పారా మెడికల్స్ మన తక్షణావసరం!

ABN , First Publish Date - 2020-08-13T07:25:42+05:30 IST

కరోనా వైరస్‌ మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాలలో ఒకటిగా మన దేశం నిలిచింది. మరణాల రేటు రాబోయే రోజుల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి...

పారా మెడికల్స్ మన తక్షణావసరం!

నర్సులు, టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి సంబంధించిన కొరతను నివారించేందుకు ప్రభుత్వాలే ఎఎన్‌ఎం/జిఎన్‌ఎం కళాశాలలను అధిక సంఖ్యలో నిర్వహించాలి. ప్రస్తుత ఆపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రతిసబ్‌ డివిజన్‌లోనూ కనీసం ఒక నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి. టెక్నీషియన్స్‌, లాబ్‌ అసిస్టెంట్స్‌ కొరతను తీర్చేందుకు డిప్లమా ఇన్‌ మెడికల్‌ అండ్ లాబ్‌ టెక్నీషియన్‌ ట్రైనింగ్‌ కేంద్రం ఒకదాన్ని ప్రతి సబ్ డివిజన్‌లోనూ తప్పక ఏర్పాటు చేయాలి. 


కరోనా వైరస్‌ మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాలలో ఒకటిగా మన దేశం నిలిచింది. మరణాల రేటు రాబోయే రోజుల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విధంగానే మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మొదలుకొని నేటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న స్థిరమైన నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడుకున్న విధానాల అమలు వలన రికవరీ రేట్‌ కూడా పెరిగింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించే కాలం నాటికి కరోనా పరీక్షలు చేయగలిగిన కేంద్రం కేవలం ఒక్కటే ఉంది. నేటికి ఆ సంఖ్య 1300పైగా ఉంది. ఇది నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే. దేశం ప్రాతిపదికగా చూస్తే కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు వివిధ రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌, మరికొన్ని నిర్దిష్టమైన వేళల్లో కర్ఫ్యూ అమలుచేస్తున్నాయి. 


లాక్‌డౌన్‌ కాలం నాటి నుంచి వైరస్‌ నివారణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నది. ఒకానొక ప్రసంగంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ గౌరవ ప్రధానమంత్రి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగానే నేటికి 75 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేశారు. మున్ముందు మరిన్ని మెడికల్‌ కళాశాలల ఏర్పాటును చూడబోతున్నాం. సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ప్రజలకు అందించే విధానంలో భాగంగా కేంద్రం రూ.15 వేల కోట్లతో హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ ఆరోగ్య యోజన క్రింద కోటిమంది పేద రోగులకు ఉచితంగా ఆసుపత్రుల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 1500కు పైగా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించే లాబ్స్‌ ఏర్పాటు చేశారు. గత ఆరు సంవత్సరాల నుంచి ఏర్పాటుచేసిన ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నేడు కరోనాను ఎదుర్కోవడంలో ఇతోధికంగా సహాయం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


కరోనా వ్యాప్తిని గుర్తించిన నాటి నుంచి మనదేశంలోనే 20కి పైగా వెంటిలేటర్స్‌ను తయారుచేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. సరఫరా రేటు సరిపడా ఉండడం వల్లనే నేడు తిరిగి వెంటిలేటర్స్‌ను ఎగుమతి చేసుకునేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ రాష్ట్రాలు కూడా తమ ఆధ్వర్యంలోని ఆసుపత్రులను పూర్తిగా కొవిడ్‌-–19 నివారణకే ఉపయోగిస్తూ వచ్చాయి. లక్షలాది నూతన బెడ్స్‌ను ఏర్పాటుచేశాయి. ప్రైవేటు ఆసుపత్రులు సైతం ఈ మానవ ఉపద్రవ నివారణలో భాగస్వాములను చేయటంలో ప్రభుత్వం సఫలమైంది. చాలా కార్పొరేట్‌ ఆసుపత్రులు వందలాది పడకలతో కరోనా రోగులను ఆదుకుంటున్నాయి. 


