Abn logo
Jan 26 2021 @ 02:08AM

1న పార్లమెంట్‌ ముట్టడి

రైతు నేతల తాజా నిర్ణయం..

నేడు ఢిల్లీలో కిసాన్‌ పరేడ్‌..

5 వేల ట్రాక్టర్లకే అనుమతి

5 వేల మందే వెళ్లాలి.. 5 గంటల్లో ముగియాలి

36 షరతులతో ఢిల్లీ పోలీసుల అనుమతి

రైతు ఆగ్రహిస్తే పతనమే.. ముంబై ర్యాలీలో పవార్‌


న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):  సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం ‘కిసాన్‌ గణతంత్ర పరేడ్‌’ పేరిట దేశ రాజధానిలో ట్రాక్టర్లతో పరేడ్‌ నిర్వహించనున్న రైతుసంఘాలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 1న.. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజున పార్లమెంట్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఢిల్లీ నలుమూలల నుంచీ తాము నడుచుకుంటూ పార్లమెంట్‌ వైపు ఊరేగింపుగా వెళ్లడానికి నిర్ణయించుకున్నామని క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌ నేత దర్శన్‌ పాల్‌ ప్రకటించారు. ‘ఇప్పటికే వేలాది మంది రైతులు అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీ పొలిమేర్లకు చేరుకున్నారు. వారు గణతంత్ర పరేడ్‌ ముగిశాక తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లరు. ఢిల్లీ బయటే మకాం వేస్తారు. మా దశల వారీ ఆందోళనల్లో భాగంగా పార్లమెంట్‌ వైపు కవాతు ఒకటి’’ అని ప్రకటించారు.


ఆంక్షల నడుమ పరేడ్‌

కాగా రెండు నెలలుగా సాగుతున్న రైతుల నిరసన ప్రదర్శన మంగళవారం ట్రాక్టర్ల పరేడ్‌తో వినూత్న రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్లతో  ర్యాలీకి పోలీసులు 36 ఆంక్షలు విధించారు. సోమవారం వీటిపై రైతు నేతలకు, పోలీసు అధికారులకు చర్చలు జరిగి, వాటికి నేతలు అంగీకరించాక నిరభ్యంతర సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)ని పోలీసులు జారీ చేశారు. ఈ షరతుల ప్రకారం-- రైతులు చెబుతున్నట్లు లక్ష ట్రాక్టర్లకో, లేక 50వేల ట్రాక్టర్లకో అనుమతి లేదు. కేవలం 5000 ట్రాక్టర్లు, 5000 మంది మాత్రమే రైతు లు, వారికి తోడు 2500 మంది వలంటీర్లను మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశించనిస్తారు. ఈ ర్యాలీ కూడా నిర్దేశిత మార్గాల్లోనే సాగాలి. ఎక్కడా ఆగడం, ధర్నా చేయడం, ప్రసంగాలు లాంటివేవీ కుదరవు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ముగిసిపోవాలి.


ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు అంరా యం కలిగించకుండా రోడ్డుకు ఓ పక్కగా ట్రాక్టర్లు వెళ్లాలి. ట్రాక్టర్లకు కట్టే జెండాలకు కర్రలే వాడాలి. ర్యాలీ ఎక్కడ గతి తప్పినా నిర్వాహకులదే బాధ్యత. ఎలాంటి హింస జరిగినా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. షరతుల్లో ఒక్క టి ఉల్లంఘించినా ర్యాలీకి అనుమతి నిరాకరిస్తారు.


వెనక్కి వెళ్లకపోతే....?!

పోలీసులు ఇన్ని ఆంక్షలు విధించినా కొన్ని సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. సింఘూ, చిల్లా, టిక్రీ, గాజీపూర్‌ ప్రాంతాల్లో ఏ మార్గంలో ట్రాక్టర్ల పరేడ్‌ నిర్వహించాలో పోలీసులు ఇప్పటికే నిర్దేశించారు. అయితే ఈ మార్గాల్లో ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత వెనక్కి వె ళ్లకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన నలు వ్యక్తమవుతున్నాయి . ఈ మార్గాలను దిగ్బంధనం చేస్తే ఢిల్లీలో జన జీవనం స్తంభించిపోయే అవకాశాలున్నాయి.


కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ జరుగుతున్నందున ఢిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మొదట్లో ఢిల్లీలోకి ప్రవేశించడాన్నే అనుమతించబోమని చెప్పిన పోలీసులు తప్పని పరిస్థితుల్లో రైతులను ట్రాక్టర్ల పరేడ్‌ చేసేందుకు అనుమతించాల్సి వచ్చింది. అయితే ఇది ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేమని పోలీసులు సైతం అంటున్నారు. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి   రిపబ్లిక్‌ డే పరేడ్‌ భద్రతకు నియమించిన కేంద్ర రిజర్వు పోలీసుసిబ్బంది, ఇతర అధికారులు  అతితక్కువ వ్యవధిలో సిద్దంగా ఉండాలని ఢిల్లీపోలీసు కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీవాత్సవ ఇప్పటికే ప్రకటించారు. కాగా రైతుల నిరసన ప్రదర్శన త్వరలో ముగుస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉన్నదని, అయితే నిరసన తెలిపేవారి సంఖ్య అంత ఎక్కువేమీ కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 11 రౌండ్ల చర్చలు జరిపినప్పటికీ సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న తమ డిమాండ్‌పై రైతులు పట్టు వీడలేదు.

మీ పతనం తప్పదు

రైతుకు ఆగ్రహం వస్తే అధికార పార్టీ సర్వనాశనమే: శరద్‌ పవార్‌


ముంబై, జనవరి 25: సాగు చట్టాలతో రైతుల్లో తీవ్రమైన అభద్రతా భావాన్ని కేంద్రం నింపిందని ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ వ్యవసాయమంత్రి శరద్‌ పవార్‌ విమర్శించారు. ‘‘రాజ్యాంగాన్ని కాలరాసి ఎలాంటి చట్టాలైనా చేయవచ్చు. కానీ రైతు లు, సామాన్యులకు ఆగ్రహం వస్తే, వారు ఉద్యమి స్తే మీ పతనం తప్పదు. చేసిన చట్టాలను మీరు వెనక్కి తీసుకున్నా తీసుకోకపోయినా ఆ చట్టాలను, అదే క్రమంలో అధికార పార్టీని సర్వనాశనం చేసే దాకా విశ్రమించరు’’ అని  హెచ్చరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ముంబైలో వేలాది మంది రైతులు సోమవారంనాడు ఆజాద్‌ మైదాన్‌లో ధర్నా చేశారు.  అనంతరం జరిగిన సభలో కేంద్రం తీరును పవార్‌ తీవ్రంగా నిరసించారు.  


ఇదంతా డ్రామా : ఫడణవీస్‌

రైతుల ఆందోళనను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పక్షాలు డ్రామాలాడుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శించారు.  ముంబైలో జరిగిన రైతుల ధర్నా ఓ పబ్లిసిటీ స్టంట్‌ అని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అధవలే అన్నారు.

Advertisement
Advertisement
Advertisement