పండుగ పూట విషాదం

ABN , First Publish Date - 2021-01-16T06:24:58+05:30 IST

సంక్రాంతి, కనుమ పర్వదినాలను ఉమ్మడి జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

పండుగ పూట విషాదం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. భోగి, సంక్రాంతి, కనుమలను పేద, ధనిక తేడా లేకుండా ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద నూతన వస్త్రాలు ధరించి, పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  ఇదిలా ఉండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండుగ పూట ఐదు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పాత కక్షలతో ఇద్దరిని హత్య చేయగా, వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. 

నల్లగొండ: సంక్రాంతి, కనుమ పర్వదినాలను ఉమ్మడి జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇళ్ల  ముందు రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. పిండి వంటలు ఆరగించి పిల్లలు, పెద్దలు పతంగులు ఎగురవేస్తూ హుషారుగా గడిపారు. తెల్లవారుజామునుంచే సమీప దేవాలయాలకు వెళ్లి పూజల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని బ్రహ్మంగారిగుట్టపైన శ్రీకాశీవిశ్వేశ్వర స్వామిని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్‌  దర్శించుకొని పూజలు చేశారు. అదేవిధంగా రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయంలో అమ్మవారికి ఒడిబియ్యం, స్వామివారికి పవళింపు సేవను అర్చకస్వాములు నిర్వహించారు. తులసినగర్‌లోని భక్తాంజనేయస్వామి దేవాలయం, శేర్‌బంగ్లాలోని సంతోషిమాత ఆలయం, పానగల్లులోని వేంకటేశ్వర స్వామి, పచ్చల, ఛాయా సోమేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు మంత్రి జగదీష్‌రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు పట్టణ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ బహుమతులు అందజేశారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని శ్రీగోదా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేంకటేశ్వరస్వామిని వెన్నతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లాపాపలతో  వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 



నల్లగొండ జిల్లాలో ఇద్దరి దారుణహత్య

నల్లగొండ క్రైం/తిప్పర్తి, జనవరి 15: నల్లగొండ జిల్లాలో గురువారం రాత్రి వేర్వేరు చోట్ల ఇద్దరు హతమయ్యారు. వ్యక్తిగత కారణాలతో నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ యువకుడు, భూ తగాదాతో తిప్పర్తి మండలంలో మరొకరు దారుణ హత్యకు గురయ్యారు. నల్లగొండ పట్టణంలోని సావర్కర్‌నగర్‌కు చెందిన కొత్త సాయికిరణ్‌(28) అతని స్నేహితులు కలిసి గురువారం మధ్యాహ్నం మద్యం తాగారు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళ్లిన సాయికిరణ్‌ను స్నేహితుడు నీలం సాయి దావత్‌ ఇస్తానని మళ్లీ తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ శ్మశాన వాటికలో మద్యం తాగారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి నీలం సాయి పక్కనే ఉన్న బండరాయితో సాయికిరణ్‌ తలపై బలంగా మోది హత్య చేశాడు. అదే విధంగా తిప్పర్తి మండలం పజ్జూరులో భూ వివాదంలో గ్రామానికి చెందిన కంబాలపల్లి నాగయ్య(50) హత్యకు గురయ్యాడు. అతని వదిన లింగమ్మకు సంబంధించిన భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం ఉంది. నాగయ్యకు చెందిన భూమికి కాల్వ నీళ్లు లింగమ్మ పొలం నుంచి రావాలి. అయితే లింగమ్మకు నలుగురు కుమార్తెలు కాగా, ఓ కుమార్తెను అదే గ్రామానికి చెందిన నాతి కిరణ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఊర్లోనే ఉంటూ లింగమ్మ భూమి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నాగయ్య పెద్ద కుమారుడు ఉపేందర్‌కు, కిరణ్‌కు ఘర్షణ జరిగింది. ఇంటికి వచ్చిన ఉపేందర్‌ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు తిప్పర్తి పోలీ్‌సస్టేషన్‌లో కేసు పెట్టేందుకు బయలుదేరారు. ఇది తెలుసుకున్న కిరణ్‌ కుటుంబానికి చెందిన వారు, ఆమె అత్త లింగమ్మ కలిసి వెంకటాద్రిపాలెం సమీపంలోని చెరువు వద్ద ముందుగానే మాటువేసి కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన నాగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ఘటనల్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ఉమ్మడి జిల్లాలో పండుగపూట జరిగిన విషాదాల్లో ముగ్గురు మృతిచెందారు. చండూరు మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఏర్పుల గోపమ్మ కుటుంబం గత కొంత కాలంగా నల్లగొండలో ఉంటోంది. గురువారం ఆమె కుమారుడు గణేష్‌, మరిది కుమారుడు శివతో కలిసి మోటార్‌ సైకిల్‌పై రామన్నపేట మండలం ఉత్తటూర్‌ వెళ్తుండగా, చిట్యాల పోలీ్‌సస్టేషన్‌ వద్ద రోడ్డు క్రాస్‌ చేస్తుండగా హైదరాబాద్‌ నుంచి వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గోపమ్మను హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, శుక్రవారం మృతిచెందింది. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీనేత కందుల సైదులు (40) ద్విచక్రవాహనంపై పని నిమిత్తం మఠంపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి(21) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Updated Date - 2021-01-16T06:24:58+05:30 IST