విద్యార్థి ఇంటి వద్దకే పేపర్‌

ABN , First Publish Date - 2021-07-25T05:07:41+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 27 నుంచి 31 వరకూ బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒకటో తరగతి నుంచి పది వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నవంబరు వరకూ పాఠశాలలు తెరవలేదు.

విద్యార్థి ఇంటి వద్దకే పేపర్‌

27 నుంచి బేస్‌లైన్‌ పరీక్షలు 

ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం నిర్వహణ 

సామర్థ్యం గుర్తింపునకు చర్యలు

కలెక్టరేట్‌, జూలై 24:

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 27 నుంచి 31 వరకూ బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒకటో తరగతి నుంచి పది వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నవంబరు వరకూ పాఠశాలలు తెరవలేదు. చివరిలో తెరిచినా కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వారంలో పాఠశాలలను మూసివేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకోవడానికి ఈ బేస్‌లైన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. గత తరగతిలో చదువుకున్న పాఠాల ఆధారంగా ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రశ్న పేపర్లను ఉపాధ్యాయులు తయారు చేసుకోవాలి. దీనికి ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలి. తెలుగు, ఆంగ్లమాధ్యమంలో విడివిడిగా పేపర్లు తయారు చేయనున్నారు. ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు లెవెల్‌ 1, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రెండో స్థాయి, 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్‌ కారణంగా విద్యార్థులు పాఠశాలకు రానవసరం లేదు. నేరుగా ఈ ప్రశ్నపేపర్లను జిరాక్స్‌ తీసి ఉపాధ్యాయులే విద్యార్థి ఇంటికి వెళ్లి అందజేయాలి. తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులకు సకాలంలో అందజేయాలి. పరీక్ష రాసిన అంనతరం తిరిగి తల్లిదండ్రుల ద్వారా సమాధాన పత్రాలను ఉపాధ్యాయులు తీసుకోవాలి. పరీక్షలు ఈనెల 27 నుంచి 31 వరకూ ఉంటాయి. 28వ తేదీ నుంచి వచ్చే నెల 3 వరకూ మూల్యాంకనం, ఆగస్టు 4 నుంచి 10 వరకూ పోర్టల్‌లో మార్కుల అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఇంటి వద్ద పరీక్షలు రాస్తే నిబంధనలు పాటిస్తారా? లేదా? అనేది తెలియాలి. పాఠశాలలో అయితే ఉపాధ్యాయుల సమక్షంలో రాస్తారు కనుక ఖచ్చితంగా వారి సామర్థ్యం బయట పడుతుంది. ఇంటి వద్ద రాయడం వల్ల సరైన సృష్టత రావడం కష్టమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా విద్యా శాఖ అధికారి జి.నాగమణి వద్ద ప్రస్తావించగా ఈనెల 27 నుంచి 31 వరకూ ప్రభుత్వ పాఠశాల ల విద్యార్ధులకు  బేస్‌లైన్‌ టెస్టు నిర్వహించాలని ప్రభుత్వం అదేశాలు ఇచ్చిందన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలు తయారు చేస్తున్నారని, నేరుగా విద్యార్థి ఇంటికే అందజేస్తారని తెలిపారు.  ప్రతి విద్యార్థి పక్కాగా పరీక్ష రాస్తే వారి సామర్థ్యం బయట పడుతుందన్నారు. 


Updated Date - 2021-07-25T05:07:41+05:30 IST