‘పేపర్‌’ పోయే..! కర్ర మిగిలే !!

ABN , First Publish Date - 2021-08-19T05:19:42+05:30 IST

సుబాబుల్‌ సాగు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఓ పేపరు పరిశ్రమ స్థాపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో దానికి అంకురార్పణ జరిగింది. ఇండోనేషియాకు చెందిన ఏషియన్‌ పేపర్‌ అండ్‌ పల్ప్‌ కంపెనీ ‘ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌’ పేరుతో గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో భారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25వేల మందికి ఉపాధి కల్పిస్తూ రూ.24వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు ఇండోనేషియా సంస్థ సిద్ధమైంది.

‘పేపర్‌’ పోయే..! కర్ర మిగిలే !!
ప్రభుత్వ హయాంలో పేపర్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో ఏపీపీ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన పైలాన్‌ (ఫైల్‌)

జిల్లాలో పేపరు పరిశ్రమ ఏర్పాటు కలేనా?

గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమ వెనక్కి 

ఆశలు పెట్టుకున్న ‘కర్ర’ రైతులు, నిరుద్యోగులు

సుబాబుల్‌, జామాయిల్‌ రైతుల కష్టాలు రెట్టింపు

టన్నుకు దక్కేది రూ.1500లోపే

అవి దుంపలు తీయడానికి కూడా సరిపోవు

కర్ర సాగు నుంచి వైదొలుగుతున్న రైతులు

ఒంగోలు(జడ్పీ),  ఆగస్టు 18 : కర్ర రైతు సర్కారు నిర్లక్ష్యానికి బలయ్యాడు. గిట్టుబాటు ధర దేవుడెరుగు కనీసం కొనేవారు లేరు. దీంతో పదేళ్ల తోటలు అలాగే ఉసూరుమంటూ రైతుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు మూడు లక్షల ఎకరాల్లో సాగయ్యే సుబాబుల్‌, జామాయిల్‌ ఇప్పుడు లక్ష ఎకరాలకు పడిపోయింది. టన్నుకు రూ.4వేలకు పైబడి పలికే ధర...ఇప్పుడు రూ.1600కు దిగజారింది. లక్షకుపైబడే ఉండే రైతుల సంఖ్య 50వేలకు చేరింది. జిల్లాలో జామాయిల్‌, సుబాబుల్‌ చెట్ల పెంపకానికి అనువైన పరిస్థితులు ఉన్నా ప్రభుత్వ తోడ్పాటు కరువై ఈ రంగం కునారిల్లుతోంది. ఎన్నో ఆశలు మోసుకొచ్చి ఊరించిన భారీపేపర్‌ పరిశ్రమ కాస్తా ఉసూరుమనిపించి వెనక్కి వెళ్లిపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడి దారుల అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న వేళ తమ గోడు వినే నాథుడే లేక కర్ర రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పేపరు తయారీకి వాడే గుజ్జు దిగుమతులపై కేంద్రం సుంకం ఎత్తివేయడంతో పారిశ్రామికవేత్తలు కూడా అటువైపే మొగ్గుచూపడం మొదలెట్టారు. దీంతో డిమాండ్‌ లేక డీలర్ల ఇష్టారాజ్యంగా మారింది. 

 సుబాబుల్‌ సాగు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఓ పేపరు పరిశ్రమ స్థాపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో దానికి అంకురార్పణ జరిగింది. ఇండోనేషియాకు చెందిన ఏషియన్‌ పేపర్‌ అండ్‌ పల్ప్‌ కంపెనీ ‘ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌’ పేరుతో గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో భారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25వేల మందికి ఉపాధి కల్పిస్తూ రూ.24వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు ఇండోనేషియా సంస్థ సిద్ధమైంది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా 2019 జనవరిలో శంకుస్థాపన కూడా జరిగింది. ఇక్కడి కర్ర రైతుల కష్టాలతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారమవుతుందని జిల్లా వాసులు ఆశపడ్డారు. కానీ నాలుగు నెలల్లోనే అధికారం చేతులు మారడంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఆ కంపెనీకి ప్రస్తుత ప్రభుత్వం భూకేటాయింపుల విషయంలో మోకాలొడ్డడంతో అది కాస్తా పక్క రాష్టాలకు వెళ్లిపోయింది. జిల్లావాసుల ఆశలు అడియాసలయ్యాయి. రాజకీయ వ్యవహారాలకు సుబాబుల్‌ రైతులు బలయ్యారు. ఆ తర్వాతైనా మరో పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయలేకపోయింది. కావలసినన్ని ప్రభుత్వ భూములు అందుబాటులోనే ఉన్నా ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా వెనకబడే ఉండిపోయింది. ఆ పరిశ్రమే  ఇక్కడ నెలకొల్పి ఉంటే తమ  పరిస్థితులు మరోలా ఉండేవని కర్రరైతులు వాపోతున్నారు. వేల మందికి ఉద్యోగాలు దొరికేవి. వలసలు తగ్గేవి. రైతుల బతుకులు బాగుపడేవి. సాగు విస్తీర్ణం మరింతగా పెరిగేది. ఇవేవీ పట్టని ఈ ప్రభుత్వం సుబాబుల్‌, జామాయిల్‌ రైతులు, నిరుద్యోగుల ఆశల ‘పేపరు’పై ఎర్రసిరా చల్లేసింది

ఒప్పంద ధరలు గాలికి...

