పాట పాడేశారు!

ABN , First Publish Date - 2021-06-25T06:52:47+05:30 IST

పిఠాపురం సంస్థానం సత్రం భూముల కౌలు కేటాయింపు వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బహిరంగ వేలం నిర్వహించి సంస్థానానికి అధిక ఆదాయం వచ్చేలా చేయాల్సిన దేవదాయశాఖ అధికారులు కాసుల కక్కుర్తికి తలొగ్గేశారు.

పాట పాడేశారు!
తొండంగిలోని పిఠాపురం సంస్థానం సత్రం భూములు

పిఠాపురం సంస్థానం సత్రం కౌలు భూముల వేలంలో అంతులేని అక్రమాలు
బహిరంగ వేలానికి బదులు రహస్యంగా 500 ఎకరాలు కౌలుకు కేటాయింపు
తుని వైసీపీ కీలక నేత అనుచరుల కోసం దేవదాయశాఖ అధికారుల బరితెగింపు
ఎకరానికి అత్యంత కారుచౌక వార్షిక కౌలు ఖరారు చేస్తూ నివేదికలు తయారీ
అందుకుగాను లబ్ధిదారుల నుంచి లక్షల్లో అమ్యామ్యాలు పిండేసిన అధికారులు
 భాగోతం తెలియడంతో వేలం కేటాయింపు ఫైలుపై సంతకం పెట్టని పాదగయ ఈవో
తనకు తెలియకుండా దొంగ వేలం నిర్వహించడంపై పిఠాపురం ఎమ్మెల్యే ఫైర్‌
దేవదాయశాఖ అధికారుల తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
పిఠాపురం సంస్థానం సత్రం భూముల కౌలు కేటాయింపు వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బహిరంగ వేలం నిర్వహించి సంస్థానానికి అధిక ఆదాయం వచ్చేలా చేయాల్సిన దేవదాయశాఖ అధికారులు కాసుల కక్కుర్తికి తలొగ్గేశారు. తుని కీలక నేత అనుచరులకు 500ఎకరాలపై వాలిపోవడంతో నిబంధనలన్నీ ఉల్లంఘించి వారికే కౌలు కట్టబెట్టేశారు. వార్షిక కౌలు ఎకరాకు రూ.18వేల వరకు రాబట్టాల్సి ఉండగా, కేవలం నామమాత్రపు రేటుకు పచ్చజెండా ఊపేశారు. ఇందుకుగాను లబ్ధిదారులనుంచి తెరవెనుక లక్షల్లో అమ్యామ్యాలు నొక్కేశారు. భాగోతం బయటపడకుండా వేలం సవ్యంగానే జరిగిందని రికార్డులు సృష్టించేశారు. కంచే చేను మేసిన ఈ కథ వెనుక అసలేం జరిగిందంటే..
లోగుట్టు పెరుమాళ్లకెరుక...
పిఠాపురం సంస్థానం సత్రానికి జిల్లాలో పలుచోట్ల ఆస్తులున్నాయి. అందులోభాగంగా తొండంగి మండలంలో సంస్థానానికి 500 ఎకరాలున్నాయి. ప్రతి మూడేళ్లకు వీటిని బహిరంగ వేలం విధానం ద్వారా కౌలుకు కేటాయిస్తారు. పంపా రిజర్వాయరుకు సమీపంలో ఉన్న ఈ భూముల్లో కొన్ని ఏటా రెండు పంటలు పండితే.. కొన్ని భూముల్లో ఒక పంట పండుతుంది. వీటిని కౌలు కింద తీసుకుని సాగుచేయడానికి అనేకమంది పోట పడుతుంటారు. అటు మూడేళ్లకోసారి కౌలు ధరను కూడా పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అందులోభాగంగా గడచిన మూడురోజులుగా ఈ 500 ఎకరాలకు దేవదాయశాఖ అధికారులు కౌలు కేటాయింపు వేలం నిర్వహించారు. అప్పటికే ఈ భూములపై కన్నేసిన తుని వైసీపీ కీలక నేత అనుచరులు ఎలాగైనా తామే వీటిని దక్కించుకోవాలని పన్నాగం పన్నారు. వీటిని సాగుపేరుతో అధీనంలోకి తెచ్చుకుంటే ఆ తర్వాత గుప్పిట పట్టుకోవచ్చనేది వారి వ్యూహం. దీంతో కీలకనేత రంగంలోకి దిగి దేవదాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. తక్కువ ధరకే కౌలు ఖరారు చేసి వాటిని తమవారికే కేటాయించేలా చూడాలంటూ హుకుం జారీ చేశారు. ఇందుకు కావాల్సిన అమ్యామ్యాలు ఇవ్వడానికి ఓకే చేశారు. దీంతో కాకినాడ దేవదాయశాఖ అధికారులు