మనకు ఇప్పుడు కావలసినన్ని పడకలు ఉన్నాయి. ఆసుపత్రులు ఉన్నాయి. డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ తగినంత మంది నర్సులు, ఇతర సహాయక సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది లేకపోవటం కరోనా వార్డులను బాధిస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత చాలామంది శ్రామికుల మాదిరి వేరే వేరే రాష్ట్రాలకు చెందిన నర్సులు కూడా వారి వారి రాష్ట్రాలకు చేరుకున్నారు. ఇప్పట్లో వారు తిరిగి తమ పాత ఆసుపత్రుల్లో విధుల్లో చేరే సూచనలు కనిపించడం లేదు. 


ప్రభుత్వాల ఆధ్వర్యంలో చాలా కొద్ది నర్సింగ్‌ కళాశాలలు మాత్రమే నడుస్తున్నాయి. అది కూడా స్టాఫ్‌నర్స్‌ కోర్సు మాత్రమే. ఎఎన్‌ఎం, జిఎన్‌ఎం కోర్సులు చాలామటుకు ప్రైవేటు కళాశాలల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. రోగులకు సేవలందించే చిన్న చిన్న మెడికల్‌ హెల్ప్‌ చేసే పనులకు ఎఎన్‌ఎంలు మాత్రమే చక్కగా ఉపయోగపడతారు. కరోనా వైరస్‌ దెబ్బతో రాత్రింబవళ్ళు డ్యూటీ చేసిన కొంతమంది చిన్న నర్సులు కూడా వైరస్‌ బారిన పడడంతో చాలామంది భయపడి డ్యూటీ మానేశారు. ఇటీవల విధుల్లో భాగంగా ఒక మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంలో బయటపడిన వాస్తవాలు కొంత ఆశ్చర్యం కలిగించక మానలేదు. కరోనాకు ముందు 900మంది నర్సులు ఆ టీచింగ్‌ ఆస్పత్రిలో పనిచేస్తూ ఉంటే నేడు ఆ సంఖ్య 360కి తగ్గింది. వారు బయలుపరచిన విషయాలను పరిశీలిస్తే ప్రతి బెడ్‌కు డాక్టర్లు ఉన్నంతగా నర్సులు, ఇతర సిబ్బంది లేరు. అందువలన వారు ప్రతి నర్సుకు, ఆయాకు హెచ్చు వేతనం చెల్లిస్తున్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో సిబ్బందికి అదనపు వేతనం, నైట్‌డ్యూటీ అలవెన్స్‌ కూడా చెల్లిస్తున్నారు. వారిని ఉత్సాహపరిచే విధానంలో భాగంగా వారానికి ఒకరిని ఉత్తమ నర్సుగా, ఉత్తమ టెక్నీషియన్‌గా గుర్తించి సన్మానం చేస్తున్నారు.


నర్సులు, టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి సంబంధించిన తీవ్ర కొరత నివారించాలంటే ఇప్పటికైనా ప్రభుత్వాలే ఎఎన్‌ఎం/జిఎన్‌ఎం కళాశాలలు అధికంగా నిర్వహించి కావలసినంత మంది నర్సులను సమాజానికి అందించవలసిన అవసరం ఉంది. ప్రస్తుత దేశ జనాభా, కరోనా వైరస్‌ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే కనీసం సబ్‌ డివిజన్‌కు ఒక కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టెక్నీషియన్స్‌, లాబ్‌ అసిస్టెంట్స్‌ కొరత కూడా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను వేధిస్తున్నాయి. ఇంతవరకు జిల్లాకు కేవలం ఒకటి మాత్రమే డిఎంఎల్‌టి (డిప్లమా ఇన్‌ మెడికల్‌ అండ్ లాబ్‌ టెక్నీషియన్‌) ట్రైనింగ్‌ కేంద్రం పనిచేస్తున్నదని సమాచారం. ఎలాగో కరోనా నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు ఇబ్బడిముబ్బడిగా పెరిగే క్రమంలో డిఎంఎల్‌టి శిక్షణా కేంద్రాలను సబ్‌ డివిజన్‌కు ఒకటి ఏర్పాటయ్యే విధంగా ప్రభుత్వం చూడాలి.


ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ విధానంలో భాగంగా నర్సింగ్‌, ఇతర పారామెడికల్‌ కోర్సులను ఎంపిసి, హెచ్‌ఇసి మాదిరిగా ప్రతి జూనియర్‌ కాలేజీలోను విధిగా ప్రారంభించాలి. సామాన్య పట్టణాల్లోనే కాకుండా జిల్లా, హైదరాబాద్‌ వంటి నగరాల్లో కూడా ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లలో పనిచేస్తున్న నర్సులు, లాబ్‌ టెక్నీషియన్లు, కాంపౌండర్లు ఎక్కువమంది ఎలాంటి సర్టిఫికెట్‌ లేకుండా కేవలం అనుభవంతో వృత్తిని నేర్చుకుని ఉద్యోగం చేస్తున్నవారే. అదే ఈ కోర్సులను తక్కువ ఫీజులతో అందించి, తక్కువ కాలంలో పూర్తి అయ్యే విధంగా, అదీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అందించగలిగితే ఎంతోమంది విద్యార్థులు ముఖ్యంగా పెద్దగా అకడమిక్‌ ఆశలు, ఆశయాలు లేనివారు ఈ కోర్సులలో చేరతారు. తద్వారా దీర్ఘకాలంలో దేశంలో ఉన్న ఈ తరహా సిబ్బంది కొరతను సంపూర్ణంగా, సహజంగానే అధిగమించవచ్చు.


కరోనా విధుల్లో ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లను మాత్రమే ఇప్పటివరకు అదనంగా ఉపయోగించుకోవచ్చని అనుకుంటున్నారు. వీరికి అదనంగా నాన్‌ క్లినికల్‌ పి.జి డాక్టర్లు, దంతవైద్యుల సేవలను కూడా విరివిగా ఉపయోగించుకోవచ్చు. ఎలాగూ ఓవరాల్‌ మెడికేషన్‌ తత్సంబంధిత పెద్ద డాక్టర్‌ మాత్రమే చేస్తారు. వీరి సేవలను ఎమర్జెన్సీ సర్వీసుల్లో సహాయపడేందుకు, వార్డ్‌ మేనేజ్‌మెంట్‌ కొరకు వాడుకోవచ్చు. డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్న వార్డుల్లో ఎం.ఫార్మ్‌/బి.ఫార్మ్‌ చేసిన వారిని కూడా మెడిసిన్‌ అడ్మినిస్ర్టేటర్ సేవలకు వాడుకోవచ్చు. అదేవిధంగా నర్సుల సిబ్బంది కొరతగా ఉన్నప్పుడు ఇతరత్రా సిబ్బందిని ఉదాహరణకు ఇసిజి సిబ్బంది, వెంటిలేటర్‌ టెక్నీషియన్స్‌ను కొద్దిపాటి శిక్షణతో నర్సింగ్‌ సేవలు చేయడానికి వాడుకోవచ్చు. టెక్నీషియన్స్‌ను, ఇతర సిబ్బందిని కేవలం ఆ పనికి మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో అన్ని రకాలైన సేవలను అందించగలిగే విధంగా శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉంచాలి. 


ఈవిధంగా కొద్దిపాటి సర్దుబాటుతో కొద్దికాలం శిక్షణతో ఆయా సిబ్బందిని కొరత ఉన్న వేరే ప్రాంతాల్లో ఉపయోగించాలి. స్కిల్‌ ఇండియా ప్రోగ్రాం కింద ప్రభుత్వాసుపత్రులు, మున్సిపల్‌ ఆసుపత్రులు తమ సిబ్బందికి శిక్షణనిచ్చి మల్టీ స్కిల్డ్ స్టాఫ్‌గా వాడుకోవాలి. కొద్దిపాటి శిక్షణ, జీతభత్యాలతో ఈ సిబ్బంది సమస్యను సత్వరం అధిగమించవచ్చు. త్వరలోనే ఆయా సిబ్బంది సమస్యలను అధిగమించి ఆయా ఆసుపత్రులు కొవిడ్‌-–19 సేవలను నూటికి నూరుశాతం అందించే విధంగా తయారుగా ఉంటాయని ఆశిద్దాం.

నేలపట్ల అశోక్‌బాబు

Updated Date - 2020-08-13T07:25:42+05:30 IST