ఎప్పుడు కొంటారయ్యా!

ABN , First Publish Date - 2021-06-18T04:04:39+05:30 IST

జిల్లాలోని ఉదయగిరి సబ్‌ డివిజనలో ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు, వరికుంటపాడు మండలాల్లో పసుపు సాగు చేస్తారు.

ఎప్పుడు కొంటారయ్యా!
ఉదయగిరి : ఓ రైతు ఇంట్లో నిల్వ ఉన్న పసుపు బస్తాలు

రైతుల ఇళ్లలోనే పసుపు నిల్వలు

గతేడాది మద్దతు ధర రూ.6.850

ఇంకా ఏ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

మార్కెట్లో పతనమైన ధర

అప్పులు భరించలేక వచ్చినకాడికి అమ్మేస్తున్న రైతన్నలు


పసుపు ధరలు పతనమయ్యాయి. నాణ్యతను బట్టి మార్కెట్‌లో క్వింటం రూ.4,500 నుంచి 5,500 పలుకుతోంది. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మార్క్‌ఫడ్‌ ద్వారా కొనుగోలు చేస్తుందన్న ఆశతో రైతులు దిగుబడులను నివాసాల్లో నిల్వ చేశారు. గతేడాది క్వింటం రూ.6,850 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఏ నిర్ణయం తీసుకోకపోవడంతోపాటు రైతులు దిగుబడులను నివాసాల్లో ఉంచుకొని వాటిని రక్షించుకోలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు కొందరు రైతులు  తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో వచ్చినకాడికి దళారులకు అమ్మేస్తున్నారు. 

ఉదయగిరి రూరల్‌, జూన 17 : జిల్లాలోని ఉదయగిరి సబ్‌ డివిజనలో ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు, వరికుంటపాడు మండలాల్లో పసుపు సాగు చేస్తారు. అత్యధిక విస్తీర్ణంలో ఉదయగిరి మండలంలో పంట సాగవుతోంది. గతేడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంట నవంబరులో కురిసిన నివర్‌ తుఫాన కారణంగా దెబ్బతింది. సాధారణంగా ఎకరాకు 35-45 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. కానీ వర్షానికి 20-25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు అంటున్నారు. దిగుబడి తగ్గితే ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. కానీ భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం నాణ్యతను బట్టి క్వింటం రూ.4,500 నుంచి రూ.5,500 పలుకుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మద్దతు ధరతో కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. బహిరంగ మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండటం, మద్దతు ధర అధికంగా ఉండటంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తూ దిగుబడులను నివాసాల్లోనే ఉంచుకొన్నారు. 


పరిహారం ఇచ్చినందునే..


గతేడాది నవంబరులో కురిసిన నివర్‌ తుఫాన కారణంగా పసుపు పంట తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో అధికారులు దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పంట దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరాకు రూ.19,706 చొప్పున ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం కింద నగదు జమ చేసింది. అందులో భాగంగానే ప్రభుత్వం దిగుబడులను కొనుగోలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మార్కెట్‌లో పసుపు ధరలు పతనం కావడంతో ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రభుత్వం పసుపు కొంటారా లేదా అనే సందిగ్ధంలో కొందరు రైతులు వచ్చినకాడికి దళారులకు అమ్మేసి అప్పులు తీర్చుకొంటున్నారు. 


ఎలాంటి ఆదేశాలు రాలేదు

పుసుపు కొనుగోళ్లకు సంబంఽధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతుల విజ్ఞప్తి మేరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. ఆదేశాలు రాగానే కొనుగోళ్లు చేపడతాం. 

- రాజేశ్వరి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌


Updated Date - 2021-06-18T04:04:39+05:30 IST