పిల్లల ఫోన్‌లపై పెద్దల కంట్రోల్‌

ABN , First Publish Date - 2020-11-07T05:48:36+05:30 IST

చిన్న పిల్లలకు గతంలో స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలంటే తల్లిదండ్రులు సంశయించేవారు. ఈ పరిస్థితిని కరోనా మార్చేసింది. ఆన్‌లైన్‌లో చదువుల కోసం పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తోంది...

పిల్లల ఫోన్‌లపై పెద్దల కంట్రోల్‌

చిన్న పిల్లలకు గతంలో స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలంటే తల్లిదండ్రులు సంశయించేవారు. ఈ పరిస్థితిని కరోనా మార్చేసింది. ఆన్‌లైన్‌లో చదువుల కోసం పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ ఫోన్‌ని వారు ఎలా వినియోగిస్తున్నారో అన్నది పేరెంట్స్‌ కచ్చితంగా పర్యవేక్షించాలి. అలా చేయకుంటేకొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఉపయోగపడే కొన్ని పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్స్‌ను చూద్దాం. పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్స్‌లో అధిక శాతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా పనిచేసే ఫోన్లను సపోర్ట్‌ చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఉపయోగించే ఫోన్లను నియంత్రణలో ఉంచడానికి ఈ అప్లికేషన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అందువల్ల వీటిపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.





గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌

గూగుల్‌ సంస్థ పూర్తి ఉచితంగా అందిస్తున్న అప్లికేషన్‌ ఇది. దాదాపు అన్ని శక్తిమంతమైన పెయిడ్‌ పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్స్‌లో లభించే ముఖ్యమైన సదుపాయాలన్నీ దీంట్లో అందించారు. చిన్నపిల్లలు స్ర్కీన్‌ మీద ఎంత సమయం గడపాలి అన్నది మొదలుకొని ఎలాంటి అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేయాలి, ఎలాంటి వాటిని బ్లాక్‌ చేయాలి అన్నది కూడా దీంట్లో సెట్‌ చేయొచ్చు. అలాగే నిర్దిష్టమైన వెబ్‌సైట్లు ఓపెన్‌ కాకుండా బ్లాక్‌ చేసుకోవచ్చు. లొకేషన్‌ ట్రాకింగ్‌ వంటి కీలకమైన సదుపాయాలు కూడా దీంట్లో ఉంటాయి. అభ్యంతరకరమైన కంటెంట్‌ దానంతట అదే బ్లాక్‌ చేయవచ్చు. అలాగే కొన్ని అప్లికేషన్స్‌, గేమ్స్‌ని పిల్లలు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోకుండా పరిమితి విధించవచ్చు. https://bit.ly/36kFGll లింకు నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.




Kids Place - Parental Control

ఈ అప్లికేషన్‌ ద్వారా మీ ఫోన్‌లో నిర్దిష్టమైన అప్లికేషన్స్‌ ఐకాన్స్‌ మాత్రమే హోమ్‌ స్ర్కీన్‌లో కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా పిల్లలు ఇతర అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేయకుండా అడ్డుకోవచ్చు. కొత్త గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, తెలిసి తెలియక కొత్తవాటిని లింక్‌ చేసి ఉన్న కార్డ్‌ ద్వారా కొనుగోలు చేయటానికి కూడా సాధ్యపడదు. అంతేకాదు ఈ అప్లికేషన్‌ ద్వారా అన్ని రకాల ఇన్‌కమింగ్‌ కాల్స్‌ బ్లాక్‌ చేయొచ్చు, అన్ని వైర్‌లెస్‌ సిగ్నల్స్‌ పని చేయకుండా నిలుపుదల చేయొచ్చు. ఇన్‌స్టాల్‌ చేసిన మొట్టమొదటి సారి పిన్‌ ద్వారా దీని అంతర్గత సెట్టింగ్స్‌ మార్పిడి చేయకుండా అడ్డుకోవచ్చు. https://bit.ly/2TSeowv  లింకులో ఇది లభిస్తుంది.




SecureTeen Parental Control

చిన్నపిల్లలకు ఫోన్‌ అప్పగించినప్పుడు వారు అభ్యంతరకరమైన సమాచారం బారిన పడకుండా ఉండటం కోసం ఈ అప్లికేషన్‌ బాగా పనిచేస్తుంది. భారీ స్థాయిలో అశ్లీల సైట్లని ఇది బ్లాక్‌ చేస్తుంది. అంతేకాదు, పిల్లలకు ఇచ్చిన ఫోన్లో మీకు తెలియకుండా వాళ్లు ఏమైనా గేమ్స్‌, ఇతర యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసినట్లయితే రిమోట్‌తో వేరే ప్రదేశం నుంచి అవి పని చేయకుండా బ్లాక్‌ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు ఆన్‌లైన్లో ఎలా గడుపుతున్నారన్నది మానిటర్‌ చేయడానికి తోడు ఎప్పటికప్పుడు వారి లొకేషన్‌ కూడా తెలుసుకోవచ్చు. https://bit.ly/368bUzN లింక్‌ ద్వారా దీన్ని వాడుకోవచ్చు.


