తల్లిదండ్రుల మృతి.. ఆకలితో అలమటిస్తున్న ముగ్గురు పిల్లలు

ABN , First Publish Date - 2020-05-28T20:33:27+05:30 IST

అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఆ ఇంటి పెద్దకొడుకే ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. చిన్న వయసులోనే కూలి పనిచేసి చెల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు.

తల్లిదండ్రుల మృతి.. ఆకలితో అలమటిస్తున్న ముగ్గురు పిల్లలు

వీరికి దిక్కెవరు?.. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి

ఆకలితో అలమటిస్తున్న అనాథలు

తినడానికి తిండి లేదు.. చేయడానికి పనిలేదు

తమ్ముడిని, చెల్లిని పోషించేందుకు కష్టపడుతున్న అన్న

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పని కరువు

సరిపడా వయసు లేక ఉపాధిపనికి దూరం


మర్పల్లి (రంగారెడ్డి) : అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఆ ఇంటి పెద్దకొడుకే ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. చిన్న వయసులోనే కూలి పనిచేసి చెల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు. హఠాత్తుగా  కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పని దొరకక ఆ పిల్లలు పస్తులుండాల్సి వస్తోంది. ఒక్క పూట కూడా అన్నం దొరక్క బిక్కుబిక్కుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మర్పల్లి మండలం నర్సాపూర్‌ చిన్నతండాకు చెందిన నేనావత్‌ పాండు, అనూషబాయి దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు బాలు (15), రాజు(14), కూతురు మాయ (12) ఉన్నారు. కాగా నవంబరు, 2018లో వీరి తల్లి మృతిచెందగా, ఈ ఏడాది మార్చిలో తండ్రి కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. 


దీంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కొడుకు బాలు గ్రామంలోనే కూలీనాలి చేసి తన తమ్ముడు, చెల్లికి ఆసరాగా నిలిచాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలలుగా గ్రామంలో ఎలాంటి పని దొరకకపోయేసరికి ఆ కుటుంబం ప్రభుత్వం ఇచ్చిన బియ్యంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇంట్లో నిత్యావసర సరకులు లేక పూట గడవటమే కష్టమైంది. ఈ పరిస్థితిలో కనీసం ఉపాధి పనికైనా వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుందామనుకుంటే సరిపడ వయసు లేదంటూ పని ఇవ్వడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. అనాథలైన తమను ఎవరైనా ఆదుకోవాలని ఆ చిన్నారులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-05-28T20:33:27+05:30 IST