అప్పన్న స్వామి కల్యాణానికి పందిరిరాట

ABN , First Publish Date - 2021-04-14T06:38:05+05:30 IST

ఈనెల 23న జరగనున్న సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు పందిరిరాట ఉడుపుతో సంప్రదాయబద్ధంగా మంగళవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు.

అప్పన్న స్వామి కల్యాణానికి పందిరిరాట
పందిరిరాట వేస్తున్న దృశ్యం

సింహాచలం, ఏప్రిల్‌ 13: ఈనెల 23న జరగనున్న సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు పందిరిరాట ఉడుపుతో సంప్రదాయబద్ధంగా మంగళవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. ఏటా మాదిరిగా చైత్రమాస ఉగాది పర్వదినాన వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పందిరిరాటకు ఆలయ వైదికులు పూజలు చేయగా, పలువురు ముత్తయిదువులు రాటకు పసుపు, కుంకుమలు అద్దారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడమ ఆలయ కల్యాణ మండపానికి చేరువలో తొలి పందిరిరాటను, ప్రధాన రాజగోపురం వద్ద రెండో పందిరిరాట ఉడుపును దేవస్థానం పాలకమండలి చైర్‌పర్సన్‌ సంచయిత, ఈవో సూర్యకళ సారథ్యంలో వైభవంగా నిర్వహించారు. 


తిరు కల్యాణోత్సవంపై త్వరలో నిర్ణయం

ఉగాది ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న దేవస్థానం పాలక మండలి చైర్‌పర్సన్‌ సంచయిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారుల మార్గదర్శకాల ప్రకారం సింహాద్రి అప్పన్న స్వామి వార్షిక తిరుకల్యాణ  మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించాలా, లేక వైభవంగా బహిరంగంగా నిర్వహించాలా? అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విజృంభిస్తున్నందున అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజేషన్‌ చేసుకుంటా తమ ఆరోగ్యాన్ని.. తద్వారా సమాజ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు సూరిబాబు, దినేశ్‌కుమార్‌, నాగేశ్వరరరావు, నరసింగరావు నాయుడు, ఆశాకుమారి, పార్వతీదేవి, మాధవి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-14T06:38:05+05:30 IST