సైనా నిరాశేనా?

ABN , First Publish Date - 2021-05-02T06:01:42+05:30 IST

అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో మూడు నెలల్లో ఒలింపిక్స్‌ ప్రారంభమవుతాయి. ఈ సారి బ్యాడ్మింటన్‌ గోల్డ్‌ సింధుకు దక్కుతుందా.. సైనాకు దక్కే ఛాన్స్‌ ఏదైనా ఉందా? అనే విషయాలపై చర్చలు మొదలవుతాయి...

సైనా నిరాశేనా?

అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో మూడు నెలల్లో ఒలింపిక్స్‌ ప్రారంభమవుతాయి. ఈ సారి బ్యాడ్మింటన్‌ గోల్డ్‌ సింధుకు దక్కుతుందా.. సైనాకు దక్కే ఛాన్స్‌ ఏదైనా ఉందా? అనే విషయాలపై చర్చలు మొదలవుతాయి. సింధు కోర్టులో చెలరేగిపోవటం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది మర్చిపోయి ఉండచ్చు కానీ ఒకప్పుడు సైనా యూత్‌ ఐకాన్‌. అనేక మంది చిన్నపిల్లలు షటిల్‌ రాకెట్‌లు పట్టుకోవటానికి ప్రాక్టీసు చేయటానికి వెనకున్న ఒకే ఒక కారణం. వీటన్నింటికీ మించి హర్యానాలో పుట్టినా- అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ తరపున జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న మన తెలుగమ్మాయి. అలాంటి సైనా జీవిత చరిత్రను సినిమాగా తీసినప్పుడు.. లీడ్‌ రోల్‌లో పరిణితి చోప్రా వంటి నటి నటించినప్పుడు అంచనాలు భారీగానే ఉంటాయి. కొవిడ్‌ పరిణామాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయింది. సాధారణంగా క్రీడాకారుల జీవితచరిత్రలను సినిమాలుగా మలిచినప్పుడు (ధోని, అజారుద్దీన్‌, సచిన్‌, థ్యాన్‌చంద్‌, మేరీకాం) .. ప్రేక్షకులను ఆకట్టుకోవటం కోసం కొన్ని ఆకర్షణీయమైన అంశాలను జోడించటం సాధారణమైన విషయమే! అయితే వారి జీవితంలో ప్రేక్షకులను ఆకట్టుకొనే ఎలిమెంట్‌ను దర్శకుడు సరిగ్గా గుర్తించలేకపోతే - కథా సాదాసీదాగా నడిచిపోతుంది. సైనా విషయంలో కూడా అమోల్‌ గుప్తే ఇలాంటి పొరపాటే చేశాడనిపించింది. 


పువ్వు పుట్టగానే..

