కరోనా టీకాలకు మేధోహక్కుల మినహాయింపుపై చర్చకు సిద్ధం: ఈయూ

ABN , First Publish Date - 2021-05-08T09:33:23+05:30 IST

కరోనా టీకాలకు పేటెంట్‌ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునివ్వాలన్న ప్రతిపాదనకు అమెరికా మద్దతు తెలపడంతో.. యూరోపియన్‌ యూనియన్‌, న్యూజిలాండ్‌ కూడా దీనిపై

కరోనా టీకాలకు మేధోహక్కుల మినహాయింపుపై చర్చకు సిద్ధం: ఈయూ

భారత్‌ ప్రతిపాదనపై సానుకూల స్పందన


న్యూఢిల్లీ, మే 7: కరోనా టీకాలకు పేటెంట్‌ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునివ్వాలన్న ప్రతిపాదనకు అమెరికా మద్దతు తెలపడంతో.. యూరోపియన్‌ యూనియన్‌, న్యూజిలాండ్‌ కూడా దీనిపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. ఈ టీకాలను ‘ట్రేడ్‌ రిలేటెడ్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌(ట్రిప్స్‌) నుంచి తొలగించాలని భారతదేశం, దక్షిణాఫ్రికా అక్టోబరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ రెండు దేశాల వాదనకు దాదాపు 100 దేశాలు మద్దతిస్తున్నా యి. మేధోహక్కులు తొలగిస్తేనే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్‌ అందుతుందన్నది ఈ రెండు దేశాల వాద న. ఈ విషయంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్‌ సర్కారు సానుకూలంగా స్పందించింది. దీంతో, యూరోపియన్‌ యూనియన్‌ కూడా ఈ అంశం పై చర్చకు సిద్ధమని ప్రకటించింది.


కాగా.. అమెరికా నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, అటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా  హర్షం వ్యక్తం చేశారు. కాగా.. మేధోహక్కుల తొలగింపు ద్వారా ప్రపంచ జనాభాలో అత్యధికులకు టీకాలు ఇవ్వకుంటే.. ఇప్పటికే పెద్ద ఎత్తున తమ ప్రజలకు టీకాలు ఇచ్చిన అమెరికా, యూరప్‌ దేశాలు కూడా ప్ర మాదంలోనే ఉంటాయి. అందుకే ఆయా దేశాల ధోరణిలో మార్పు వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా అన్ని దేశాలూ కలిసిరావడం ద్వారా.. ఏకాభిప్రాయ విధానంలోనే ఈ తొలగింపునకు డబ్ల్యూటీవోలో సత్వర అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్టు భారతదేశం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌, దక్షిణాఫ్రికా చేస్తున్న ఈ ప్రతిపాదనలకు ప్రస్తుతం అభ్యంతరం చెబుతున్న దేశాలు.. స్విట్జర్లాండ్‌, యూకే, జపాన్‌, కెనడా, బ్రెజిల్‌. కాగా.. కరోనా టీకాలపై మేధోహక్కులను డబ్ల్యూటీవో తొలగించినా అది తుది ఉత్పత్తికే వర్తిస్తుందని, టీకాల తయారీలో పలు ముడిపదార్థాలకూ పేటెంట్‌ ఉంటుందని, ఆ సమస్యనూ అధిగమించాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అలాగే, మినహాయింపులు ఎంత కాలం ఇస్తా రు? ఏ స్థాయిలో ఇస్తారు? అనే అంశాలపై బేరసారాలు జాగ్రత్తగా చేయాల్సి ఉందని ‘సెంటర్‌ ఫర్‌ డబ్ల్యూటీవో స్టడీస్‌’ విభాగాధిపతి అయిన అభిజిత్‌ దాస్‌ అభిప్రాయపడ్డారు.  


పేటెంట్లు తొలగించినా..

కరోనా టీకాలను మేధోహక్కుల పరిధి నుంచి తాత్కాలికంగా తొలగించినా.. 100 కోట్లపైగా ఉన్న భారత జనాభాకు టీకాలు అందడానికి కొన్ని నెలలు పడుతుందని కొందరు వె ౖద్యనిపుణులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మేధోహక్కులు తొలగి ఫార్ములా మన కంపెనీల చేతికి వచ్చినా.. ముడిపదార్థాల కొరత సమస్యగా మారుతుంది. అన్ని కోట్ల డోసులను తయారుచేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్‌ తదితర దేశాలు ఫైజర్‌, మోడెర్నా వంటి కంపెనీలు తయారుచేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై ఉన్న మేధోహక్కులను తొలగించాలని. అత్యంత అధునాతన విధానంలో తయారైన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను మన దేశంలో తయారుచేయాలంటే అం దుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవడానికే చాలా సమయం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఏమిటీ పేటెంట్‌ వివాదం?

కరోనా టీకాలకు మేధోహక్కుల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్‌, దక్షిణాఫ్రికా సహా పలు పేద, అభివృద్ధి చెందిన దేశాలు అడుగుతున్నాయి! అభివృద్ధి చెందిన దేశాలు, ఫార్మా కంపెనీలేమో వద్దంటున్నాయి. ప్రపంచ జనాభాలో వీలైనంత ఎక్కువ మందికి టీకా వేయకపోతే తమకూ ముప్పుందని గ్రహించడంతో.. ధనిక దేశాలు ఇప్పుడిప్పుడే మెత్తబడుతున్నాయి. కానీ, ఫార్మాకంపెనీలు మాత్రం గట్టిగానే పట్టుపడుతున్నాయి. కంపెనీలు ఎందుకింత పట్టుబడుతున్నాయి? అంటే.. ఫార్మా కంపెనీలు ఏదైనా ఔషధాన్నిగానీ, టీకాను గానీ తయారుచేయడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. భారీగా డబ్బు ఖర్చు అవుతుంది.


పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుని, లాభాలను సంపాదించుకోవడానికి, వేరే కంపెనీలు సునాయాసంగా ఆ ఫార్ములాతో మందుల్ని, టీకాలను తయారుచేయకుండా ఉండడానికి.. ఫార్మా కంపెనీలు పేటెంట్‌ హక్కులు పొందుతాయి. అమెరికాలో ఔషధాలపై, వ్యాక్సిన్లపై ఈ మేధోహక్కులు 20 ఏళ్లపాటు ఉంటాయి. వాటిపై ఎంత సంపాదించుకున్నా ఆ సమయంలోనే. ఇప్పుడా అవకాశం లేకుండా చేస్తే లాభాలు తగ్గిపోతాయి. అందుకే కంపెనీలు దీన్ని ఒప్పుకోవట్లేదు. 

Updated Date - 2021-05-08T09:33:23+05:30 IST