Abn logo
Sep 26 2021 @ 08:00AM

పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి ప్లీజ్‌!

              - తల్లిదండ్రులకు విద్యాశాఖ వినతి 


అడయార్‌(చెన్నై): నిద్రలేచిన దగ్గర నుంచి నిత్యం మీ పిల్లలు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చుట్టూనే తిరుగుతున్నారా?.. అయితే ఖచ్చితంగా వారిపై ఓ కన్నేసి వుంచాలని రాష్ట్ర విద్యాశాఖ తల్లిదందండ్రులను హెచ్చరించింది. కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. కొంతమందికి తరగతులు ప్రారంభమైనప్పటికీ మరికొంతమందికి మాత్రం ఇంకా ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు ఆన్‌లైన్‌ గేమ్‌లకు పూర్తిగా అలవాటుపడిపోయారు. మరికొంత మంది రకరకాల వెబ్‌సైట్‌ల పట్ల ఆకర్షితులవుతున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఆన్‌లైన్‌ తరగతుల్లో వున్నట్టు భావిస్తూ వదిలేస్తున్నారు. దీంతో చిన్నారుల మానసిక సమస్యలు విపరీతంగా తలెత్తుతున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. దీనిపట్ల రాష్ట్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. పిల్లలు ఆన్‌లైన్‌ తరగతుల్లో వున్నప్పటికీ వారిపై ఓ కన్నేసి వుంచాలని హెచ్చరించింది. పిల్లలు పాఠాలు ఆలకిస్తున్నారా? లేక ఆన్‌లైన్‌ గేమ్‌లో మునిగితేలుతున్నారాఅన్నది కనిపెట్టాలని సూచించింది.