పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి సంస్థల్లో సోదాలు.. డొంక కదులుతుందా?

ABN , First Publish Date - 2021-01-20T06:56:25+05:30 IST

హిందూ దేవాలయాలపై తానే దాడిచేశానని స్వయంగా..

పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి సంస్థల్లో సోదాలు.. డొంక కదులుతుందా?
మదర్‌ థెరిస్సా స్కూల్‌లో సోదాలు చేసి బయటకు వస్తున్న సీఐడీ ఎస్పీ రాధిక బృందం

పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి విద్యా సంస్థల్లో సీఐడీ సోదాలతో కలకలం

ఆలయాల్లో దాడులు తనే చేశానని వెల్లడించడంతో ఇప్పటికే అదుపులోకి

చక్రవర్తితో సాన్నిహిత్యం ఉన్న జిల్లా నేతలు, ప్రముఖులు, అధికారుల్లో గుబులు

సామాజిక  సేవ పేరుతో పాస్టర్‌ నుంచి పలువురు భారీగా నిధుల దండుడు

ఆయనతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా నుంచి తొలగింపు

ఈయనకు జిల్లాలో ఎక్కడ ఎవరు ఎలా సహకరించారనే దానిపై కూపీ


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలపై తానే దాడిచేశానని స్వయంగా వెల్లడించిన కాకినాడకు చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి నిర్వాకంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాతో సహా రాష్ట్రంలో అనేక ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను తానే కూల్చేశానని, ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన స్వయంగా చెప్పిన మాటల వీడియో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణంతో సీఐడీ పోలీసులు ప్రవీణ్‌ చక్రవర్తిని ఆరు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అందులోభాగంగా కాకినాడ రూరల్‌, సామర్లకోట మండలాల పరిధిలోని ఆయన నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మంగళవారం సోదాలు జరపడం కలకలం రేపుతోంది. కాకినాడ కేంద్రంగా రహస్యంగా ఇంత బాగోతం ఎలా నడుస్తుందనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


పాస్టర్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఈయనతో సన్నిహిత సంబంధాలున్న జిల్లా ప్రముఖులు, రాజకీయ నేతలు, కొందరు అధికారుల్లో వణుకుపుడుతోంది. వీరిలో చాలామంది పలు సామాజిక సాయం అవసరాల పేరుతో పాస్టర్‌ నుంచి భారీగా నిధులు దండేశారు. ఆ సాక్ష్యాలు ఏమైనా బయటకు వస్తాయేమోననే కలవరం వీరిని వెన్నాడుతోంది. తమ పేరు ఎక్కడ బయటపడుతుందోనని ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటికే ఈయనతో చనువుగా ఉన్న కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరనేది బయటకు రావడంతో వారంతా ఉలిక్కిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమపైనా ప్రవీణ్‌ మరకలు పడకుండా ఉండేందుకు పలువురు నేతలు, అధికారులు ఆయనతో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించే పనిలో పడ్డారు. అటు మంత్రి కన్నబాబు సైతం తనపై ఆరోపణలు వస్తుండడంతో పాస్టర్‌తో తనకు సంబంధం లేదని ప్రకటించడం విశేషం. తాజా ఘటన నేపథ్యంలో ప్రవీణ్‌ చక్రవర్తి విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందిలోనూ వణుకు మొదలైంది. చుట్టూ తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతో పలువురు ఇప్పటికే సెలవుపై వెళ్లిపోయారు.


మరోపక్క జిల్లా పోలీసులు సైతం ఇప్పుడు ప్రవీణ్‌ చక్రవర్తికి సంబంధించిన లీలలపై దృష్టిసారించారు. ఆయన నేపథ్యం, ఆస్తులు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారనే వివరాలను ఆరా తీసేపనిలో పడ్డారు. ఆయనపై ఉన్న కేసులపైనా లోతుగా ఆరా తీస్తున్నారు. గతంలో తన వద్ద పనిచేసే ఓ యువతిని వివాహం పేరుతో శారీరకంగా మోసం చేసిన నేపథ్యంలో అప్పట్లో నమోదైన కేసును సర్పవరం పోలీసులు తవ్వుతున్నారు. రాష్ట్రంలో 699 గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని పాస్టర్‌ ప్రవీణ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ గ్రామాలు జిల్లాలో ఎన్ని ఉన్నాయనేదానిపై సీఐడీతోపాటు జిల్లా పోలీసులు దృష్టిసారించారు. ఆ జాబితాలో జిల్లాలో ఎక్కడెక్కడ ఏఏ గ్రామాలను ఇలా మార్చారనే దానిపై త్వరలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయనకు జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా సహకరించారనేదానిపైనా కూపీ లాగుతున్నారు. అలాగే జిల్లాలో పలుచోట్ల ఇప్పటివరకు జరిగిన దేవాలయాలపై దాడుల్లో పాస్టర్‌ ప్రవీణ్‌ పాత్ర ఎంత? ఈయన వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.