Qustodio

ఇది కూడా చాలా శక్తిమంతమైన పేరెంటల్‌ కంట్రోల్‌ యాప్‌. దీంట్లో పెయిడ్‌, ఫ్రీ వెర్షన్లు లభిస్తుంటాయి. ఉచిత వెర్షన్లో చిన్న పిల్లలకు ఫోన్‌ ఇచ్చేటప్పుడు రూల్స్‌ సెట్‌ చెయ్యడం, టైం పరిమితులు విధించడం, అభ్యంతరకరమైన కంటెంట్‌ దానంతట అదే బ్లాక్‌ చేయడం వంటి సదుపాయాలు అందించారు. అదే పెయిడ్‌ వెర్షన్‌లో సిమ్‌ కార్డ్‌ మానిటరింగ్‌, సోషల్‌ మీడియాకు సంబంధించి పిల్లలు ఎక్కువ సమయం గడపకుండా ఏయే అప్లికేషన్లని ఎంత సమయం పాటు అనుమతించాలి అన్నది పరిమితులు విధించే అవకాశం ఉంటుంది. https://bit.ly/3oSoZGh లింక్‌లో దీన్ని పొందొచ్చు.


KuuLka Parental Control

ఈ అప్లికేషన్‌ సహాయంతో క్లాస్‌ మొదలు కావడానికి ముందు స్ర్కీన్‌ పై భాగంలో చూపించవలసిన అప్లికేషన్‌ మాత్రమే సెలెక్ట్‌ చేసుకొని, మిగిలినవి కనిపించకుండా నిరోధించవచ్చు. అలాగే మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ అయిన అప్లికేషన్స్‌ మీకు కావలసిన విధంగా నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఓపెన్‌ అయ్యే విధంగా పరిమితులు పెట్టుకోవచ్చు. కొన్ని సమయాల్లో ఇంటర్నెట్‌ పని చేయకుండా కూడా నిలుపుదల చేసే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తుంది. ఈ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తరవాత మీ ఈమెయిల్‌ ఐడితో రిజిస్టర్‌ చేసుకొని, దానికి పంపించే పిన్‌తో ఇక మీదట డివైజ్‌ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. https://bit.ly/32fv5qj నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Screen Time Parental Control

ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం లభిస్తున్న మరో శక్తిమంతమైన పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్‌ ఇది. ఆండ్రాయిడ్‌ ఫోన్లో నిర్దిష్టమైన ప్రదేశాల్లోకి పిల్లలు వెళ్లకుండా యాక్సెస్‌ నిలిపి వేయడం ఈ అప్లికేషన్‌ ద్వారా సాధ్యం. అలాగే 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పిల్లలు గేమ్‌ ఆడకుండా అడ్డుకోవచ్చు. అభ్యంతరకరమైన సైట్లను వారి కంటపడకుండా బ్లాక్‌ చేయొచ్చు. ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్స్‌ను గరిష్ఠంగా ఎంత సమయం వాడాలి అన్న విషయంలోనూ పరిమితి విధించవచ్చు. ఇంట్లో ఒక పని పూర్తి చేస్తే తదుపరి కొంత సమయం పిల్లలకు నచ్చిన దానిపై గడిపే విధంగా కూడా రివార్డ్‌ సిస్టమ్‌ దీంట్లో లభిస్తుంది. https://bit.ly/2TRHyfm లింక్‌లో ఇది మనకు లభిస్తుంది.



తల్లిదండ్రులూ పారాహుషార్‌!

భారీ మొత్తంలో ఉచిత, పెయిడ్‌ పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వాడే విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. నిరంతరం చదువుకోవాలి అనే భావనతో కఠినంగా ఈ యాప్స్‌తో పరిమితులు విధించడం అంత మంచిది కాదు. దాంతో పిల్లల్లో అల్లరి, అంతర్లీనంగా తిరస్కార భావన ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి పేరెంటల్‌ కంట్రోల్‌ యాప్స్‌ ఏ మేరకు వాడాలి అన్న విషయంలో సమతుల్యత పాటించాలి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ క్లాస్‌ జరిగేటప్పుడు, ఆ ఒక్క విండో మాత్రమే ఓపెన్‌ అయ్యేలా చూడాలి. ఆ సమయంలో మిగిలినవి ఓపెన్‌ కాకుండా బ్లాక్‌ చేయడం ఉత్తమం. తతిమా సందర్భాల్లో చూసీచూడనట్లు వ్యవహరించాలి.

చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ఫోన్‌ కొనే ఆర్థిక స్థోమత లేక తాము వాడుతున్న వాటినే పిల్లలకు ఇస్తుంటారు. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు అశ్లీల సైట్లను, యూట్యూబ్లో అభ్యంతరకరమైన వీడియోలను, సంచలనాత్మక వీడియోలను చూసినట్లయితే వాటికి సంబంధించిన కుకీలు ఫోన్లో అంతర్గతంగా స్టోర్‌ అయి, పిల్లలకు కూడా అదే రకమైన సమాచారాన్ని చూపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఫోన్‌ వాడకం విషయంలో పరిపక్వతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొంతమంది తల్లిదండ్రులకు టెక్నాలజీపై సరైన అవగాహన ఉండదు. దాంతో పిల్లలు ఫోన్‌తో ఎలా గడుపుతున్నారు అన్నది తెలుసుకునే అవకాశం కూడా లేదు. అది కచ్చితంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కాస్త సమయాన్ని వీలు చేసుకుని ఫోన్‌ ఉపయోగించడం, పిల్లలు డౌన్‌లోడ్‌ చేసుకునే అప్లికేషన్‌లు, గేమ్‌ల గురించి, వాటి రేటింగ్స్‌, వాటితో పిల్లల మనస్తత్వంపై ఏర్పడే ప్రమాదం గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.


-నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-11-07T05:48:36+05:30 IST