నవగుంజర రూపంలో పరమాత్మ!

ABN , First Publish Date - 2020-09-25T05:30:00+05:30 IST

మహా వీరుడైన అర్జునుడు ఒక పర్వతం మీద తపో దీక్షలో ఉన్నాడు. ఏదో అలికిడితో అతనికి తపోభంగమయింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక విచిత్రమైన జంతువు నిలిచి ఉంది...

నవగుంజర రూపంలో పరమాత్మ!

మహా వీరుడైన అర్జునుడు ఒక పర్వతం మీద తపో దీక్షలో ఉన్నాడు. ఏదో అలికిడితో అతనికి తపోభంగమయింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక విచిత్రమైన జంతువు నిలిచి ఉంది. అది అంతటి యోధుడికి సైతం సంభ్రమాన్నీ, భయాన్నీ కలిగించింది. 


కోడి తల, నెమలి మెడ, సింహం నడుము, ఎద్దు మూపురం, తోకగా ఒక సర్పం, ఒక కాలు ఏనుగుది, మరో కాలు సింహానిది, మూడో కాలు గుర్రానిది, నాలుగో కాలికి బదులు తామర పువ్వు పట్టుకున్న మనిషి చెయ్యి... ఇదీ దాని ఆకారం. వెంటనే అర్జునుడు విల్లు అందుకున్నాడు. ఆ వింత జంతువు తన మీద దాడి చెయ్యడానికి ముందే దాన్ని మట్టు పెట్టాలని బాణం సంధించాడు. 


ఇంతలో అతని దృష్టి ఆ జంతువు చేతిలోని తామర పువ్వు మీద పడింది. ఆ క్షణంలోనే అతనికి అవగతమయింది... ఆ రూపంలో వచ్చినవాడు పరమాత్మ అని! వెంటనే బాణం వదిలేశాడు. దాని ముందు మోకరిల్లి ప్రార్థించాడు. ఒరియా భాషలో సరళ దాస్‌ రచించిన మహాభారతంలోని ఒక ఘట్టం ఇది. తొమ్మిది జీవుల లక్షణాలున్న ఆ జంతువే ‘నవగుంజర’. అంటే ‘తొమ్మిది గుణాలు ఉన్నది’ అని అర్థం. అంతిమమైన సత్యం ఒకటే అయినా అది వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఆ రూపాల్లోని విశిష్టతను గ్రహించాలి. ఆ సత్యాన్ని ఏకోన్ముఖంగా చేరుకోవాలి. ఈ విషయాన్ని అర్జునుడికి బోధించాలన్నది భగవంతుడి సంకల్పం. ఆయన నవకుంజర రూపంలో దర్శనమివ్వడం వెనుక ఆంతర్యం అదేనన్నది పెద్దల మాట. 


ఒడిశా సంస్కృతిలో, కళల్లో నవగుంజరకు సముచిత స్థానం ఉంది. అక్కడ ప్రసిద్ధమైన పటచిత్ర కళలో నవగుంజర ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో ఆడే ప్రాచీనమైన గంజిఫా ముక్కల ఆటలోనూ నవగుంజర చోటుచేసుకుంది. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో ఎడమ వైపు ‘అర్జునుడు- నవగుంజర’ ఘట్టాన్ని చెక్కారు. ఆ ఆలయ పైభాగాన ఉన్న నీల చక్రం దగ్గర ఎనిమిది నవగుంజరలు తీర్చి ఉంటాయి.

Updated Date - 2020-09-25T05:30:00+05:30 IST