షెడ్యూల్ ప్రకారమే యూపీ ఎన్నికలు.. ఈసీని కోరిన పార్టీలు

ABN , First Publish Date - 2021-12-29T20:39:40+05:30 IST

ఒమైక్రాన్ ఆందోళనలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో జాప్యం..

షెడ్యూల్ ప్రకారమే యూపీ ఎన్నికలు.. ఈసీని కోరిన పార్టీలు

లక్నో: ఒమైక్రాన్ ఆందోళనలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగరాదని ఆ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్‌ను కోరాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే, ఈసీఐ సీనియర్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకూ అన్ని జాతీయ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయలను తెలుసుకున్నారు. యూపీలో ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు ఈసీఐ బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా లక్నోలో ఉంది.


జేపీఎస్ రాథోర్ సారథ్యంలో బీజేపీ ప్రతినిధి బృందం, నరేష్ ఉత్తమ్ పటేల్ సారథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ప్రతినిధి బృందం, బీఎస్‌పీ తరఫున మేవాలాల్ గౌతమ్ బృందం, కాంగ్రెస్ తరఫున ఓంకార్ నాథ్ సింగ్, ఆర్ఎల్‌డీ తరఫున అనిల్ డూబే‌ ఈసీఐని కలిసింది. కోవిడ్ ప్రోటోకాల్స్ కఠినంగా అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలని పార్టీలన్నీ ఈసీఐకి విజ్ఞప్తి చేశాయి.


సమావేశానంతరం ఎస్‌పీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినప్పటికీ తుది నిర్ణయం ఈసీదేనని బీజేపీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు రాథోర్ తెలిపారు.

Updated Date - 2021-12-29T20:39:40+05:30 IST