పత్తికొండలో ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-24T18:12:56+05:30 IST

ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని..

పత్తికొండలో ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం

పత్తికొండలో దుండగుల దుశ్చర్య

బీజేపీ, జనసేన, వీహెచ్‌పీ ఆందోళన

ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం ఆగ్రహం

పట్టణంలో ఉద్రిక్తత.. భారీ బందోబస్తు

ఆధారాలు సేకరించిన క్లూస్‌ టీం


పత్తికొండ(కర్నూలు): ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి పత్తికొండ శివారులోని రాతన రహదారిలో చోటు చేసుకుంది. పత్తికొండ - గుత్తి ప్రధాన రహదారిలో నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. పత్తికొండ మార్కెట్‌యార్డుకు అర కిలో మీటరు దూరంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో దాతల సాయంతో రెండేళ్ల క్రితం కొందరు ఆంజనేయస్వామి విగ్రహాన్ని రహదారి పక్కన ప్రతిష్ఠించారు.


అప్పటి నుంచి ప్రమాదాలు తగ్గాయని పట్టణ ప్రజలతో పాటు ఈ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని పెకిలించడమే కాక ధ్వంసం చేయడం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. పొలాలకు వెళ్లుతున్న రైతులు బుధవారం ఉదయం విగ్రహం ధ్వంసం అయిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆదినారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేసి నిందితులను గుర్తిస్తామని సీఐ తెలిపారు. 


క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

విగ్రహం ధ్వంసమైన ప్రాంతంలో కర్నూలు నుంచి వచ్చిన క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. విగ్రహం ఉన్న ప్రాంతంలో ఉన్న రక్తపు మరకలను, వేలిముద్రలను క్లూస్‌ టీం సేకరించింది. డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా దుండగుల ఆచూకీని గుర్తించే ప్రయత్నం చేశారు. కోళ్లఫారం వరకు వెళ్లిన జాగిలాలు తిరిగి సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి.  


టీడీపీ ఆగ్రహం

విగ్రహం ధ్వంసంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణతో పాటు దేవుడి విగ్రహాలకు రక్షణ కరువైందని టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. ఈ ఘటనలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, అశోక్‌, రవి, తిరుపాలు అన్నారు. 


ఉన్నతస్థాయి విచారణ జరగాలి: బీజేపీ

విగ్రహం ధ్వంసం తెలుసుకున్న బీజేపీ నాయకులు రంగాగౌడ్‌, పూనా మల్లికార్జునతో పాటు నాయకులు, కార్యకర్తలు సంఘటన ప్రాంతం వద్ద ఆందోళనకు దిగారు. గుత్తి - పత్తికొండ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అంతర్వేది, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సంఘటనలతో పాటు పత్తికొండ ఆంజనేయస్వామి విగ్రహం సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐలు నారాయణరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎస్‌ఐలు అక్కడికి చేరుకున్నారు. నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తరువాత నాయకులను వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఆందోళనలో నాయకులు భాస్కర్‌, నాగేష్‌, బ్రహ్మయ్య పాల్గొన్నారు.  


నేడు చలో పత్తికొండ పిలుపు

ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ. జనసేన నాయకులు గురువారం చలో పత్తికొండ పిలుపునిచ్చారు. దీంతో పత్తికొండకు అదనపు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఆందోళ నలకు అనుమతులు లేవని, ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్ప డితే అరెస్టులు తప్పవని డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి హెచ్చరించారు. 


Updated Date - 2020-09-24T18:12:56+05:30 IST