చక్రం తిప్పారు. భూములు కౌలుకు కేటాయింపునకు సంబంధించి వేలం నిర్వహిస్తున్నట్లు కొన్నిరోజుల ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలి. తద్వారా పోటీ పెరిగి సంస్థాన సత్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ అధికారులు విషయం బయటక రానివ్వలేదు. కీలకనేత మనుషులు మాత్రమే వేలంలో పాల్గొనేలా వ్యూహం పన్నారు. అందులోభాగంగా రహస్యంగా మూడురోజులుగా తొండంగిలో వేలంతంతు పూర్తి చేశారు. ప్రస్తుత ధరల ప్రకారం ఎకరా కౌలు ఏడాదికి రూ.18వేల వరకు వచ్చేలా చేయాలి. పోటీ పెరిగితే ఇదింకా పెరుగుతుంది. కానీ కీలక నేత మనుషులకు కేవలం ఎకరాకు కొన్ని భూములకు రూ.6వేలు, కొన్నింటికి రూ.8వేలు మాత్రమే వార్షిక కౌలు ధర ఖరారు చేశారు. అంటే అత్యంత నామమాత్రపు ధర. ఇలా కారుచౌకగా భూములు కట్టబెట్టినందుకు ఒక్కో లబ్ధిదారుడినుంచి భారీగా డబ్బులు పిండేశారు. ఇలా ఇద్దరు అధికారులు లక్షలు జేబులో వేసుకున్నారు. వాస్తవానికి ఈ కౌలు భూములకు వేలం వేసేటప్పుడు సంస్థాన సత్రం ఈవో, దేవదాయశాఖనుంచి ఇన్స్‌పెక్టర్‌ లేదా ఆ స్థానంలో నియమితులయ్యే మరో అధికారి హాజరుకావాలి. తొలిరోజు వేలంలో సత్రం ఈవోతోపాటు దేవదాయశాఖ తరఫున పాదగయ ఈవో సౌజన్య హాజరయ్యారు. తీరా తొలిరోజు వేలంలోనే అనేక అక్రమాలు గుర్తించిన ఆమె రెండోరోజు హాజరుకాలేదు. దీంతో సామర్లకోట దేవస్థానం ఈవో నారాయణమూర్తిని నియమించారు. ఆ తర్వాత వైసీపీ కీలక నేత చెప్పినట్లు వేలం మొత్తం పూర్తి చేసేశారు. వాస్తవానికి గడచిన కొన్నేళ్లుగా ఏటా పిఠాపురం సంస్థాన సత్రానికి ఈ భూముల వేలం ద్వారా రూ.30లక్షల వరకు ఆదాయం వస్తోంది. అయిదేళ్ల తర్వాత జరిగిన ఈ వేలం ద్వారా రూ.50 లక్షలకుపైగా కౌలు ఆదాయం రావాల్సి ఉంది. కానీ వైసీపీ కీలకనేత, దేవదాయశాఖ అధికారుల కుమ్మక్కుతో సత్రం ఆదాయానికి భారీగా గండిపడింది.
అటు సంతకానికి నో... ఇటు ఎమ్మెల్యే ఫైర్‌
మూడురోజులపాటు నిర్వహించిన ఈ వేలానికి సంబంధించి ప్రక్రియంతా పారదర్శకంగా జరిగిందని దేవదాయశాఖ అధికారులు ఫైలు సిద్ధం చేశారు. దీనిపై పాదగయ ఈవో కూడా సంతకం చేయాల్సి ఉండడంతో ఫైలు ఆమె వద్దకు పంపారు. అంతా అడ్డగోలు విధానంలో జరిగిన వేలం ఫైలుపై సంతకం చేస్తే ఇరుక్కుపోతామనే భయంతో ఆమె ఫైలుపై సంతకం చేయకుండా వెనక్కు తిప్పి పంపారు. దీంతో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తయితే తనకు తెలియకుండా సత్రం భూముల వేలం దొంగచాటుగా దేవదాయశాఖ అధికారులు ఎలా వేస్తారని, అందులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆదాయం పెరగకుండా అధికారులు లాలూచీ పడడంపై పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గుర్రుగా ఉన్నారు. ఈ భూములపై వచ్చే ఆదాయంతో విద్యార్థులకు భోజనాలు పెడుతున్నామని, దీనికి గండికొట్టేలా వ్యవహరించడంపై ఆగ్రహంగా ఉన్నారు. అటు తుని కీలకనేత మనుషులు ఈ భూములపై వాలిపోవడంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వేలం తీరు, అధికారుల బరితెగింపుపై ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.


Updated Date - 2021-06-25T06:52:47+05:30 IST