Abn logo
Sep 27 2021 @ 23:49PM

భారత్‌బంద్‌ పాక్షికం

పరిగిలో రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులు

  • రహదారులు, బస్‌డిపోల ఎదుట నాయకుల ధర్నాలు,  నిరసనలు, ర్యాలీలు
  • ఆందోళనకారుల అరెస్టు.. పోలీస్‌స్టేషన్లకు తరలింపు

 (ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) నూతన వ్యవసాయ చట్టాలు, పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారత్‌బంద్‌ జిల్లాలో పాక్షికంగా జరిగింది. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం బస్సులు రోడ్లపైకి రాకుండా డిపోల ఎదుట అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ డిపోల ఎదుట వారు ఆందోళనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విఽధానాలను నిరసిస్తూ వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోనూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. వికారాబాద్‌లో నిర్వహించిన బంద్‌ కార్యక్రమానికి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ హాజరు కాగా, తాండూరులో టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌ మహరాజ్‌, పరిగిలో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు మూసివేయగా, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచారు. అత్యవసర సేవలను విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టారు. ప్రజా రవాణా, జీవనానికి ఎలాంటి ఇబ్బందులు  ఎదురు కాలేవు. మేడ్చల్‌ జిల్లాలో బంద్‌ పాక్షికంగా జరిగింది. శామీర్‌పేట మండలంలో పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ అమ్మకాలు నిలపివేయాలని అఖిలపక్ష నాయకులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. అక్కడా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.