బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్... బంధువులకు మృతదేహం అప్పగింత!

ABN , First Publish Date - 2021-04-12T12:24:54+05:30 IST

బీహార్‌లో మరోమారు వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది.

బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్... బంధువులకు మృతదేహం అప్పగింత!

పట్నా: బీహార్‌లో మరోమారు వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఈసారి బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా, అతని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని కూడా అప్పగించారు. మృతునికి అంత్యక్రియలు నిర్వహించేముందు అతని బంధువులు మృతుని ముఖాన్ని చూసినపుడు ఈ విషయం వెల్లడయ్యిది. వెంటనే వారు అందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే బాఢ్ ప్రాంతానికి చెందిన చుత్రూ కుమార్ అనే వ్యక్తికి కరోనా సోకడంతో అతనిని బంధువులు పీఎంసీహెచ్‌లో చేర్పించారు. తరువాత ఆసుపత్రి సిబ్బంది చుత్రూ కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, చుత్రూ మృతి చెందాడని, మృతదేహాన్ని బాంసీ ఘాట్‌కు తరలించినట్లు తెలిపారు. 


దీంతో వారంతా పరుగుపరుగున బాంసీ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేముందు చుత్రూ సోదరుడు ఆ డెడ్ బాడీ ముఖాన్ని చూసి, అది తన సోదరునిది కాదని గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు. వారు అక్కడికి వచ్చి ఆ మృతదేహం పూర్ణియాకు చెందిన రాజ్‌కుమార్‌దిగా గుర్తించారు. ఈ వ్యక్తి కూడా కరోనాతోనే మృతి చెందాడు. తరువాత చిత్రూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోగా, అక్కడ చిత్రూ ఆహారం తీసుకుంటూ వారికి కనిపించాడు. కాగా ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆసుపత్రి హెడ్ డాక్టర్ ఠాకూర్ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2021-04-12T12:24:54+05:30 IST