సమాంతర సాహిత్య స్రష్ట

ABN , First Publish Date - 2021-09-07T05:58:37+05:30 IST

మాష్టార్జీ తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రధాన సాహిత్యం అంత త్వరగా ఇముడ్చుకోలేని సూటిదనం ఆయనది. ఒరను కూడా చీల్చుకొని వచ్చే రెండంచుల కత్తి ఆయన....

సమాంతర సాహిత్య స్రష్ట

మాష్టార్జీ తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రధాన సాహిత్యం అంత త్వరగా ఇముడ్చుకోలేని సూటిదనం ఆయనది. ఒరను కూడా చీల్చుకొని వచ్చే రెండంచుల కత్తి ఆయన. మచ్చబొలారంలో పుట్టి దేశమంతటా విస్తరించిన కవి, గాయకుడు, ప్రదర్శన కళాకారుడు, ప్రజా వాగ్గేయ కారుడు. భక్తి పాటల నుండి దేశభక్తి పాటలకు మలుపు తిరిగిన మాష్టార్జీ సాహిత్యం సామాజిక అసమానతలపై ఎక్కుపెట్టిన సమాంతర సాహిత్యం. 


డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, మాన్యవర్ కన్షీరాంల భావజాలంతో, భారత రాజ్యాంగ లక్ష్యాల సాధనలో మాష్టార్జీ సాహిత్యం ముందుకు సాగింది. దానికి మాష్టార్జీ మూలవాసుల సిద్ధాంతాన్ని జోడించి పరిపుష్టం చేశారు. 1952 సెప్టెంబర్ 7న పుట్టిన గంగధరి శ్రీరాములు తర్వాతి కాలంలో మాష్టార్జీగా ప్రసిద్ధుడయ్యారు. తన పుట్టిన తేదీకి ఒక సార్థకత ఉండాలని 1978 సెప్టెంబర్ 7న తన మిత్రులు అశోక్ కుమార్ తదితరులతో కలిసి దళిత కళామండలిని స్థాపించారు. తన రచనల్లో ఫూలే, సావిత్రి బాయి, అంబేడ్కర్, కన్షీరామ్, పెరియార్ల భావజాలాన్ని, భారత రాజ్యాంగ విశిష్టతను, మూలవాసుల సిద్ధాంతాన్ని మేళవించి కవిత్వీకరించారు. వీటిని గానమయం, ప్రదర్శన యోగ్యం చేసి లక్షలాది మందిని చైతన్య పరిచారు. 


గద్దర్, గూడ అంజయ్య, జయరాజ్, గోరటి వెంకన్న, అందెశ్రీ, వంటి వాగ్గేయకారుల్లో మాష్టార్జీది ప్రత్యేక స్థానం. కొన్ని విషయాలలో గురు స్థానం కూడా. గద్దర్ నేతృత్వంలోని జన నాట్య మండలిలో సంగీత నృత్య రూపకాలకు, ఒగ్గు కథలకు, బ్యాలేలకు అడుగులు, నృత్యాలు నేర్పిన గురువు మాష్టార్జీ. తాండూరులో పిల్లలకు నృత్యం నేర్పిస్తున్నపుడు వారు మాష్టార్జీ అని సంబోధిస్తుంటే ఇదేదో బాగానే ఉందని అప్పటినుంచి దాన్నే పేరుగా చేసుకున్నారు. జన నాట్య మండలికి తన వంతు సహకారం అందించిన మాష్టార్జీ వర్గ దృక్పథంతో ఆగిపోకుండా, ఈ సమాజం వర్ణ కుల నిర్మితమని గుర్తించి అసమానతలకు, అణచివేతలకు, అవమానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. 


1977 నుంచి అంబేడ్కర్ సంఘాల సభలకు మాష్టార్జీ పెద్ద దిక్కయ్యారు. యువతరానికి స్ఫూర్తినిచ్చారు. 1980ల తర్వాత దళిత సాహిత్యంలో ట్రెండ్ సెట్టర్ అయ్యారు. సమకాలికులు ఈ విషయం అంగీకరించడానికి చాలాకాలమే పట్టింది. 1992లో ‘దరకమే’ (దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక) ఏర్పడి సాహిత్యాన్ని, భావజాలాన్ని మలుపు తిప్పిన తరువాత, బహుజన సమాజ్ పార్టీ లక్షలాది జనంతో సభలు నిర్వహించే క్రమంలో మాష్టార్జీ వాటికి ప్రతీకగా ప్రతినిధిగా ఎదిగారు. బి.ఎస్. రాములు నాయకత్వంలో సాగిన దరకమే ఐక్య వేదికకు మాష్టార్జీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ వేదిక ఆధ్వర్యంలో సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత భాష దేశ ప్రాంత అసమానతలు నిర్మూలించే సాహిత్య, తాత్విక, సామాజిక, సాంస్కృతిక ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా మాష్టార్జీకి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. తన పాటకు, దళిత కళా మండలికి ఉన్న ప్రాచుర్యం ముందు ఈ ప్రధాన కార్యదర్శి పదవి చిన్నదైపోయింది. 


