జంతువుల పెంపకానికి పరివేష్‌!

ABN , First Publish Date - 2020-11-28T05:55:12+05:30 IST

విలాసవంతమైన జీవనం గడుపుతున్న వారే కాకుండా.. ఇటీవల కాలంలో మధ్య తరగతి ప్రజలు సైతం పెంపుడు జం తువుల పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ వాటి పెంపకాని కి సంబంధించి ‘పరివేష్‌’ పేరిట పలు కఠిన నిబంధనలు రూపొందించ డం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జంతువుల పెంపకానికి పరివేష్‌!
పెంపుడు జంతువులు

పెంపుడు కుక్కలకు పర్మిషన్‌ రూల్స్‌!

విదేశీ జంతువుల పెంపకానికీ నిబంధనలు!

‘పరివేష్‌’ పేరిట  అనుమతులు తప్పనిసరి 

జిల్లాలో వందల సంఖ్యలో  పెంపుడు జంతువులు

అటవీ, పర్యావరణ శాఖల పర్మిషన్‌ లేని పెంపకం చెల్లదు 

పక్షుల పెంపకానికి  సైతం వర్తింపు

నిర్మల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విలాసవంతమైన జీవనం గడుపుతున్న వారే కాకుండా.. ఇటీవల కాలంలో మధ్య తరగతి ప్రజలు సైతం పెంపుడు జం తువుల పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ వాటి పెంపకాని కి సంబంధించి ‘పరివేష్‌’ పేరిట పలు కఠిన నిబంధనలు రూపొందించ డం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పలు రకాల విదేశీ కుక్క లు, మరికొన్ని జంతువులతో పాటు పక్షులను సైతం చాలా మంది తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. ముఖ్యంగా విదేశీ కుక్కల పెంపకం పట్ల రోజు రోజుకు క్రేజ్‌ పెరిగిపోతోంది. కొంతమంది ధనవంతులు తమ ప్రస్టేజ్‌ను దృష్టిలో ఉంచుకొని లక్షల రూపాయల ఖరీదు చేసే విదేశీ కుక్కపిల్లలను ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు మరికొంతమంది ఇతర రకాల జంతువుల ను సైతం కొనుగోలు చేసి తమ ఇళ్లల్లో పెంచుతున్నారు. అలాగే విదేశీ పక్షుల పెంపకానికి సైతం డిమాండ్‌ పెరుగుతోంది. విదేశీ రకానికి చెందిన కుక్కపిల్లలు, పక్షులు హైదరాబాద్‌ లాంటి నరగంలో అందుబాటులో ఉంటున్నందున.. చాలామంది జంతువుల పెంపకాన్ని ఇష్టపడే వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్కో జంతు రకాన్ని బట్టి ధర కూడా ఉంటోంది. సాధారణంగా జర్మన్‌ షెపార్డ్‌, డాబర్‌మెన్‌ లాంటి జాతి కుక్కపిల్లలు ప్రస్తుతం మధ్య తరగతి లాంటి ప్రజలు కూడా తమ ఇళ్లల్లో పెంచుతున్నారు. అయితే వీటి ధర రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఉంటుండగా.. మరికొన్ని రకాల కుక్కపిల్లలకు లక్షల రూపాయల్లో ధర పలుకుతోంది. ల్యాబ్‌ ర్యాడర్‌, బుల్‌డాగ్‌, టగ్‌, బీఈగల్‌, బాక్సర్‌, పిట్‌బుల్‌, డాల్‌మెషన్‌, సైబేరియన్‌ హస్కీ, ఆస్ర్టేలియన్‌ షేఫార్డ్‌, బుల్‌ మాప్కిన్‌, కొరియల్‌ మాప్కిన్‌ లాంటి కుక్కపిల్లల ధరలు లక్షల రూపాయ ల్లో ఉంటున్నాయంటున్నారు. ఇలాంటి జంతువుల పెంపకానికి ఇక నుంచి అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరిగా చేస్తూ సర్కారు వెలువరించిన ఉత్తర్వులు ఈ కుక్కల పెంపకం దారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక నుంచి ఇలాంటి విదేశీ బ్రాండ్‌ కుక్కపిల్లల పెంపకంతో పాటు పక్షుల పెంపకానికి కూడా పరివేష్‌ పేరిట అటవీ, పర్యావరణ శాఖల అనుమతి తీసుకోవాలి. దీని కోసం గాను ఈ విదేశీ బ్రాండ్‌ కుక్కపిల్లలను పెంచుతున్న వారంతా డిసెంబర్‌ 2వ తేదీలోగా ఆన్‌లైన్‌ ప్రక్రియలో పరివేష్‌ పేరిట దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారందరి ఇళ్లల్లోకి అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల బృందం తనిఖీల కోసం వచ్చి పెంపుడు జంతువుల పరిస్థితితో పాటు నివాస యోగ్యమైన వాతావరణం, పరిస్థితులను పరిశీలిస్తోంది. ఆ తరువాత ఈ బృందం అటవీ, పర్యావరణ శాఖకు నివేదికలు పంపి పెంపకానికి సంబంధించిన అనుమతులు జారీ చేయాలంటూ నివేదిస్తోంది. ఈ బృందం సిఫారసుల మేరకు అటవీ శాఖ ఈ విదేశీ బ్రాండ్‌ కుక్కపిల్లలతో పాటు ఇతర జంతువులు, పక్షుల పెంపకానికి అనుమతులు జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు లేకుండా ఇక నుంచి విదేశీ బ్రాండ్‌ కుక్కలను పెంచుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ నిబందనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకోకుండా కుక్కపిల్లలను పెంచినట్లయితే వారిపై అటవీ, పర్యావరణ శాఖల చట్టం ప్రకారం కఠిన శిక్షలు తీసుకోనున్నారు. దీంతో విదేశీ బ్రాండ్‌ కుక్కపిల్లలను పెంచే వారంతా డిసెంబర్‌ 2లోగా పరివేష్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.  