తల్లి హౌస్‌ వైఫ్‌.. తండ్రి ఇక్రిశాట్‌లో సైంటిస్ట్‌. (ఎందుకో ఇక్రిశాట్‌ పేరును ఎక్కడా వాడలేదు.. దీని వల్ల ఆయన స్థాయి ఏమిటనే విషయం ప్రేక్షకులకు తెలియదు) తల్లికి షటిల్‌ అంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఆసక్తే సైనాకు వస్తుంది. రాజేంద్రనగర్‌లో ఉండే ఇక్రిశాట్‌ నుంచి లాల్‌బహుదూర్‌ స్టేడియం దాకా ప్రతి రోజు సైనాను తీసుకువచ్చి ప్రాక్టీసు చేయించే బాధ్యత తండ్రిపై పడుతుంది. ఖరీదైన క్రీడ కాబట్టి ఆయన తన పిఎఫ్‌ సొమ్మును కూడా వెచ్చించి సైనాకు అవసరమైన కాక్స్‌ కొనాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్‌ అకాడమీ స్థాపించటం.. లాల్‌బహుదూర్‌ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న అనేక మంది ఆయన దగ్గరకు వలస వెళ్లటం చాలా మందికి తెలిసిన విషయాలు. ఈ విషయాలను లీలగా మాత్రమే ఈ సినిమాలో ప్రస్తావిస్తారు.  గోపీచంద్‌ అభ్యంతరాల వలన కావచ్చు.. ఎక్కడా ఆయన పేరు కానీ అకాడమీ పేరు కానీ ఈ సినిమాలో కనబడదు. గోపీచంద్‌ కాస్తా రాజన్‌గా మారిపోతాడు. ఇదంతా వర్తమాన చరిత్రే కాబట్టి - రాజన్‌ పేరుతో గోపిచంద్‌ను ఎందుకు చూపిస్తున్నారని అనుమానం, అసహనం ప్రేక్షకులకు కలుగుతుంది. పైగా కాశ్య్‌పతో సైనాకు ఉన్న ప్రేమ వ్యవహారాన్ని పసిగట్టిన గోపీచంద్‌ వారు విడిపోవటానికి కారణమయినట్లు.. ఆ తర్వాత సైనా వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అయిన తర్వాత అడ్వటైజ్‌మెంట్స్‌ విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్లు సినిమాలో చూపించారు. ఈ కోణం నుంచి చూసినప్పుడు రాజన్‌ ఉరఫ్‌ గోపీచంద్‌ విలన్లా కనబడతాడు. వాస్తవానికి బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో ఈ రాజకీయాలన్నీ అతి సామాన్యమైన విషయాలు!  మొదట్లో గోపీచంద్‌ సహా అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఎల్బీ స్టేడియంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత, కోచ్‌ ఆరీఫ్‌ వంటివారి వద్ద తర్ఫీదు పొందినవారే. ఆ తర్వాత గోపీచంద్‌ విడిగా అకాడమీ పెట్టుకొన్నప్పుడు అనేక జాతీయ స్థాయి క్రీడాకారులు ఆయన అకాడమీకి వచ్చేశారు. అదే గోపీచంద్‌ అకాడమీకి మంచి పునాది అయింది (గోపీచంద్‌ శ్రమ, పట్టుదల, దీర్ఘకాలిక దృష్టి, ప్రొఫెషనలిజంలను తక్కువ చేయటం ఉద్దేశం కాదు). జాగ్రత్తగా గమనిస్తే- గోపీచంద్‌ అకాడమీలో తర్ఫీదు పొంది అంతర్జాతీయ వేదికలపై ఎక్కువ  టైటిల్స్‌ సాధించిన తొలి క్రీడాకారిణి సైనానే! అయితే ఒక వ్యవస్థ కన్నా వ్యక్తి ప్రాబల్యం పెరిగినప్పుడు (గోపీచంద్‌ అకాడమీ కన్నా సైనా వ్యక్తిగత ప్రతిష్ట) ఘర్షణ తప్పనిసరిగా ప్రారంభమవుతుంది. దీని వల్ల కొన్ని సార్లు వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. కొన్ని సార్లు వ్యక్తులు నష్టపోతారు. సైనా-గోపిచంద్‌ అకాడమీల మధ్య జరిగిన ఈగో మ్యాచ్‌లలో సైనా ఓడిపోయింది. ఈ విషయం కూడా మనకు సినిమాలో ఎక్కడా కనబడదు. 


తర్వాతి చరిత్ర.. 

సైనా స్థానాన్ని ఆ తర్వాత సింధులాంటివారు భర్తీ చేశారు. శిక్షణ కోసం విమల్‌కుమార్‌ దగ్గరకు వెళ్లిన సైనా మళ్లీ గోపీచంద్‌ వద్దకు తిరిగి వచ్చేసింది. మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనటానికి సిద్ధమవుతోంది. యాదృచ్ఛికం కావచ్చు కానీ సైనా వచ్చిన తర్వాత సింధూ ట్రైనింగ్‌ కోసం లండన్‌ వెళ్లిపోయింది. వాస్తవానికి ఈ కథను కొద్దిగా విస్తరిస్తే మనుషుల ఈగో సమస్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనే విషయాన్ని ఆకర్షణీయంగా చెప్పవచ్చు. ఈ అంశంలో దర్శకుడు అమోల్‌ విఫలమయ్యాడనే చెప్పాలి. ఇక సైనాగా పరిణితి చోప్రా మంచి ప్రదర్శనను కనబరిచింది. హర్యానా జాట్‌నీగా ఆమె బాడీ లాంగ్వేజ్‌ ప్రదర్శించిన తీరు ప్రశంసనీయం. ఆమె చేసిన హోంవర్క్‌ తాలుకూ ఫలితాలను మనం స్ర్కీన్‌ మీద చూడవచ్చు. ప్రైమ్‌లో లభ్యమవుతోంది కాబట్టి అందరూ చూడాల్సిన సినిమా ఇది!

- సివిఎల్‌ఎన్‌

Updated Date - 2021-05-02T06:01:42+05:30 IST