1996 నుంచి వేగం పుంజుకున్న మలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాష్టార్జీ మమేకం కాలేకపోయారు. ఇది అంతిమంగా అగ్రకులాల ఆధిపత్యానికే అంటూ ఒక దశలో వ్యతిరేకించారు కూడా. వారి దూరదృష్టి ఎంత సత్యమో చరిత్ర తేటతెల్లం చేసింది. ఉద్యమంలో పాల్గొంటూనే గద్దర్ మనది కాని యుద్ధంలో మనం బలి కాకూడదంటూ హెచ్చరించినా ఎందరో ఆత్మత్యాగం చేశారు. లక్షలాది ప్రజల త్యాగ ఫలితం నేడు ఒక కుటుంబ పరిపాలనకు పరిమితమై ఒక సామాజిక వర్గం హస్తగతమైంది. ఇందుకేనా ఇన్ని పోరాటాలు చేసిందన్న నిర్వేదంలో పడిపోయిన యువతరాన్ని నేడు చూస్తున్నాం. 


మాష్టార్జీకి ముందు చూపు సరైనదే అయినా ఉద్యమంలో పాల్గొనకపోవడం చారిత్రక తప్పిదమే. తద్వారా రెండు దశాబ్దాలపాటు కనుమరుగైనంత పనైంది. కొండాలక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో సాగిన బీసీ ఎస్సీ కులాల ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అపుడపుడు రాసినప్పటికీ మాష్టార్జీ కొన్ని శ్రేణులకే పరిమితమయ్యారు. మరో విధంగా మేలు చేశారు. ఒక గొప్ప యువతరం ఉద్యమంలో ఎదిగి వచ్చింది. 2010 నాటికి కొన్ని పాటలు రాసి ఉస్మానియా యూనివర్సిటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


ఈ 70వ జన్మదినం నాటికి మాష్టార్జీ తిరిగి ప్రధాన స్రవంతిలో భాగం కావడం సంతోషకరమైన విషయం. ఆయన దళిత పాటలతో అంబేడ్కర్, మూలవాసీ దృక్పథంతో మలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వుంటే తెలంగాణ ఉద్యమం మరో తీరుగా సాగి బహుజన నాయకత్వం బలపడి ఉండేది. అంతటి బలమైన పాటలు రాశారు. 


ఎన్ని ప్రక్రియల్లో రాసినా భావజాలమే మాష్టార్జీ బలం. భావం, ట్యూన్, కవిత్వీకరణ ఏది గొప్పది అని విడదీసి చెప్పలేని విధంగా ముప్పేటగా కలిసిన గొప్ప పాటలు మాస్టార్జీ ఉద్యమ పాటలు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, లక్ష్మిదేవిపల్లి వంటి సంఘటనల సందర్భంగా రాయవలసినన్ని పాటలు రాయలేదు. అవి తాత్కాలికమైనవనీ సాహిత్యం దీర్ఘకాలం నిలిచి వుండాలని మాష్టార్జీ భావించారు. కాని ఆయా సందర్భాలకు రాసే పాటలు చరిత్రను ఉద్యమాలను మలుపు తిప్పి చరిత్ర సృష్టిస్తాయి. ‘ఈ దేశం నీదన్నగాని రాజ్యం నీదన్ననా!’, ‘చేతిలో కత్తేది లేదు. చంకలో తుపాకి లేదు’, ‘ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బాంధవులు’, ‘జోజోర దళితన్న జోర దళితన్న’, ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా!’ ఇలాంటి పదిపాటలు ప్రతి రాజకీయ, ఎన్నికల సభలలో పాడితే ఇప్పుడు కూడా బహుజన చైతన్యం పురివిప్పుతుంది.


బీసీలు, ఎస్సీలు తెలంగాణలో అధికారంలోకి రావడానికి మాష్టార్జీ పాటలు పదునైన ఆయుధాలు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒకసారి కోల్పోయిన అవకాశాన్ని చరిత్ర ఇపుడు మళ్లీ మాష్టార్జీ ముందుకు తెచ్చింది. యువతరానికి అనువుగా మరిన్ని కొత్త పాటలతో మళ్ళీ గజ్జె కట్టాల్సి ఉంది. మాష్టార్జీ స్థానాన్ని మరెవ్వరూ పూరించలేకపోయారు. అంతటి నిశిత పరిశీలనతో, వర్ణ కుల వ్యవస్థ, మను ధర్మాల మూలాలను ఛేదించే సాహిత్యాన్ని అంత బలంగా రాయడం మాష్టార్జీకే సాధ్యపడింది. దేశవ్యాప్తంగానే గాక 2001లో దక్షిణాఫ్రికా డర్బన్‌లో బ్లాక్ ఈజ్ బ్యూటీ అనే పాటతో ఉర్రూత లూగించారు. 2011లో ఆస్ట్రేలియా సిడ్నీలో పాట ప్రదర్శనలతో అలరించారు. మాష్టార్జీ ఐదు పాటల పుస్తకాలు, పది నాటికలు, ఒక కవితా సంపుటి, జనకథ అనే ప్రదర్శన రూపకాన్ని రూపొందించారు. ‘వంద గొంతులు వెయ్యి డప్పులు’ అనే ప్రక్రియను ముందుకు తెచ్చారు. దశాబ్దాల సహచరుడు మాష్టార్జీకి 70వ జన్మదిన సందర్భంగా అభినందనలు.

బి. ఎస్. రాములు



Updated Date - 2021-09-07T05:58:37+05:30 IST