జిల్లాలో విస్తరిస్తున్న పెట్‌ డాగ్‌ల పెంపకం 

కాగా, జిల్లాలో గత కొంతకాలం నుంచి ధనవంతులే కాకుండా మధ్య తరగతి ప్రజలు సైతం పెట్‌ డాగ్‌ పెంపకంపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసాలతో పాటు పలు పట్టణాలలోని మధ్య తరగతి వారు వేల రూపాయల విలువైన పెట్‌ డాగ్‌లను కొనుగోలు చేసి పెంచుకుంటుండగా.. ధనవంతులు పోటా పోటీగా తమ ప్రస్టేజ్‌ను దృష్టిలో ఉంచుకొని లక్షల రూపాయల విలువ చేసే విదేశీ బ్రాండ్‌ పెట్‌ డాగ్‌లను పెంచుకోవడం ప్యాషన్‌గా మారింది. రోజురోజుకు ఈ కుక్క పిల్లల పెంపకం తమ స్టేటస్‌ సింబల్‌గా మారుతోందంటున్నారు. ఒక్కో ఇంట్లో ఒక్కో కుటుంబ సభ్యుడు తనకు ఇష్టమైన విదేశీ బ్రాండ్‌ పెట్‌ డాగ్‌లను పెంచుకోవడం హాబీగా మారిపోయింది. గతంలో ఇంటికి రక్షణగా మాత్రమే స్వదేశీ కుక్కలను ఎక్కువగా పెంచుకునేవారు. అయితే రానురాను ఈ కుక్కల పెంపకం ఓ హాబీగా మారిపోయింది. రకరకాల ఆకారాలతో కూడిన విదేశీ బ్రాండ్‌ పెట్‌ డాగ్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. అలాగే ధనవంతులు, ఓ మోస్తారు మధ్య తరగతి ప్రజలు ఈ పెట్‌ డాగ్‌ పెంపకాన్ని క్రేజీగా మార్చుకోవడంతో ఒక్కసారిగా వీటికి డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. అయితే హైదరాబాద్‌లోని పలుచోట్ల ఈ ఫారెన్‌ పెట్‌ డాగ్స్‌ అందుబాటులోకి రావడంతో కొనుగోలు సైతం పెరిగిపోయాయి. ఈ కుక్కల కోసం వాటికి అనుకూలమైన ఆహారం కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. అలాగే పశువైద్యం సైతం అందుబాటులో ఉన్నందున వీటి పెంపకానికి ఆటంకాలు లేకుండా పోయాయి. దీంతో మధ్యతరగతి ప్రజలస్థాయి నుంచి కిందిస్థాయి ప్రజలు సైతం విదేశీ కుక్క పిల్లలను కొనుగోలు చేసి కష్టమైనప్పటికీ వాటిని పెంచుకుంటున్నారు. అంతేకాకుండా రానురాను కుక్కలపిల్లల పెంపకం, వాటి బ్రాండ్‌లను బట్టి తమ స్టేటస్‌ సింబల్‌గా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ మార్నింగ్‌ వాకింగ్‌, అలాగే మార్కెట్‌, తదితర చోట్లకు వెళ్లే సమయంలో కూడా వీటిని తమ కుటుంబ సభ్యుల్లాగానే వెంట తీసుకెళ్లడం సహజంగా మారిపోయిందంటున్నారు.

