‘డీ అడిక్షన్‌’కు తగ్గిన రోగులు

ABN , First Publish Date - 2021-06-14T18:50:37+05:30 IST

డీ అడిక్షన్‌ సెంటర్లకు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

‘డీ అడిక్షన్‌’కు తగ్గిన రోగులు

  • ఓపీ, ఐపీ సంఖ్య కూడా అంతంత మాత్రమే రాక
  • ప్రైవేట్‌ కేంద్రాల్లో ఐపీలో ఇద్దరు ముగ్గురే..
  • మానసిక చికిత్సాలయంలో 15 మందికి, ఓపీలో 50 మందికి చికిత్స
  • టెలిఫోన్‌, ఆన్‌లైన్‌ ద్వారా వైద్యుల కౌన్సెలింగ్‌
  • మధ్యలో ఆగిపోతున్న చికిత్స, మందుల వినియోగం
  • విత్‌డ్రావల్‌ సింప్టమ్స్‌తో ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ : డీ అడిక్షన్‌ సెంటర్లకు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బాధితులు డీ అడిక్షన్‌ సెంటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. కొంత మంది వైద్యులు చికిత్సలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో బాధితులకు సరైన సమయంలో వైద్యం అందక అయోమయ పరిస్థితి నెలకొంది. మొదటి వేవ్‌, రెండో వేవ్‌లో డీ అడిక్షన్‌ సెంటర్లలో చికిత్స తీసుకునే వారి పరిస్థితి అయోమయంగా మారింది. డీ అడిక్షన్‌ కేంద్రాల్లో బాధితులతో కనీసం గంట వరకు కేటాయించాలి. వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. కొవిడ్‌ సమయంలో ఇలాంటి వారికి చికిత్స అందించడం కష్టమని భావించి చాలా డీ అడిక్షన్‌ సెంటర్లలో పరిమిత సంఖ్యలో చికిత్స అందిస్తున్నారు. ముందుగానే బాధితుల పరిస్థితి పూర్తి వివరాలను ఫోన్‌ ద్వారా తెలుసుకుని అవసరం అయితేనే రమ్మంటున్నారు. 


డీ అడిక్షన్‌ కేంద్రాలకు ఎక్కువగా ఆల్కాహాల్‌, ఇతర మాదకద్రవ్యాల అలవాటు నుంచి బయటపడాలని అనుకునే వారు వస్తుంటారు. స్మోకింగ్‌ చేసే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. దాదాపు 75 శాతం ఆల్కాహాల్‌ బాధితులు ఉండగా, 20 శాతం వరకు,  స్మోకింగ్‌ బాధితులు 5 శాతం వరకు ఉంటారని వైద్యులు వివరించారు. డీ అడిక్షన్‌ సెంటర్‌లో స్మోకింగ్‌ చేసుకునే వారికి కూడా చికిత్సలు, కౌన్సెలింగ్‌ ఇస్తారని చాలా మందికి తెలియకపోడం వల్ల పెద్దగా రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. 


తగ్గిన అడ్మిషన్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న డీ అడిక్షన్‌ సెంటర్లు ఆరు వరకు ఉన్నాయి. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ప్రత్యేక డీ అడిక్షన్‌ సెంటర్‌ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. ఇవీ కాకుండా దాదాపు వంద వరకు అనధికారిక డీ అడిక్షన్‌ సెంటర్లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో దాదాపు 40 నుంచి 50 పడకల వరకు ఉంటాయి. కొవిడ్‌ కంటే ముందు దాదాపు అన్ని కేంద్రాలలో కలిపి 400 నుంచి 500 మంది వరకు చికిత్సలు పొందేవారు. గత ఏడాది నుంచి ఈ డీ అడిక్షన్‌ సెంటర్లకు వచ్చే బాధితుల సంఖ్య చాలా తగ్గిపోయింది. కరోనాకు ముందు ఈ సెంటర్లకు ప్రతి రోజూ 50 నుంచి 60 మంది ఓపీ కౌంటర్లకు వచ్చి చికిత్సలు పొందేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 10 నుంచి 15 వరకు ఉంటుందని సైకియాట్రిస్టు వైద్యులు చెబుతున్నారు. ఇక ఇన్‌పేషెంట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రతి సెంటర్‌లో 40 మంది వరకు బాధితులు చికిత్స పొందితే ఇప్పుడు కేవలం ముగ్గురు, నలుగురు ఉంటే అదే ఎక్కువ సంఖ్యగా మారింది. ఫిల్టర్‌ చేసి తీసుకుంటున్నారు.


