానికి చెందినవని చెప్పొచ్చు. రేసుల కోసం, వేట కోసం బాగా ఉపయోగపడతాయి. దీనికి గుండె ధైర్యం ఎంత ఎక్కువంటే... పెద్ద పులికి ఎదురొడ్డి పోరాడగలదు. ఏమాత్రం భయపడదు. 

- డా.శ్యామ్‌ ప్రసాద్‌, పశు వైద్యులు


ఉచితంగా ఇస్తారు...

1970 ప్రాంతంలో 300కు పైగా పందికోన జాతి కుక్కలుండేవి. రాను రాను అడవులు తగ్గిపోవడం, రవాణా సౌకర్యాలు పెరగడంతో పందికోనలో క్రమక్రమంగా కుక్కల పెంపకం తగ్గిపోతోంది. ప్రస్తుతం గొర్రెల కాపరులు మాత్రమే వీటిని పెంచుతున్నారు. అయితే ధైర్య సాహసాలకు పేరుగాంచిన ఈ దేశీ కుక్కల గురించి తెలుసుకున్నవారు పందికోన గ్రామాన్ని సందర్శించి ఇక్కడి నుంచి కుక్కలను తీసుకెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. గ్రామస్తులు అలాంటివారికి ఉచితంగానే కుక్కపిల్లలను ఇస్తారు. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, ఢిల్లీ నగరాల నుంచి కూడా వచ్చి కుక్కపిల్లలను తీసుకెళ్లారని గ్రామస్థులు చెబుతున్నారు. వారి ద్వారా ఈ కుక్కలు విదేశాలకు చేరిన ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఊర్లోనే వ్యవసాయం చేస్తున్న కొంతమంది తమ గ్రామానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న ఈ జాతి కుక్కలను ముందుతరాలకు అందించాలనే ఉద్దేశంతో పెంచుతున్నారు. ‘‘వివిధ కారణాలతో గ్రామంలో చాలామంది పట్టణాలకు వలసపోయారు. మిగిలినవారు కూడా కుక్కల పెంపకం మానేసినా, మాతో పాటు మరో ఐదు కుటుంబాల వారు మాత్రమే వీటిని పెంచుతున్నాం. ఈ దేశీయ శునకాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తే బాగుంటుంది’’ అని పందికోన గ్రామస్థుడైన ఆదినారాయణ అంటున్నారు. ఇదే ఊరికి చెందిన రామానాయుడు మాట్లాడుతూ ‘అసలీ శునకాలకు ఎంత చరిత్ర ఉందో కూడా మాకు తెలీదు. కొన్నితరాల పాటు ఈజాతి మా జీవితాల్లో భాగం అయ్యింది. వీటికున్న ప్రత్యేకత వల్లే మా ఊరికి పేరొచ్చింది...’ అన్నాడు. అప్పట్లో ఢిల్లీ నుంచీ డిస్కవరీ ఛానల్‌ ప్రతినిధులు కూడా పందికోనకు వచ్చి... కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధులు అయితే ఒక రాత్రి ఆ ఊరి పొలాల్లోనే జాగారం చేశారు. అదే సమయంలో ఆ పొలం రైతు పక్కనే ఒక శునకం కూర్చుని కాపలా కాస్తోందప్పుడు. సరిగ్గా అదే రాత్రి అడవి పంది వచ్చింది. అప్పుడు ఆ శునకం ఒక్క దూకుదూకి ఆ అడవిపందిని చంపేసింది. ఆ దృశ్యం చూసిన అమెరికన్లు ఆశ్చర్యపోయారు. పందికోన శునకం ప్రత్యేకత ఏంటో కళ్లారా చూశారు.. అంటూ ఆ గ్రామస్థులు పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో కథలు పందికోన శునకాల  చుట్టూ అల్లుకుని ఉన్నాయి.  


నిజమే... ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రష్యన్‌ రొడీషిషన్‌ రిడ్జ్‌బెర్క్‌లాగా, సైబీరియన్‌ హస్కీలాగా, ఐరిష్‌ హోల్ఫ్‌హౌండ్‌లాగా, అమెరికన్‌ పిట్‌బుల్‌ టెరియర్‌లాగా, టర్కీ కెంగల్‌లాగా, అర్జెంటీనా డోగోలాగా మనకూ ఉందొక ‘పందికోన’... పక్కా దేశీ బ్రాండ్‌. తిరుగులేని శునకం. పౌరుషానికి, విశ్వాసానికి ‘బ్రాండ్‌’గా నిలుస్తున్న ఈ దేశీ శునకాల కీర్తి, మేటి కుక్కలతో పోటీపడుతూ ప్రపంచవ్యాప్తం అవుతోందంటే గొప్పే కదా. 


మరికొంత...

స్వదేశీ జాతి కుక్కల్లో విశిష్ట లక్షణాలున్న అగ్రజాతిగా పందికోన శునకాలకు జాతీయస్థాయిలో పేరుంది. పోలీసు జాగిలాలకు శిక్షణ ఇచ్చే పోలీసులు చెబుతున్న మాట ఇది. 

నగరాల్లోని పెట్‌డాగ్స్‌ను పోషించేందుకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. తక్కువలో తక్కువ నెలకు నాలుగు నుంచీ ఆరువేలు వెచ్చించాల్సి వస్తుంది. పందికోన కుక్కలకు అంత అవసరం లేదు. సాధారణ తిండి చాలు. 

 రోగనిరోధక శక్తి ఎక్కువ. వ్యాధులు సోకే అవకాశాలు చాలా తక్కువ.