పెంపకం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే..

ఇప్పటి వరకు ఇష్టానుసారంగా విదేశీ బ్రాండ్‌ కుక్కలు, పక్షులు, ఇతర రకాల జంతువులను పెంచుకుంటున్న వారందరూ.. అటవీ, పర్యావరణ శాఖల అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అటవీ, పర్యావరణ శాఖ విదేశీ జంతువుల పెంపకానికి సంబంధించి పలు కఠిన నిబంధనలు రూపొందించింది. దీంతో పెంపకానికి సంబంధించి అనుమతులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ బ్రాండ్‌ కుక్కలు, పక్షులు, ఇతర జంతువులను పెంచుకునేందు కోసం డిసెంబర్‌ 2వ తేదీ వరకు అటవీ, పర్యావరణ శాఖలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పరివేష్‌ పేరిట ఉన్న పోర్టల్‌ను ఉపయోగించుకొని దరఖాస్తును సమర్పించాలి. అయితే ఇలా దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లను అటవీ, పర్యావరణ శాఖ అధికారుల బృందం తనిఖీ చేసి వాటి పెంపకానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలిస్తోంది. పెంపకానికి అనుకూలమైన వాతావరణం, అలాగే పరిస్థితులు ఉంటేనే ఆ బృందం అనుమతికి సిఫారసు చేస్తోంది. ఈ సిఫారసులకు అనుగుణంగానే అటవీ శాఖ పర్మిషన్‌లు జారీ చేస్తోంది. ఇలా పర్మిషన్‌లు లేకుండా విదేశీ బ్రాండ్‌ కుక్కలను పెంచితే వారిపై అటవీ, పర్యావరణ చట్టానికి అనుగుణంగా కఠినచర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే నాన్‌బెయిలెబుల్‌ సెక్షన్‌ల కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయంటున్నారు.

డిసెంబర్‌ 2లోగా దరఖాస్తు చేసుకోవాలి

: వినోద్‌ కుమార్‌, ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ టైగర్‌(ఎఫ్‌డీపీటీ) 

విదేశీ జంతువులను పెంచుకునే వారంతా అటవీ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. డిసెంబర్‌ 2వ తేదీలోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అందించాలి. పరివేష్‌ పేరిట ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాం. అనుమతులు లేకుండా ఇక నుంచి విదేశీ బ్రాండ్‌ కుక్కలను, అలాగే ఇతర విదేశీ జంతువులు, పక్షులను పెంచుకోవడం చట్టవిరుద్ధమవుతుంది. అనుమతులు లేని వారిపై కఠిన చర్యలు ఉంటాయి.

Updated Date - 2020-11-28T05:55:12+05:30 IST