terrorist Ajmal Kasab మొబైల్ ఫోన్‌ను పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశాడు...మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-26T14:31:31+05:30 IST

ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌పై రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ పఠాన్ సంచలన ఫిర్యాదు చేశారు....

terrorist Ajmal Kasab మొబైల్ ఫోన్‌ను పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశాడు...మాజీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఫిర్యాదు

ముంబై (మహారాష్ట్ర):ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌పై రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ పఠాన్ సంచలన ఫిర్యాదు చేశారు. 26/11 ఉగ్రదాడి దోషి అయిన పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్చవాది మహ్మద్ అజ్మల్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశారని రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ పఠాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పఠాన్ ఈ ఏడాది జులై నెలలో ముంబై పోలీసు కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు.ఈ మొత్తం విషయంపై దర్యాప్తు చేసి సింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పఠాన్ కోరారు. 


పఠాన్ నాలుగు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ, గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అవినీతి కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సింగ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరవడంతో తాజాగా తెర మీదకు వచ్చింది. కసబ్ ఫోన్ బాగోతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది.ఈ ఏడాది మార్చిలో అవినీతి ఆరోపణలపై పరమ్‌బీర్ సింగ్‌ను ముంబై పోలీసు చీఫ్ పదవి నుంచి తొలగించారు.  అతని స్థానంలో సీనియర్ ఐపిఎస్ అధికారి హేమంత్ నాగ్రాలే ముంబై సీపీగా బాధ్యతలు చేపట్టారు.కసబ్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఆ ఫోన్‌ను కానిస్టేబుల్‌కు అప్పగించామని డీబీ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ఆర్‌ మాలీ తనకు తెలియజేసినట్లు పఠాన్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 


అప్పటి డీఐజీ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్)గా ఉన్న పరమ్‌బీర్ సింగ్‌ కానిస్టేబుల్ నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నారని మాజీ పోలీసు అధికారి పఠాన్ ఆరోపించారు. ‘‘26/11 ముంబై ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారి రమేష్ మహాలేకు సింగ్ ఫోన్‌ను అందజేయాల్సి ఉందని, అయితే అతను ముఖ్యమైన సాక్ష్యాన్ని ధ్వంసం చేశాడు’’ అని పఠాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి పరమ్‌బీర్ సింగ్ అందుబాటులో లేరు. 13 ఏళ్ల క్రితం ముంబైలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాది కసబ్ ను పోలీసులు సజీవంగా పట్టుకున్నారు.కసబ్ కేసును సుప్రీంకోర్టు విచారించి నిర్ధారించిన తర్వాత 2012 నవంబరు నెలలో అతన్ని ఉరితీశారు.


Updated Date - 2021-11-26T14:31:31+05:30 IST