ఒకరిపై కక్ష.. ఎందరికో శిక్ష!

ABN , First Publish Date - 2021-07-22T04:54:40+05:30 IST

మాన్సాస్‌ వ్యవహారంలో..

ఒకరిపై కక్ష.. ఎందరికో శిక్ష!
మాన్సాస్‌ కార్యాలయం

జీతాలకు నోచుకోని ఉద్యోగులు

వేల మందికి అవస్థలు

చైర్మన్‌కు నిధుల మంజూరుకు అవకాశం లేకుండా చేసిన వైనం

ఈవోపై కేసు వేస్తానని అశోక్‌ హెచ్చరిక


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): మాన్సాస్‌ వ్యవహారంలో సర్కారు ఏదోరకంగా ఇబ్బందులు సృష్టిస్తోంది. ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే చైర్మన్‌కు పదవి తప్ప చివరికి సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు కూడా వీలు లేకుండా చేస్తోంది. ట్రస్టు వ్యవహారం కుటుంబ సమస్యగా మంత్రులు చెబుతున్నా... తెరవెనుక కథ నడిపిస్తున్నది ప్రభుత్వమే అన్నది జగమెరిగిన సత్యం. మాన్సాస్‌ చైర్మన్‌గా ట్రస్టు బోర్టు ఆమోదంతో తీసుకున్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్‌ అధికారి అమలు చేయాలి. ప్రజా ప్రయోజనానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉన్నప్పుడు, ట్రస్టుకు నష్టం కలిగించేది అయినప్పుడే బోర్డు ఆదేశాలను ఈవో వెనక్కు పంపించవచ్చు. పునఃపరిశీలించాలని కోరవచ్చు. కానీ మాన్సాస్‌ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఈవో అడ్డంకులు సృష్టిస్తున్నారన్నది బలమైన ఆరోపణ.


బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్‌ ఖాతాలపై ఫ్రీజింగ్‌ పెట్టి ఎటువంటి చెల్లింపులు చేయకుండా ఆదేశాలిచ్చారు. దీంతో ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు ఉన్నా పైసా కూడా ఖర్చు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులకు, ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అశోక్‌కు ఇది జీర్ణించుకోలేని సమస్యగా పరిణమించింది. తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించుకోలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నారు. మాన్సాస్‌ పరిధిలో కీలకమైన విద్యా సంస్థలుగా ఉన్న ఎమ్‌వీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, మహారాజా అటానమస్‌ కళాశాల ఉద్యోగులు, కోటలోని మాన్సాస్‌ డిగ్రీ కళాశాల, ఇంటర్‌ కళాశాల, బీఈడీ, లా, పూల్‌బాగ్‌ పీజీ కళాశాల ఇలా మొత్తం 14విద్యాసంస్థలకు చెందిన ఉద్యోగులు జీతాల కోసం ఇటీవల రోడ్డెక్కారు. కోటలోని మాన్సాస్‌ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మద్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరసన కొనసాగించారు. ఇంత చేసినా ఈవోలో ఎటువంటి మార్పు రాలేదు.


మాన్సాస్‌ దేవదాయ శాఖ పరిధిలోకి వస్తుంది. జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం దేవదాయ శాఖ ద్వారా ఈవోపై ఒత్తిడి తెస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కరోనా కాలంలో సక్రమంగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయటం సరికాదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పాటు పూర్తిగా జీతాలు చెల్లించకుంటే ఏవిధంగా కుటుంబాలను నెట్టుకువస్తామని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాన్సాస్‌ ట్రస్టు పాలక వర్గాల పంతాలు పట్టింపుల కారణంగా ఉద్యోగులు నలిగిపోతున్నారు. 


కోర్టు ధిక్కరణపై కేసు వేస్తా

మాన్సాస్‌ చైర్మన్‌గా నన్ను నియమిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని చైర్మన్‌గా వ్యవహరిస్తున్నా. తిరిగి బాధ్యతలు చేపట్టిన రోజున మొదటిగా ఉద్యోగుల జీతాల ఫైల్‌పైనే సంతకం చేశాను. కరస్పాండెంట్‌ చెక్కులు విడుదల చేశారు. కానీ అవి చెల్లుబాటు కానీయకుండా బ్యాంకుల ఖాతాలపై ఈవో ఫ్రీజింగ్‌ పెట్టారు. జీతాలు చెల్లించేందుకు కూడా అడ్డుపడటం అన్యాయం. ఈవో జీతం అందుకోకుండా పనిచేయగలరా? తోటి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయటం సరికాదు. మాన్సాస్‌ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తరువాత ఇంతవరకు నన్ను ఈవో కలవలేదు. కార్యాలయానికి వెళ్లినా కనిపించలేదు. మాన్సాస్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోరినప్పుడు కూడా స్పందించడం లేదు. హైకోర్టు ఆదేశించినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై కోర్టు ధిక్కారణ కేసు వేస్తున్నా.

                               - పూసపాటి అశోక్‌ గజపతిరాజు, చైర్మన్‌, మాన్సాస్‌



Updated Date - 2021-07-22T04:54:40+05:30 IST