వారందరు ఎక్కడ?

ద్రాక్షారామకు చెందిన పాస్టర్‌ చక్రవర్తి కొన్నేళ్లుగా క్రైస్తవ మతప్రచారకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు విదేశాల నుంచి భారీస్థాయిలో విరాళాలు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో కాకినాడ, సామర్లకోటలో ఈ నిధులతో మదర్‌ థెరిస్సా పేరుతో పలు పాఠశాలలు, కేటీసీ చిల్డ్రన్‌ హోం, సిలోన్‌ బ్లైండ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. కాకినాడకు సమీపంలోని సామర్లకోట మండలం ఉండూరు పదిహేను ఎకరాల్లో పీవీఆర్‌ఎం పేరుతో ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ పేరుతో ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరకూ పలు విద్యాసంస్థలు నడుపుతున్నారు. ఇందులో 90 శాతానికి వరకూ క్రైస్తవ మతానికి చెందిన వారికే సీట్లు ఇస్తున్నారు. అయితే ఈ పాఠశాలల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎప్పటినుంచో గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ప్రవీణ్‌ చక్రవర్తి అరెస్ట్‌ నేపథ్యంలో ఈ విద్యాసంస్థల వెనుక చీకటి బాగోతాలపైనా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలికల కోసం పాస్టర్‌ ప్రవీణ్‌ పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అనాధలు, నిరుపేదలు, ఇటుకబట్టీల కార్మికులను ఇందులో చేర్చి చదివిస్తున్నారు. విద్యాభ్యాసం అనంతరం వీరిని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయిస్తున్నట్టు, తద్వారా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.


అన్నిచోట్లా వరుస తనిఖీలు

సామర్లకోట: హిందూ దేవాలయా ల్లో విగ్రహాల ధ్వంసం, దాడులు వంటి నేర సంఘటనలపై కాకినాడకు చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌చక్రవర్తి మాట్లాడిన వీడియోకు సంబంధించి సీఐడీ సైబర్‌క్రైంలో కేసు నమోదు చేయడం జరిగిందని సీఐడీ ఎస్పీ రాధిక వెల్లడించారు. మంగళవారం రాత్రి వరకూ పాస్టర్‌ ప్రవీణ్‌చక్రవర్తికి చెందిన సామర్లకోట మండలం ఉండూరు గ్రామశివారున బ్రహ్మనందపురంలో ఉన్న విద్యా సంస్ధలను సీఐడీ అధికారులు పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ రాధిక విలేకరులతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ప్రవీణ్‌చక్రవర్తికి చెందిన విద్యాసంస్ధలు, ఆయన నివాస గృహాల్లో తనిఖీలు చేసినట్టు ఆమె తెలిపారు. కొన్ని గ్రామాలను క్రైస్తవంలోకి మార్చే శానని చెప్పడం జరిగిందని, దీనిని ఆధారంగా చేసుకుని ఆ గ్రామాలకు వెళ్లి పూర్తి పరిశీలన చేస్తామన్నారు. అదేవిధంగా విగ్రహాలను ఆయన చెప్పిన మీదట, దీనిపైనా సమగ్ర విచారణ చేస్తామని ఆమె చెప్పారు. మంగళవారం తమ సిబ్బం దితో కలసి చేసిన తనిఖీల్లో కొన్ని సాంకేతిక ఆధా రాలు లభించాయని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ రాధిక చెప్పారు.

Updated Date - 2021-01-20T06:56:25+05:30 IST