Abn logo
Jun 16 2020 @ 00:25AM

అతికించండి మళ్ళీ అతని ముఖానికి నవ్వు

కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు తారుమారయ్యాయనే అభిప్రాయం ఒకటి గట్టిగా ఉన్నది. ఇది సరికాదు. పెద్ద నోట్ల రద్దు కారణంగా సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల పతనం, జీఎస్టీ, కరోనా ఉపద్రవం, పౌరసత్వ చట్టాల ఫలితంగా నెలకొన్న సామాజిక అశాంతి న్యాయవ్యవస్థతో సహా ఎల్లెడలా ప్రబలిపోయిన అవినీతి మొదలైనవే మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రతిబంధకాలుగా ఉన్నాయి. ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని చమురు దిగుమతులపై భారీ సుంకాలు విధించాలి. సామాన్య మానవునిపై ఆర్థిక భారం పడకుండా చూడాలి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో స్థూల దేశియోత్పత్తి (జీడీపీ- ఒక సంవత్సరంలో దేశీయ వనరుల వల్ల ఉత్పత్తి అయిన వస్తు, సేవల విలువ) పెరుగుదల ఎలా ఉండబోతున్నది? వివిధ సంస్థల అంచనాలు (+) 1.2 శాతం నుంచి (–) 11 శాతం దాకా ఉండవచ్చని వివిధ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా (+) 1.2 శాతం వృద్ధి కాగా బ్లూమ్ బెర్గ్ (–) 0.4 శాతం తగ్గుదలను సూచించింది. ఫిట్చ్, స్టాండర్డ్ , పూర్ సంస్థతో పాటు ఐ సి ఆర్ ఏ కూడా జీడీపీ పెరుగుదలలో (–) 5 శాతం తగ్గుదల ను ఊహించాయి. (–) 10 శాతం క్షీణ వృద్ధిగా ఉండగలదని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడుతున్నారు. మొదటి త్రైమాసికంలో (–) 40 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ మిగతా మూడు త్రైమాసికాలలో పూర్తిగా పుంజుకుంటుందని ఎస్ బి ఐ అంచనా వేసింది. అయితే వార్షిక ప్రాతిపదికన (–) 10 శాతం తగ్గుదల ఖాయమని ఎస్ బిఐ భావించింది. ఇక గ్లోబల్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ నిపుణుడు అర్థర్ డి.లిటిల్ అంచనాసైతం (–) 11 శాతం. ఇవన్నీ తక్కువ అంచనాలని నేను భావిస్తున్నాను.


దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి జీడీపీ తగ్గుదల (–) 15 శాతంగా ఉండగలదని నా అంచనా. కరోనా వైరస్ మళ్ళీ విజృంభించిన పక్షంలో జీడీపీ తగ్గుదల మరింత అధికంగా ఉండడం ఖాయం. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు, పారిశ్రామిక దేశాలు అనుసరిస్తున్న సంరక్షణ విధానాలు, ప్రవాస భారతీయులు స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే ధనం తగ్గిపోవడం మొదలైన కారణాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎంతైనా ఉన్నది. 


ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయనే భావనతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు చేపట్టడం జరుగుతోందని, అయితే కరోనా మహమ్మారితో పరిస్థితులు తారుమారయ్యాయనే అభిప్రాయం ఒకటి గట్టిగా ఉన్నది. అయితే ఇది సరికాదు. కరోనాను సాకుగా చూపడం సమంజసం కాదు. మన ఆర్థిక వ్యవస్థ సంస్థాగత సమస్యల నెదుర్కొంటున్నది. తత్ఫలితంగానే 2017 నుంచి 2020 దాకా జీడీపీ వృద్ధిరేట్లు తగ్గిపోయాయి. కరోనా విలయం ఆర్థిక వ్యవస్థ సమస్యలను మరింత ముందుకు తెచ్చింది. ఏమిటీ సంస్థాగత సమస్యలు? పెద్ద నోట్ల రద్దు కారణంగా సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల పతనం, జీ ఎస్టీ, కరోనా ఉపద్రవం, పౌరసత్వ చట్టాల ఫలితంగా నెలకొన్న సామాజిక అశాంతి (ఇది, విదేశీ పెట్టుబడుల రాకను ఎంతైనా నిరోధిస్తోంది), న్యాయవ్యవస్థతో సహా ఎల్లెడలా ప్రబలిపోయిన అవినీతి మొదలైనవే మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను.


రేటింగ్ ఏజెన్సీలు మరిన్ని సంస్కరణల ఆవశ్యకత గురించి అదే పనిగా ఘోషిస్తున్నాయి. కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గుదల, దిగుమతి సుంకాల తగ్గింపు, విదేశీ మదుపులను ఇంతవరకు అనుమతించని మిగతా రంగాలను కూడా పూర్తిగా తెరవడం మొదలైన చర్యలు ఆర్థిక పురోగతికి ఎంతైనా అవసరమని అవి ప్రతిపాదిస్తున్నాయి. పలు రేటింగ్ ఏజెన్సీల అంచనాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని జీడీపీ వృద్ధిరేటు (–) 5 శాతం మేరకు ఉండగలదని ప్రభుత్వం భావిస్తోంది రుణాలను తీసుకోవడం కొనసాగిస్తూ అ ఆర్థిక వ్యవస్థను మరింతగా అగాథంలోకి తోసివేస్తుంది. మార్గాంతరమేమిటి? వృద్ధిరేటు తగ్గుదల (–) 15 శాతంగా ఉండేలా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవడం, ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని చమురు దిగుమతులపై భారీ సుంకాలను విధించడం చేయాలి. దీని వల్ల ప్రయాణాలు ఎక్కువగా చేసేవారిపైన, ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అయిన సరుకులను కొనుగోలు చేసేవారిపైన మరింత ఆర్థిక భారం పడుతుంది. సామాన్య మానవుని ఆర్థిక భారం పడకుండా చూడాలి. భారీ దిగుమతి సుంకాల వల్ల ప్రభుత్వానికి అవసరమైన ఆదాయం సమకూరుతుంది. రుణాలు తీసుకోవాల్సిన, వాటిపై వడ్డీలు చెల్లించాల్సిన ప్రయాస తప్పుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...