పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్న ప్రకాశ్ సింగ్ బాదల్

ABN , First Publish Date - 2020-12-03T21:38:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి,

పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్న ప్రకాశ్ సింగ్ బాదల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మద్దతు పలికారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమికి గట్టి మద్దతుదారు అయిన ఆయన తన పద్మవిభూషణ్ పురస్కారాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించారు. రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు, వారి కోసం త్యాగం చేసేందుకు తన వద్ద ఏదీ లేదని విచారం వ్యక్తం చేసిన ఆయన.. రైతులకు గౌరవం దక్కని చోట తనకు గౌరవం అక్కర్లేదని అన్నారు.


రైతుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన బాదల్ కేంద్రం గతంలో తనకు ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతులను మత, వేర్పాటవాద శక్తులుగా చిత్రీకరిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్ నాయకులంతా ఏకం కావాలని బాదల్ పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా అకాలీదళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ ధిండ్సా కూడా తన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.  

Updated Date - 2020-12-03T21:38:01+05:30 IST