‘పారాబాయిల్డ్‌’ ఇక మూతే!

ABN , First Publish Date - 2021-12-06T05:05:05+05:30 IST

ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైస్‌మిల్లులకు గడ్డుకాలం రానున్నది. పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉన్నదని యజమానులు వాపోతున్నారు.

‘పారాబాయిల్డ్‌’ ఇక మూతే!
సిద్దిపేటలోని ఓ రైస్‌మిల్‌లో ధాన్యం బస్తాలను అన్‌లోడ్‌ చేస్తున్న కార్మికులు

ఉప్పుడు బియ్యం తీసుకోలేమని తేల్చిన కేంద్రం   

వరి సాగు వద్దంటున్న రాష్ట్ర ప్రభుత్వం

జిల్లాలో 53 పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు  

ఆందోళనలో యజమానులు, కార్మికులు


సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 5 : ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైస్‌మిల్లులకు గడ్డుకాలం రానున్నది. పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉన్నదని యజమానులు వాపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఏర్పాటు చేస్తే వరి సాగు చేయకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత నిర్ణయానికి బదులుగా దశలవారీగా వరి సాగును తగ్గిస్తే ఈలోపు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే అవకాశం ఉంటుందని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


జిల్లాలో 142 రైస్‌మిల్లులు 

 జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్ల పరిధిలో రెండు టన్నుల నుంచి 8 టన్నుల సామర్థ్యం కలిగిన 142 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో 53 పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లులు, 89 సాధారణ మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం రైతులు సాగు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మిల్లులకు తరలించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి  పంపిస్తున్నది. దీంతో రైస్‌మిల్లులకు చేతినిండా పని దొరుకుతున్నది. ప్రతీ రైస్‌మిల్లుకు సామర్థ్యం ప్రకారం 15 వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 60 వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తున్నది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. మర ఆడించినందుకు ప్రభుత్వం మిల్లులకు డబ్బు చెల్లిస్తుంది. కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతున్నది.


పుష్కలంగా జలాలు 

జిల్లాలో జలవనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు వరి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని నింపేందుకు నీటిని ఎత్తి పోస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా వస్తున్నది. దీంతో మూడేళ్లుగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 3.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. యసంగిలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశారు. అత్యధికంగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు. 


వరి సాగుపై ఆంక్షలు

కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని సేకరించబోమని తేల్చిచెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు సూచించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీవల మీడియాలో స్వయంగా వెల్లడించారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు తెరవబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వరి సాగును తగ్గించడానికి, ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను మల్లించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో సదస్సులు ఏర్పాటుచేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 


మిల్లుల భవిష్యత్తు అగమ్యగోచరం

పారాబాయిల్డ్‌ రైస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకోనందున యాసంగిలో ధాన్యాన్ని సేకరిచలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వమే ధాన్యం కేటాయిస్తుండటంతో పలువురు రూ. కోట్లు ఖర్చుచేసి మిల్లులను ఏర్పాటు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్‌ బియ్యం సేకరించబోమని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించలేమని తేల్చి చెప్పడంతో మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన రైస్‌మిల్లులు మూతపడేటట్టు ఉన్నాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులను నమ్ముకున్న హమాలీలు, కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. పారాబాయిల్డ్‌ మిల్లు నడిపించాలంటే దాదాపు వందకు పైగా మంది హమాలీ కార్మికులు, ఆపరేటర్స్‌ పనిచేయాల్సి ఉంటుంది. దాదాపు వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. వీరంతా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

Updated Date - 2021-12-06T05:05:05+05:30 IST