కొవిడ్‌ పరీక్ష చేస్తేనే...

ఇప్పుడు అడ్మిషన్లు చాలా తక్కువ. కొవిడ్‌ పాజిటివ్‌ టెస్టు చేసిన తర్వాతనే అడ్మిట్‌ చేసుకుంటున్నాం. అయితే చాలా మంది పరీక్ష చేయించుకోవడానికి ఇష్ట పడడం లేదు. కొందరు మాత్రమే వస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వచ్చి ఓపీలో చూపించుకుని వెళ్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో రావడానికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. బాధితులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, బలహీనంగా ఉండడం వల్ల వారికి ప్రయాణం చేసే సమయంలో ఎవరి ద్వారా అయినా వైరస్‌ సోకుతుందోమోననే భయం ఉంటుంది. దీంతో వారు రావడానికి ధైర్యం చేయడం లేదు. సొంతంగా వాహనాలు ఉన్న వారు మాత్రమే రావడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో ‘మా కేంద్రానికి ప్రతి రోజూ 50 నుంచి 60 మంది ఓపీ చికిత్సలు తీసుకుంటే ఇప్పుడు 10 నుంచి 15 వరకు మాత్రమే ఉంటోం ది. గతంలో 40 నుంచి 50 మంది అడ్మిషన్లు ఉండగా, ఇప్పుడు ఇద్దరే బాధితులున్నారు. అవసరమైన వారికి మాత్రమే అడ్మిషన్‌ ఇస్తున్నాం’అని సైకాలజిస్టు డాక్టర్‌ నరేష్‌ వివరించారు. 


ఎక్కువ సేపు వారి వద్ద గడపాల్సి రావడంతో....

మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు తీసుకునే వారు కొవిడ్‌ నిబంధనలు పాటించేది తక్కువ. మత్తులో వారు ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలగడం వల్ల కొవిడ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీరికి చికిత్సలు అందించడానికి వైద్యులు భయపడుతున్నారు. వీరికి కౌన్సెలింగ్‌ చేయాలంటే ఒక్కో సెక్షన్‌లో కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట వరకు సమయం పడుతుంది. వీరికి దగ్గరగా వెళ్లి నచ్చజెప్పాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించడానికి వారి భుజాలను తట్టుతూ కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది. మిగితా రోగులను చూసినట్లు డ్రగ్‌ అడిక్ట్‌ బాధితులను చూడలేమని డాక్టర్‌ నరేష్‌ వడ్లమాని చెప్పారు. ఇలా ఎక్కువ సేపు గడపడం వల్ల ఎవరి నుంచి అయినా వైరస్‌ విస్తరించే ముప్పు ఉంది. దీంతో డ్రగ్‌ అడిక్ట్‌ బాధితులను పరీక్షించడం, కౌన్సెలింగ్‌ చేయడం వంటి వాటికి కొంత మంది సైకియాట్రిస్టులు దూరంగా ఉంటున్నారు. 


టెలిఫోన్‌, ఆన్‌లైన్‌ ద్వారానే...

చాలా మంది సైకియాట్రిస్టులు డ్రగ్‌ అడిక్ట్‌తో టెలిఫోన్‌, ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా బాధితులకు ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి. ఇది అంతగా బాధితులకు ఉపయోగపడడం లేదు. టెలిఫోన్‌, ఆన్‌లైన్‌ ద్వారా ప్రతి రోజూ 15 నుంచి 20 మందికి కౌన్సెలింగ్‌, సలహాలు ఇస్తున్నట్లు డాక్టర్‌ నరేష్‌ చెప్పారు. అయితే ఇది అంత సులువు కాదని, తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 


ఫాలో అప్‌ లేకపోతే...

