తిరుపతి, చిత్తూరు సహా ప్రధాన పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-27T07:09:39+05:30 IST

జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా పరిమిత ఆంక్షలు విధించారు.

తిరుపతి, చిత్తూరు సహా ప్రధాన పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్‌

 మొత్తానికి ఆంక్షల బండి కదిలింది. పాక్షిక లాక్‌డౌన్‌కు ఎక్కడికక్కడ స్థానిక సంస్థలు సమాయత్తం అవుతున్నాయి. నిబంధనల అమలుకు సమయాలను నిర్ణయించుకుంటున్నాయి. పరిస్థితి చేయిదాటి పోయాక అయినా ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టడం అభినందించదగిందే. కాకపోతే ఆదేశాలు ప్రకటించి చేతులు దులుపుకోకుండా అమలు మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తూనే, బాధితులందరికీ వైద్య సాయం సకాలంలో అందేలా సమన్వయం చేసుకోవడం కూడా అత్యంత ప్రధానం. సరిగ్గా ఏడాది కిందటి రోజులను గుర్తు చేసుకుని, అంతకన్నా మరింత జాగ్రత్తగా అధికార యంత్రాంగం వ్యవహరించాల్సి ఉంది. మాస్క్‌ ఒక్కటీ తగిలించుకుని విచ్చలవిడి తిరుగుళ్ళు కొనసాగించకుండా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఆశపడి భంగ పడక సొంత జాగ్రత్తల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలదేముంది.. కుంభమేళాలకు తెరలెత్తేసి, గుడులు తెరిచేసి, ఎన్నికల పేరుతో ప్రచార జాతర్లకు అనుమతులిచ్చేసి.. ప్రమాదం నెత్తికొచ్చినాక మాత్రం చేతులెత్తేస్తాయి. నెపం ప్రజల నెత్తిమీద వేసేస్తాయి. వైరస్‌కన్నా తీవ్రంగా భయం చుట్టుముడుతున్న ఈ కాలంలో జనం తమను తాము కాపాడుకోవాలంటే ఇప్పుడు పెడుతున్న ఆంక్షలను గౌరవించి, అందుకనుగుణంగా మెసలాల్సి ఉంది.


 తిరుపతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని  ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా పరిమిత ఆంక్షలు విధించారు.  రోజువారీ సగటున వైరస్‌ కేసులు వెయ్యి దాటుతుండడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నింటిలో బెడ్లు, ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ మందులు దొరకడం దుర్లభంగా మారుతుండడం వంటి కారణాలతోనే ఈ చర్యలకు దిగారు.  ముంచుకొచ్చిన సంక్షోభాన్ని గుర్తించిన వ్యాపార సంఘాలు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చాయి. వీరి సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌, రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో చర్చించి ఆంక్షల నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంగళవారం నుంచీ తిరుపతి, చిత్తూరు నగరాలు సహా మదనపల్లె, శ్రీకాళహస్తి, పలమనేరు, పుంగనూరు, పుత్తూరు, నగరి, కుప్పం, పీలేరు తదితర పట్టణాలన్నింటిలోనూ పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించారు.


తిరుపతి నగరమంతా కంటైన్‌మెంట్‌ జోన్‌


తిరుపతి నగరం మొత్తం మంగళవారం నుంచీ కంటైన్‌మెంట్‌ జోన్‌గా మారుతోంది. నగర యంత్రాంగం ఈ మేరకు  ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూకు అదనంగా పలు ఆంక్షలు విధిస్తున్నట్టు నగర ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ గిరీషాలు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. నగరంలో సుమారు లక్ష ఇళ్ళుంటే అందులో పదివేల ఇళ్ళలో కరోనా వైరస్‌ బాధితులున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేశారు. 

తాజా ఆంక్షల ప్రయారం.. తిరుపతి నగరంలో ఉదయం 7నుంచీ మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలు నడుస్తాయి. ఆ తర్వాత  మూతపడతాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకూ తెరిచే వుంచుకోవచ్చు కానీ కేవలం టేక్‌ అవేకి మాత్రమే అనుమతి ఇచ్చారు. నగరంలో వాహనాలు, ప్రజల కదలికలపై మాత్రం రాత్రి 10 గంటల వరకూ ఎలాంటి ఆంక్షలూ వుండవు. ఇక తిరుపతిలో ఏటా వైభవంగా నిర్వహించే తాతయ్యగుంట గంగమ్మ జాతరను గతేడాది తరహాలోనే కొవిడ్‌ కారణంగా ఏకాంతంగా నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని ఆలయాల్లో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయరాదన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. తిరుపతి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు స్వచ్ఛందంగా దుకాణాల మూసివేతకు అంగీకరించడంతో స్థానిక యంత్రాంగం ఈ నిర్ణయాలు ప్రకటించింది. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, అత్యవసర సర్వీసులకు సంబంధించిన దుకాణాలకు లాక్‌డౌన్‌ నుంచీ మినహాయింపు వుంటుంది.


చిత్తూరులో మధ్యాహ్నం 1 గంట నుంచే లాక్‌డౌన్‌


జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అలాగే ఆంక్షలు అమలయ్యే వేళల్లో అత్యవసరాలకు తప్పితే ఆటో రిక్షాలను కూడా అనుమతించేది లేదని నగర డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. ఇక్కడ కూడా ఆస్పత్రులు, మందుల షాపులు, ల్యాబ్‌లు వంటి  అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.


పట్టణాల్లో ఆంక్షలు ఇలా..


-మదనపల్లెలో ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలు, హోటళ్ళు తెరుచుకుంటాయి.

-శ్రీకాళహస్తిలో ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు, హోటళ్ళకు అనుమతించారు.

-పలమనేరులో ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు తెరుస్తారు. 

-పుంగనూరులో ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 12 వరకు, తర్వాత సాయంత్రం 5 నుంచీ 7 వరకూ రెండు విడతలుగా దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

 -పుత్తూరు, నగరి పట్టణాల్లో సైతం మధ్యాహ్నం 2 తర్వాత దుకాణాలూ మూతపడనున్నాయి.

- కుప్పం పట్టణంలో ఉదయం 6 గంటల నుంచీ 11 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. 

-పీలేరులో సాయంత్రం 5 గంటల తర్వాత దుకాణాలు నడవరాదని ప్రకటించారు.

Updated Date - 2021-04-27T07:09:39+05:30 IST