హిందువుల పండుగలకే ఆంక్షలా?

ABN , First Publish Date - 2021-12-25T17:14:11+05:30 IST

డెల్టా వైరస్‌ విజృంభిస్తోందని చెప్పి హిందువుల పండగలైన దేవీనవరాత్రులు, గణపతి నవరాత్రులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలను విధించిందని, ..

హిందువుల పండుగలకే ఆంక్షలా?

సినిమా టికెట్లు తగ్గించి, తిరుమల టికెట్లు బ్లాకులో విక్రయిస్తారా?

జగన్‌ సర్కారుపై ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద ప్రశ్నల వర్షం


కృష్ణానగర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డెల్టా వైరస్‌ విజృంభిస్తోందని చెప్పి హిందువుల పండగలైన దేవీనవరాత్రులు, గణపతి నవరాత్రులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలను విధించిందని, ఇప్పుడు ఒమైక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్‌ పండగకు, జనవరి వేడుకలకు ఆంక్షలు విధిస్తారా లేదా చెప్పాలని శ్రీపీఠం వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమక్షంలో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. హిందువులు దేవాలయాలకు వెళ్లొద్దని, హిందువులు ఊరేగింపులు, పూజలు చేసుకోవద్దంటూ కేవలం హిందువుల పండలకే ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని, మిగతా వారికి కరోనా సోకదనే అభిప్రాయం సీఎం జగన్‌కు ఉన్నట్లుందని ఆయన విమర్శించారు.


గత ఎన్నికల్లో జగన్‌కు ఓటేసినవారిలో 90శాతం హిందువులే ఉన్నారనే విషయం గుర్తెరిగి, వారి మనోభావలు దెబ్బతినకుండా పరిస్థితిని చక్కబెట్టాల్సిన బాధ్యత జగన్‌కు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను తగ్గించిన ప్రభుత్వం తిరుమలలో మాత్రం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే బ్లాక్‌లో 3 వేలకు టికెట్లు అమ్ముతోందని ఆయన ఆరోపించారు. ఏపీలో ఆగంతుకుల చేతుల్లో దెబ్బతిన్న దేవాలయాలను నిర్మించకపోతే తాను ప్రత్యక్షంగా తిరుమల నుంచి తాడేపల్లి వరకు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.

Updated Date - 2021-12-25T17:14:11+05:30 IST