మద్యం, మాదక ద్రవ్యాలు మానివేసి మందులు వినియోగిస్తున్న వారికి తప్పని సరిగా ఫాలో అప్‌ చికిత్స ఉండాలి. మద్యం, మాదకద్రవ్యాలు వాడిన తర్వాత అయిదారు రోజుల వరకు ఇబ్బందులు పడుతుంటారు. మద్యం మానివేసిన వెంటనే వారికి దాని మీద ఆసక్తి పెరుగుతుంది. తాగాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని నియంత్రించే సమయంలో బాధితులకు పలు మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు వివరించారు. వాటిని ఓర్చుకునేందుకు వైద్యులు వారికి అవగాహన కల్పించి మానసిక ధైర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది. 


మధ్యలో ఔషధాలు మానేస్తే....

డ్రగ్‌ అడిక్ట్‌ బాధితులు వినియోగించే మందులు అన్ని చోట్లా లభించవు. ఆ మందులు విక్రయించడానికి మెడికల్‌ షాపులు ముందుగా గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. డీ అడిక్షన్‌ సెంటర్లు, మానసిక చికిత్సాలయాలూ వాటి ఫార్మసీలలో మాత్రమే ఈ మందులు లభిస్తాయి. కొవిడ్‌ కారణంగా ఇతర జిల్లాల్లో ఉండే వారు హైదరాబాద్‌ వరకు రాలేక, మధ్యలో ఔషధాలు తీసుకోవడం మానేస్తున్నారు. అకస్మాత్తుగా ఈ మందులు మానేసిన కొందరిలో విత్‌డ్రావల్‌ సింప్టమ్స్‌ వస్తుంటాయి. ఆ దశలో కొందరు మద్యంలో నీళ్లు కలుపుకోకుండా, నేరుగా తాగుతారు. మరికొందరు కల్తీ మద్యాన్ని తీసుకుంటారు. మరికొందరు కల్లును బాగా తీసుకుంటారు. కల్లులో ఇతర రసాయనాలు కలిసి ఉండడం వల్ల తాగే వారిలో వింతవింత వికారాలు కన్పిస్తాయి. కొంత మంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరిలో సైకోసిస్‌ ఇబ్బందులు తలెత్తుంటాయి. ఇలాంటి వారికి ఆరు నుంచి ఏడాది కాలం పాటు చికిత్స అందించాల్సి ఉంటుంది. మధ్యలో తాగాలని అనిపిస్తుందని, అలాంటి సమయంలో కొవిడ్‌, లాక్‌డౌన్‌ సమయంలో వారికి చికిత్స, మందులు లభించకపోతే ఇబ్బందులు రెట్టింపు అవుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. - డాక్టర్‌ నరేష్‌ వడ్లమాని, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌, కొలంబస్‌ ఆస్పత్రి


అడ్మిషన్లు తగ్గాయి..

మానసిక చికిత్సాలయంలో ప్రత్యేకంగా డీ అడిక్షన్‌ సెంటర్‌ ద్వారా చికిత్సలు అందిస్తున్నాం. కొవిడ్‌ రాక ముందు ఈ కేంద్రంలో దాదాపు 50 మంది వరకు చికిత్సలు పొందే వారు. కొవిడ్‌ కారణంగా ఆస్పత్రిలో ఉండడానికి భయపడుతున్నారు. దీంతో ఎక్కువగా ఓపీలో చికిత్సలు తీసుకుని వెళ్లిపోతున్నారు. కొవిడ్‌ కారణంగా ప్రస్తుతం 15 మంది వరకు చికిత్సలు పొందుతున్నారు. అవుట్‌పేషెంట్ల విభాగంలో ప్రతి రోజూ 50 మందికి మించి బాధితులు వచ్చి చికిత్సలు పొందుతున్నారు. ఆల్కాహాల్‌, మాదకద్రవ్యాలు, హెరాయిన్‌, గంజాయి, గుట్కా వినియోగించే వారికి చికిత్సలు అందిస్తున్నాం. నేషనల్‌ డ్రగ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా బాధితులకు మందులు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా ఇండెంట్‌ పెట్టి మందులు తెప్పించి వారికి అందిస్తున్నాం. ఆస్పత్రిలో చేరిన వారికి పదిహేను రోజుల పాటు చికిత్సలు, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. 

- డాక్టర్‌ ఉమాశంకర్‌, సూపరింటెండెంట్‌, మానసిక చికిత్సాలయం

Updated Date - 2021-06-14T18:50:37+05:30 IST