విషం తాగి చనిపోయిన 18 ఏళ్ల కుమారుడు.. అంత్యక్రియల తర్వాత ఆ కుర్రాడి ఫోన్‌ను తల్లిదండ్రులు చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2021-08-21T18:49:43+05:30 IST

18 ఏళ్ల వయసున్న కొడుకు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూనే ఆ కుర్రాడు మరణించాడు.

విషం తాగి చనిపోయిన 18 ఏళ్ల కుమారుడు.. అంత్యక్రియల తర్వాత ఆ కుర్రాడి ఫోన్‌ను తల్లిదండ్రులు చెక్ చేస్తే..

18 ఏళ్ల వయసున్న కొడుకు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూనే ఆ కుర్రాడు మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు ఎందుకిలా చేశాడో ఆ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. గుండెకోతను భరిస్తూనే కొడుక్కు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత కుమారుడి గదిని సర్దుతోంటే అతడి ఫోన్ కనిపించింది. అనుమానంగానే ఆ ఫోన్‌ను పరిశీలించడం మొదలు పెట్టారా తల్లిదండ్రులు. అప్పుడే ఆ ఫోన్లో బయటపడిందో దారుణ నిజం. ఆ ఫోన్లోని సమాచారంతోనే ఓ ప్రముఖ కంపెనీపై కేసు పెట్టారు. తమలాగా ఇతరులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ పోరాడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలోని ఛత్రిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో లోధా కాలనీలో రంజిత్ వర్మ తన భార్య, 18 ఏళ్ల కొడుకు ఆదిత్యతో కలిసి నివసిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ మార్కెట్లో కూరగాయలను అమ్ముతుంటారు. ఆదిత్య కూడా స్థానికంగా ఓ పండ్ల జ్యూస్ దుకాణం పెట్టుకుందామని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఏమయిందో ఏమో కానీ జూలై 29వ తారీఖున ఆదిత్య తన గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆదిత్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే జూలై 30వ తారీఖున ఆదిత్య మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రుల కన్నీళ్లను ఆపడం ఎవరితరం కాలేదు. అదే రోజు ఆదిత్యకు అంత్యక్రియలు జరిగాయి. అసలు తమ కుమారుడు ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడో ఆ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. 


కొద్ది రోజుల తర్వాత ఆదిత్య గదిని సర్దుతుండగా అతడి ఫోన్ కనిపించింది. ఫోన్లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని అంతా వెతికారు. అలా వెతుకుతున్న వాళ్లకు ఓ మెసేజ్ కనిపించింది. అది అమెజాన్‌లో ఇచ్చిన ఓ ఆర్డర్‌కు సంబంధించిన డెలివరీ రిపోర్ట్. ‘CELPHOS’ అనే ఓ పురుగుల మందును అమెజాన్ నుంచి ఆదిత్య కొనుగోలు చేసినట్టు బయటపడింది. మొదట జూలై 20వ తారీఖున ఈ విషాన్ని అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చాడు. అయితే డబ్బులు చెల్లించడంలో తలెల్తిన సాంకేతిక సమస్యల కారణంగా జూలై 22న ఆ ఆర్డర్ రద్దయింది. ఆ తర్వాత మళ్లీ జూలై 28న ఆ CELPHOS అనే విషాన్ని అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చాడు. అది కాస్తా మరుసటి రోజే ఆదిత్యకు డెలివరీ అయింది. ఆ విషం డెలివరీ అయిన రోజే ఆదిత్య దాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిత్య మొబైల్‌లో ఈ మెసేజ్‌లను చూసిన తల్లిదండ్రులు ఖిన్నులయ్యారు. అసలు అమెజాన్‌లో ఇలాంటి విషాలను అమ్మడానికి అనుమతి ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు. వెంటనే ఈ తరహా విషాల అమ్మకాలను అమెజాన్‌లో నిలిపివేయాలంటూ ఛత్రిపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తమ కుమారుడి చావుకు ఓ రకంగా అమెజాన్ కంపెనీ కూడా కారణమని ఆ ఫిర్యాదులో ఆ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆదిత్య ఆత్మహత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును కూడా కలిపి విచారించనున్నారు.

Updated Date - 2021-08-21T18:49:43+05:30 IST