ఈ కుక్కల్ని వీలైనంత స్వేచ్ఛగా తిరగనివ్వాల్సిందే. ఇంట్లో కట్టేస్తే ఉండలేవు. స్వేచ్ఛగా తిరగడానికి ఇంటి ఆవరణ విశాలంగా ఉండాలి. వేట స్వభావం ఉన్న ఈ కుక్కల్ని ఒక చోట కట్టేస్తే ఉండలేవు.

వీటికి నేవిగేషన్‌ స్కిల్స్‌ ఎక్కువ. ఊరికి దూరంగా ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం వదిలేసినా... తిరిగి ఊరిని వెతుక్కుంటూ వచ్చేస్తాయని స్థానికులు చెబుతారు. 

ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. యజమాని ఎక్కడున్నా గుర్తుపట్టేస్తాయి. చాలా తెలివిగా వ్యవహరిస్తాయి.

నిత్యం మాంసాహారమే పెట్టాలనే నియమం లేదు. పప్పు, అన్నం, రొట్టెలు కూడా తింటాయి.

ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకునే శక్తి వీటికుంది.

10-15 ఏళ్లు జీవించే ఆడకుక్కలు ఒక్క ఈతలో 4 నుంచి 7 పిల్లలకు జన్మనిస్తాయి.

నాటు కుక్కల కంటే ఎత్తుగా, బలిష్టంగా కనిపించే వీటిని చూడగానే ఆ తేడాను గుర్తించవచ్చు. మగవి 20- 26 అంగుళాల ఎత్తు, ఆడవి అయితే 19 - 24 అంగుళాల ఎత్తులో ఉంటాయి.

పందికోన శునకాల ప్రత్యేకత వాటి కాళ్లు. ఈ ఊరి పరిసరాలన్నీ కొండలు, గుట్టలు, ముళ్ల పొదలు, రాళ్లతో నిండి ఉంటాయి. సాధారణ శునకాలు పరిగెడితే కాళ్లు చీరుకుపోతాయి. కానీ వీటి కాళ్లు వెడల్పుగా, మందంగా, ధృఢంగా ఉంటాయి. అందుకే వేటకు సై అంటూ దూకేస్తాయి.



విదేశీ జాతుల కన్నా బెస్ట్‌..

పల్లెల్లో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే ఆ గ్రామ అస్తిత్వం. పందికోనను చుట్టుపక్కల పది పల్లెల్లో ప్రత్యేకంగా నిలిపింది ఈ జాగిలాలే!.. పదేళ్ల క్రితం పందికోన శునకాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. స్థానికంగా వీటికి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఎంతో కుతూహలంతో వీటిపై ఒక డాక్యుమెంటరీ చేశాను. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినైనా జాగిలాలపై ఆసక్తితో కొంత పరిశోధన చేశాను. ‘వైల్డ్‌ డాగ్స్‌’ బ్రాండ్‌ పేరిట స్పోర్ట్స్‌ వేర్‌ కూడా నిర్వహిస్తున్నా. నా చిన్నతనంలో మొదటిసారిగా మిత్రుడి ఇంట్లో పందికోన జాగిలాన్ని చూశా. అప్పట్లో ఈ ప్రాంతంలో వందలాది కుక్కలుండేవట. రిజర్వాయర్‌ వచ్చాక, స్థానికుల అలవాట్లు మారి వీటి పెంపకం తగ్గింది. దాంతో ఈ దేశీ కుక్కల సంతతి తగ్గుముఖం పట్టింది. పర్యావరణ, ఆహార పరిస్థితులు కూడా కారణమే. అయితే కొందరు గొర్రెల కాపరులు మాత్రం ఇప్పటికీ వీటిని కన్నబిడ్డల్లా పెంచుతున్నారు. గ్రామంలో ఇవి స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి. నా డాక్యుమెంటరీ చూసిన వాళ్లు... పందికోన జాగిలాల విశిష్టతలు తెలుసుకుని చాలామంది తీసుకెళ్తున్నారు. విదేశీ జాతి కుక్కలకు ఇవి ఏ మాత్రం తీసిపోవు. అందులోను వీటి తిండి ఖర్చు కూడా తక్కువ. 

- కోదండరామిరెడ్డి, ‘పందికోన డాగ్‌’ డాక్యుమెంటరీ రూపకర్త 


అటవీ ప్రాంతంలో ఉన్న ఊరు కాబట్టి క్రూరమృగాల దాడి సమస్య ఎక్కువ. వాటి నుంచి రక్షించుకునేందుకు పూర్వం నుంచి వేట కార్యక్రమం నిర్వహించేవారు. ఈ వేటలో గ్రామంలోని కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. 20 ఏళ్ల క్రితం దాకా ఈ వేట కార్యక్రమం సాగేది. కొండపై తప్పెట శబ్దం వినగానే ఇళ్లలో ఉన్న కుక్కలన్నీ పరుగెత్తుకొచ్చి మొరిగేవి. క్రూరమృగాల జాడ వెదుకుతూ కుక్కలు ముందు వెళ్తుంటే, ఈటెలు, బరిసెలు పట్టుకుని వాటి వెనుకే వేటకు వెళ్లేవాళ్లం. ప్రస్తుతం అడవి పందులు మాత్రమే ఉండటంతో కాలక్రమంలో వేట మానేశాం.


- మల్లికార్జున, స్థానికుడు

- మధుసూదన్‌ ఘట్టమనేని, కర్నూలు 

Updated Date - 2021-04-04T18:15:20+05:30 IST