Parishath ఎన్నికలవేళ.. నేతల తిట్ల పురాణం

ABN , First Publish Date - 2021-12-01T17:15:07+05:30 IST

విధాన పరిషత్‌ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నేతల మధ్య తిట్ల పురాణం ఊపందుకొంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను పనికిమాలిన దద్దమ్మ అంటూ

Parishath ఎన్నికలవేళ.. నేతల తిట్ల పురాణం

బెంగళూరు: విధాన పరిషత్‌ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నేతల మధ్య తిట్ల పురాణం ఊపందుకొంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను పనికిమాలిన దద్దమ్మ అంటూ ప్రతిపక్ష నేత సిద్దరామయ్య విమర్శించగా మంగళవారం దీనికి మంత్రి ఈశ్వరప్ప దీటుగా స్పందించారు. కల్బుర్గిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యను పచ్చితాగుబోతుగా అభివర్ణించారు. ఆయన ఎప్పుడు తాగుతాడో తాగిన మత్తులో ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ను ఉగ్రవాది అంటూ సిద్దరామయ్య సంబోధించడం సరికాదన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య కూడా బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో తాను కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నానన్నారు. బీజేపీ నేతలవి తిట్లు కానప్పుడు తనవి మాత్రం ఎలా తిట్లు అవుతాయని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతల దిగజారుడు రాజకీయాలపై ఆయన విరుచుకుపడ్డారు. మరోవైపు రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ రూపొందించారంటూ మాజీ ఎంపీ అనిల్‌ లాడ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు బెంగళూరు హైగ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనిల్‌ లాడ్‌పై ఫిర్యాదు చేసింది. అనిల్‌ లాడ్‌పై కేసు దాఖలు చేసి తక్షణం అరెస్ట్‌ చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ డిమాండ్‌ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కటీల్‌ను ఉగ్రవాదిగా సంబోధించినందుకు సిద్దరామయ్యపై కూడా ఫిర్యాదు చేశారు. పొట్టకూటి కోసమే దళితులు బీజేపీలో చేరుతున్నారంటూ సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఫిర్యాదులో ప్రస్తావించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బృందంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చలవాది నారాయణ స్వామి, న్యాయ విభాగానికి చెందిన వివేక్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-12-01T17:15:07+05:30 IST