తల్లిదండ్రుల్లో సంకట స్థితి

ABN , First Publish Date - 2021-04-18T05:23:08+05:30 IST

విద్యాసంస్థల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.

తల్లిదండ్రుల్లో సంకట స్థితి

  1. విద్యాసంస్థల్లో పెరుగుతున్న కేసులు
  2. పాఠశాలల్లో 886 మందికి పాజిటివ్‌
  3. ఉపాధ్యాయులు 129, విద్యార్థులు 757
  4. తరగతుల కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 17: విద్యాసంస్థల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. సెకెండ్‌ వేవ్‌లో పాఠశాలలు, కళాశాలలు వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపాలా వద్దా అని తల్లిదండ్రులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యమా..? భవిష్యత్తా..? అని నిర్ణయించుకో లేకున్నారు. కొవిడ్‌తో జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారు. పలువురు చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందిలో వైరస్‌ బయట పడుతోంది. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు జిల్లాలో 886 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో విద్యార్థులు 757 మంది, ఉపాధ్యా యులు, బోధనేతర సిబ్బంది 129 మంది ఉన్నారు. కేసుల ఉధృతి నేపథ్యంలో పిల్లలను బడికి పంపాలా వద్దా అని తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం భారీగా పడిపోతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు లు ప్రకటించాయి. మరి కొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తు న్నాయి. కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరగతులను నిర్వహిస్తూ, వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. తరగతులు కొనసాగితే విద్యార్థులకు ప్రమాదం పెరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వసతి గృహాల మూసివేత

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు నమోదైన వసతి గృహాలను మూసివేసి విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారు. చాగలమర్రి, ఆదోనిలో కేజీబీవీలు, కర్నూలులోని బీసీ బాలికల వసతి గృహంలో భారీగా కేసులు నమోదు కావడంతో సెలవులు ప్రకటించారు. 


తల్లిదండ్రుల్లో ఆందోళన

విద్యాసంస్థల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ఎండల తీవ్రతకు తోడు వైరస్‌ విస్తరిస్తుండటంతో బడికి పంపేందుకు భయపడుతున్నారు. మరోవైపు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బడికి పంపకపోతే ఫలితాలపై ప్రభావం ఉంటుందని ఆలోచిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపుతున్నారు. 


హాట్‌ స్పాట్లుగా పాఠశాలలు

పాఠశాలలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఐదు నెలలు ఆలస్యంగా తరగతులు ప్రారంభమైనా, పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. జిల్లాలో 4,389 పాఠశాలల్లో 7.51 లక్షల మంది, 216 జూనియర్‌ కళాశాలల్లో 75 వేల మంది విద్యార్థులు చదువుకుంటు న్నారు. డిగ్రీ, పీజీ, ఐటీఐ, పాలిటెక్నికల్‌, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర విద్యాసంస్థల్లో మరో 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కల్లూరు మండలం ఎ-గోకులపాడు ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, మిడ్తూరు మండలంలో మరో ఉపాధ్యాయుడు కొవిడ్‌తో మృతిచెం దారు. ఇప్పటివరకు జిల్లాలో 886 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 


అరకొరగా కొవిడ్‌ పరీక్షలు

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అరకొర కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యజమాన్యాల్లోని పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు 25 వేల మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు 17,147 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేశారు. విద్యార్థులు మొత్తం 8.25 లక్షల మంది ఉన్నారు. 1,86,457 మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. టెస్టుల సంఖ్య పెరిగితే.. ఆ మేరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 


ఏడుగురు విద్యార్థులు, ఓ టీచర్‌కు..

ఆలూరు: ఆలూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-1లో ఏడుగురు విద్యార్థులు, ఒక టీచర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మొలగవల్లి పీహెచ్‌సీ వైద్యుడు మారుతి తెలిపారు. వారిని హోం క్వారంటైన్‌కు తరలించామన్నారు. 


కరోనాతో పాఠశాల ఖాళీ

పాణ్యం, ఏప్రిల్‌ 17: బలపనూరు పరిధిలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాల ఖాళీ అయింది. పాఠశాలలో 20 మంది బాలికలకు కరోనా రావడంతో మిగిలిన దాదాపు 70 మంది బాలికలను వారి తల్లిదండ్రులు శనివారం సొంత ఊళ్లకు తీసుకుని వెళ్లినట్లు ప్రిన్సిపాల్‌ అరుణాదేవి తెలిపారు. పాఠశాలలో కరోనా బాఽధితులు, ఉపాధ్యాయినులు మినహా విద్యార్థినిలు ఎవరూ లేరు. గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలలో హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. పరిసరాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు.


మూసివేయాల్సిందే 

పాఠశాలలు, కళాశాలలను నిర్వహిం చడం వల్లనే కరోనా కేసులు పెరుగుతు న్నాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రాణనష్టం జరుగుతుంది. విద్యాసంస్థల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టడం లేదు. అందువల్లనే కేసులు పెరుగుతు న్నాయి. ప్రభుత్వం వెంటనే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి. - శ్రీనివాసులు, 

ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


ప్రాణం కంటే చదువు ముఖ్యం కాదు 

విద్యార్థుల ప్రాణం కంటే చదువు ముఖ్యం కాదు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత పునఃప్రారంభించాలి. అవసరమ నుకుంటే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలి. జూన్‌లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి, జూలైలో నిర్వహించినా నష్టమేమీ లేదు. ఈ ఏడాది ఐదు నెలలు ఆలస్యంగా విద్యాసంవత్సరం మొదలైంది. అయినా ఇబ్బంది లేదు. విద్యార్థులకు తరగతు లను బోధించడానికి ఉపాధ్యాయులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. - ఓంకార్‌ యాదవ్‌, ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు


విద్యావ్యవస్థకు భారీగా నష్టం 

కరోనా సాకుతో విద్యాలయాలను మూసివేస్తే విద్యావ్యవస్థకు భారీగా నష్టం జరుగుతుంది. మరో 15 ఏళ్లు వెనుకబడిపోతాం. ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. వాటిలో పిల్లలకు వచ్చే సంఖ్య చాలా స్వల్పం. ఢిల్లీ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణలో కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకే ఆ రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటిం చాయి. సాధారణంగా వేసవిలో వచ్చే డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి విషజ్వరాలకు కరోనా తోడైంది. విద్యాసంస్థలు కొనసాగడం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయనడం వాస్తవం కాదు. విద్యార్థుల మధ్య దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజ్‌ చేయడం ద్వారా కొంతవరకు కరోనాను నివారిం చవచ్చు. - బి.వాసుదేవయ్య,

 ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్‌


బడికి పంపాలంటే భయంగా ఉంది

కర్నూలు ఉద్యోగ నగర్‌లో ఉంటున్నాం. ఆటో నడుపు కుంటూ జీవనం సాగిస్తున్నాం. మాకు ఇద్దరూ అబ్బాయిలే. పెద్దబ్బాయి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతు న్నాడు. చిన్న బ్బాయి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. కరోనా కేసులు పెరుగుతున్నాయి. బడికి పంపాలంటే భయంగా ఉంది. కానీ పంపకపోతే పిల్లలు పాడైపోతారనే ఆందోళన ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.  - కె.వెంకటేష్‌, కర్నూలు



Updated Date - 2021-04-18T05:23:08+05:30 IST