2015లో జామాయిల్‌కు టన్నుకు రూ.4,400, సుబాబుల్‌కు రూ.4,200 ధరలు అందించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. క్రమక్రమేణా ఆ ఒప్పందానికి కంపెనీలు తూట్లు పొడుస్తూ డీలర్ల ద్వారా అతి తక్కువ ధరకు కర్రను కొనుగోలు చేస్తూ ఒప్పంద ధరలను గాలికొదిలేశాయి. ప్రస్తుతం జామాయిల్‌, సుబాబుల్‌ కర్రకు ధర టన్నుకు రూ.1,600లోపే అందడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ జోక్యం కొరవడటంతో గతంలో ఒక కంపెనీ రూ.19.50కోట్ల మేర రైతులకు ఎగవేయడంతో వాటిని వసూలు చేసుకోవడానికి జిల్లాలోని జామాయిల్‌ రైతుల పోరాటమే చేయాల్సి వచ్చింది.

మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలు...

అన్ని పంటల్లాగానే కర్రను కూడా మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ దిశగా కొన్ని అడుగులు కూడా పడ్డాయి. అయితే కర్ర కొనుగోలు రూపంలో మార్కెట్‌ కమిటీలు వ్యాపారం చేస్తున్నాయని చెప్పి ఆదాయపు పన్ను శాఖ వారు పన్ను విధించడంతో అదనపు భారం పడుతోందని మార్కెట్‌ కమిటీలు కర్ర కొనుగోలు నుంచి వైదొలిగాయి. ప్రస్తుతం కంపెనీలు డీలర్లను ఏర్పాటు చేసుకుని వారికిష్టం వచ్చిన ధరలకు కర్రను కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచేస్తున్నాయి

జిల్లాలోనే అధికశాతం సాగు...

సామాజికవనాలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణంలో దాదాపు 50శాతం వరకు గతంలో జిల్లాలోనే ఉండేది. 3లక్షల ఎకరాలకుపైగా సాగయ్యే దశ నుంచి ప్రస్తుతం లక్ష ఎకరాలకు తగ్గింది. చీమకుర్తి, అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో ఎర్ర నేలలు, గరప నేలలు అధికంగా ఉండటంతో అక్కడి రైతాంగం ఎక్కువగా జామాయిల్‌ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. నల్లరేగడి భూముల్లో అధికంగా సుబాబుల్‌ నాటుతున్నారు

పేపరు కంపెనీలు నేరుగా కొనుగోలు చేయాలి

కర్రను డీలర్ల ప్రమేయం లేకుండా ఒప్పంద ధరకు కంపెనీలే నేరుగా కొనే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కర్ర రైతాంగం కోరుతోంది. ఒకప్పుడు  ఆంధ్రా పేపర్‌ మిల్‌గా పేరుగాంచి ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ పేపర్‌ మిల్‌గా పిలవబడుతున్న ఒకేఒక్క కంపెనీ మాత్రమే విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఉంది. అవసరాలకు తగ్గట్లు ఇంకో పేపరు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపించాలని రైతాంగం కోరుకుంటోంది. అదేవిధంగా గతంలో మాదిరిగా ఏఎంసీల ద్వారా కర్రను కొనుగోలు చేయించాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విదేశాల నుంచి కంపెనీలు కొనుగోలు చేసే గుజ్జుపై దిగుమతి సుంకాన్ని విధించడం ద్వారా కొంతమేర నియుంత్రించవచ్చని తద్వారా కర్రకు డిమాండ్‌ పెరిగి మంచి ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఆర్‌బీకేలలో కర్ర వివరాలు నమోదు చేయించుకుని వాటి కొనుగోలు బాధ్యతలను కూడా ప్రభుత్వం చేపట్టాలని జిల్లా రైతాంగం వేడుకుంటోంది

దిగుమతి సుంకం విధించాలి:

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే గుజ్జుపై కేంద్రం సుంకం విధించాలి. దాని ద్వారా ఇక్కడి కరక్రు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో పేపరు పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించాలి. జామాయిల్‌కు బెరడు తీసి విక్రయించాలనే నిబంధనకు మినహాయింపు ఇవ్వాలి. దీని వల్ల రైతులకు కొంతమేర ఖర్చు కలిసి వచ్చే అవకాశముంది. 2015 నాటి ఒప్పంద ధరలను అమలు చేస్తూ ఏఎంసీల ద్వారా కర్రను కొనుగోలు చేయాలి. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి అధీకృత ఏజెంట్‌ల ద్వారానే కొనుగోళ్లు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుంది.

--కె. వీరారెడ్డి, జిల్లా సామాజిక వనరైతుసంఘం అధ్యక్షులు  


 



Updated Date - 2021-08-19T05:19:42+05:30 IST