Abn logo
Jul 24 2021 @ 23:53PM

పరకాలలో ఉద్రిక్తత

ధర్నా చేస్తున్న ఆందోళనకారులు

పరకాల, జూలై 24 : పరకాల జిల్లా ఏర్పాటు కోసం అఖిల పక్షం పిలుపునిచ్చిన బంద్‌ శనివారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ధర్నా చేస్తున్న వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో  ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అరెస్టు చేసి తరలించారు. కాగా, పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో పరకాల బంద్‌ సంపూర్ణంగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అఖిల పక్షం ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ సెంటర్‌, బస్టాండ్‌ కూడలి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ‘ఎమ్మెల్యే ధర్మారెడ్డి డౌన్‌ డౌన్‌.. చేతగాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’.. అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ కారులను పోలీసులు చెదరగొడుతూ అరెస్టు చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్లక్ష్యంతోనే పరకాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ములుగు, జనగామ, భూపాలపల్లి మండలాలు జిల్లాలు ఏర్పడితే పరకాల జిల్లాగా ఎందుకు కాలేదని ప్రశ్నించారు. కనీసం ఆర్డీవో కార్యాలయం కూడా లేకుండా ఎమ్మెల్యే చూస్తున్నాడని ఆరోపించారు. రేగొండ, మొగుళ్ళపల్లి, చిట్యాల, శాయంపేట మండలాలను కలుపుకొని పరకాల అమరవీరుల జిల్లా ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిపలక్ష నాయకులు పిట్ట వీరస్వామి, దుబాసి వెంకటస్వామి, మార్త భిక్షపతి, కట్కూరి దేవేందర్‌రెడ్డి, కొయ్యాడ శ్రీనివాస్‌, ఆర్‌పి. జయంత్‌లాల్‌, దేవునూరి మేఘనాథ్‌, శ్రీకాంత్‌, కక్కు రాజు, పాలకుర్తి గోపి, మంద శ్రీకాంత్‌, పరమేశ్వర్‌, రంజీత్‌ తదితరులు పాల్గొన్నారు.