పంటల బీమాపై సందిగ్ధం

ABN , First Publish Date - 2020-12-02T06:07:03+05:30 IST

పంటలను పూర్తిస్థాయిలో కోల్పోయిన రైతులకు పంటల బీమా వస్తుందా, రాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

పంటల బీమాపై సందిగ్ధం

ప్రీమియం చెల్లించకుంటే బీమా రానట్లే

పంట వివరాలు ఈ-క్రా్‌పలో నమోదై ఉంటేచాలంటున్న అధికారులు

ప్రీమియం చెల్లించామంటున్న బ్యాంకర్లు

అయోమయంలో రైతన్న 

 ఆంధ్ర జ్యోతి - మచిలీపట్నం :

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి  భారీవర్షాలు, వరదలు, నివర్‌ తుపానులు  రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. వరి. పత్తి ఇతర పంటలు చేతికి వచ్చే నవంబరు నెలలో నివర్‌ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి నేలవాలి నీటిలో రోజుల తరబడి నానుతూనే ఉంది. కంకుల నుంచి మొలకలొచ్చాయి. పంటలను పూర్తిస్థాయిలో కోల్పోయిన రైతులకు పంటల బీమా వస్తుందా, రాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం శాసనసభ సమావేశాల్లో రైతులకు పంటల బీమాకు సంబంధించిన సొమ్ము చెల్లించలేదని ప్రతిపక్ష నాయకులు వెలుగులోకి తేవడంతో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. వాణిజ్య బ్యాంకులు,  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పంట రుణాలు  తీసుకున్న రైతులు తమ పేరున పంటల బీమా ప్రీమియం చెల్లిచారా, లేదా అనే విషయంపై బ్యాంకు అధికారులను అడిగి తెసుకుంటున్నారు. 

3,16,669  హెక్టార్లలో పంటల సాగు  

జిల్లాలో ఈ ఏడాది  ఖరీఫ్‌ సీజన్‌లో  వరి 2.45లక్షలు, పత్తి 46వేలు, చెరుకు 11,500, మినుము 1400, పసుపు 2259, కంది 40, మిర్చి 11750, పెసలు,  మొక్కజొన్న4వేల హెక్టార్లతో కలిపి జిల్లా మొత్తం 3,16,669 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. ఉద్యాన పంటలు 1.07 లక్షల హెకార్లలో సాగు జరిగింది.  పంట రుణాలుగా ఖరీఫ్‌ సీజన్‌లో రూ. 4వేల కోట్లను  రైతులకు అందజేయాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. లక్ష్యంమేర పంటరుణాలు ఇచ్చారు. గతంలో పంట రుణాలు  తీసుకునే సమయంలోనే రైతుల పేరున పంటబీమాగా నిర్ధేశించిన  సొమ్మును బ్యాంకర్లు చెల్లించేవారు.  ఈ ఏడాది పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. అందుకే రైతులు బీమాను పట్టించుకోలేదు. 

1.26 లక్షల హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం  

నివర్‌ తుఫాను కారణంగా నవంబరు 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు 95,313 హెక్టార్లలో పంటలు నీట ముగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను  పంపారు. నీటమునిగిన వరిపైరు కాకుండా 31,406 హెక్టార్లలో పనలపై ఉన్న వరి పంట నీటిలోనే ఉందని అధికారులు లెక్క చూపారు. డిసెంబరు 15వ తేదీ నాటికి  పంటనష్టం అంచనాలు వివరాలు సేకరిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వరి పనలపై ఉన్న   పంటకు  కూడా బీమా వర్తిస్తుందని పెడన నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను ఇటీవల పరిశీలించిన సమయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. పంటల బీమా వర్తించకుంటే జిల్లాలో  6 లక్షల మంది  రైతుల్లో 1.64 లక్షల మంది కౌలు రైతులు పోను మిగిలిన రైతులకు పంటబీమా అందకుండాపోయే ప్రమాదం ఉంది. 

ఈ-క్రాప్‌లో నమోదై ఉంటే చాలు   

  ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదై ఉంటే మారిన నిబంధనల ఆధారంగా పంటల బీమా అమలవుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.  


Updated Date - 2020-12-02T06:07:03+05:30 IST