‘ఆంధ్రజ్యోతి‘ విలేకరి ఇంటిపై TRS కార్యకర్తల దాడికి యత్నం.. పట్టించుకోని పోలీసులు

ABN , First Publish Date - 2021-10-09T14:47:32+05:30 IST

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. బుధవారం బతుకమ్మలపై దూసుకెళ్లిన ఘటనలో ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైంది. మా ఎమ్మెల్యేపై వార్త రాస్తావంటూ..టీఆర్ఎస్ కార్యకర్తలు నానా హంగామా చేశారు.

‘ఆంధ్రజ్యోతి‘ విలేకరి ఇంటిపై TRS కార్యకర్తల దాడికి యత్నం.. పట్టించుకోని పోలీసులు

హన్మకొండ/వరంగల్ : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. బుధవారం ‘బతుకమ్మలపై దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు’ అనే వార్తను ‘ఆంధ్రజ్యోతి’ ప్రధానంగా ప్రచురించింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఆ వార్త రాసిన ఆత్మకూరు ఆంధ్రజ్యోతి విలేకరి ప్రభాకర్ ఇంటిపై దాడికి యత్నించారు. ‘మా ఎమ్మెల్యేపైనే వార్త రాస్తావా..’ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నానా హంగామా చేశారు. ‘జై చల్లా.. జై జై చల్లా..’ అంటూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. సుమారు 50 మందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ ఉదయం ఇలా వీరంగం సృష్టించారు. జరిగిన విషయాన్ని వార్తగా రాస్తే తప్పేంటి..? చేసిందే తప్పయితే దానికి మళ్లీ ఇలా ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు సిగ్గుపడాల్సింది పోయి.. ఇలా దాడి చేయాలని అనుకోవడమేంటి..? అని ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ యూనియన్‌లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 


పోలీసులు పట్టించుకోలేదేం..!?

అయితే విలేకరి ఇంటికి ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. ఇంత జరుగుతున్నా పోలీసులు అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత హంగామా చేస్తున్నా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా ఒక్కరంటే ఒక్క ఖాకీ కూడా స్పందించకపోవడం.. కనీసం దాడిని ఆపకపోవడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి పరకాలలోని ఆత్మకూరులో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికీ పోలీసులు దీనిపై స్పందించి.. ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోలేదు.


బుధవారం అసలేం జరిగింది..!?

మహిళలంతా బతుకమ్మలతో వచ్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఓ కారు ఆ బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది. దీంతో బతుకమ్మలు చెల్లాచెదరయ్యాయి. అది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనం. ఆ సమయంలో ఆయన వాహనంలోనే ఉన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. గ్రామస్థులను పోలీసులు తోసేయడంతో కొందరు సోమ్మసిల్లి కిందపడిపోయారు. 

Updated Date - 2021-10-09T14:47:32+05:30 IST