Abn logo
Sep 18 2021 @ 23:55PM

పరిషత్‌ ఫలితాలు నేడే!

ఉదయగిరి రూరల్‌ : ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు కోసం సిద్ధం చేసిన టేబుళ్లు

19 నెలలపాటు సాగిన ఎన్నికల ప్రక్రియ

అధికార పార్టీ దౌర్జన్యాలు, బెదిరింపులు

పోరు నుంచి తప్పుకున్న ప్రతిపక్షాలు

ఘననీయంగా తగ్గిన పోలింగ్‌

అనేక అవాంతరాల తర్వాత లైన్‌ క్లియర్‌

నేడు తేలిపోనున్న అభ్యర్థుల భవితవ్యం


నెల్లూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఏడాది కాలంగా సా...గుతూ వచ్చిన పరిషత్‌ ఎన్నికలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఎన్నికలు జరిగిన ఐదు నెలల తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది.  రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు సుదీర్ఘ కాలం అంటే 19 నెలల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. 2020 మార్చి ఏడవ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. వారం రోజులపాటు సాగిన నామినేషన్లు, ఉపసంహరణల పర్వంలో అధికార పార్టీకి చెందిన నేతలు వీరంగం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను పలు రకాలుగా బెదిరించారు. పొలాలు, ఇళ్లు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, కాంట్రాక్టు బిల్లులు ఇలా అన్ని వనరులను ప్రతిపక్షాలను పోటీలో లేకుండా అడ్డుకోవడానికి వాడుకున్నారు. అన్నిటికీ తెగించి నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపై దాడులకు తెగబడ్డారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసే క్రమంలో రెవెన్యూ, పోలీసుల సహకారం తీసుకున్నారు.   నామినేషన్ల ఉప సంహరణల సమయానికి అధికార పార్టీ 12 జడ్పీటీసీ, 188 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. 


కొవిడ్‌తో బ్రేక్‌!

అప్పటికే కరోనా తీవ్రరూపం దాల్చడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల ఘట్టంలో వైసీపీ దౌర్జన్యాలకు నిరసనగా తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏప్రిల్‌ 3వ తేదీన ప్రకటించాయి. అప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఈ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టులో వ్యాజ్యం వేశాయి. మే 22న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. జూన్‌లో సింగల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజనల్‌ బెంచ్‌ స్టే ఇచ్చింది. ఆ తరువాత పోలింగ్‌ అనుమతి ఇస్తూ, తుది తీర్పు వెలువడే వరకు ఓట్ల లెక్కింపు జరపవద్దంటూ తీర్పు చెప్పింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన  34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. కోర్టు తీర్పును అనుసరించి బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచి తుది తీర్పు కోసం ఎదురు  చూశారు. ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీ తుది తీర్పు వెలువడటంతో ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, జిల్లా ఎన్నికల పరిశీలకుడు బసంత్‌కుమార్‌ కావలిలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అలాగే నెల్లూరులోని కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన్ను కలెక్టర్‌ చక్రధర్‌బాబు కలిసి మాట్లాడారు.


టీడీపీ ఏజెంట్ల అనుమతిపత్రాలు తిరస్కరణ

కేసుల పేరుతో టీడీపీ ఏజెంట్‌ పత్రాలను అధికారులు తిరస్కరించారు. తడ మండలంలోని 6 ఎంపీటీసీ స్థానాల్లో పోలైన ఓట్లను నాయుడుపేటలో లెక్కించనున్నారు. అయితే, ఏజెంట్‌ అనుమతి పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను కౌంటింగ్‌ అధికారులు కేసుల పేరుతో తిరస్కరించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఫలితాలు ఏకపక్షమే

ఓట్ల లెక్కింపులో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించిన క్రమంలో పోలింగ్‌ కూడా ఏకపక్షంగా జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏమాత్రం సందడి లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం ఎన్నికలను బహిష్కరించిన క్రమంలో ఆ పార్టీ సానుభూతిపరులు ఓటింగ్‌కు రాలేదు. దీంతో ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. టీడీపీ ఎన్నికల బహిష్కరణ క్రమంలో గెలుపోటముల మీద ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. అధికార పార్టీ అయిన వైసీపీ అభ్యర్థుల మెజారిటీ విషయంలో స్పష్టత లేదు కాని గెలుపు విషయంలో మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. 


జడ్పీ చైర్మన్‌గా..

అవాంఛనీయ సంఘటనలు జరగని పక్షంలో ఆనం విజయకుమార్‌రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడుతారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆశీస్సులతో విజయకుమార్‌రెడ్డి సతీమణి జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఇది వరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జడ్పీటీసీ ఫలితాల వెల్లడి తరువాత జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికల తేది అధికారికంగా ప్రకటించనున్నారు.  

కావలి : కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల పరిశీలకుడు బసంత్‌కుమార్‌