Abn logo
Jun 24 2020 @ 00:29AM

తర్కానికి అందని దేశభక్తి

ద్వైపాక్షిక స్నేహ సంబంధాలను పెంపొందించుకునే లక్ష్యంతో మహాబలిపురంలో భారత్, చైనా దేశాధినేతలు ఒప్పందాలు కుదుర్చుకుని సంవత్సరం కాకముందే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు కొట్టుకుని ప్రాణాలు అర్పించారు. బహుశా చైనా అధ్యక్షునికైనా, భారత ప్రధానమంత్రికైనా సమస్యలనుంచి దృష్టి మళ్లించడానికి యుద్ధ భాష తోడ్పడుతుందేమో? దేశభక్తిని మించిన ప్రభావశీల భావోద్వేగ అంశం మరేముంది?


దేశభక్తికి సంబంధించి చర్చకు వచ్చినప్పుడు తర్కానికి, హేతుబద్ధతకు పెద్దగా తావుండదు. ఒక్కోసారి జయాపజయాలు కూడా ముఖ్యం కాదు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దేశభక్తి గురించి మాట్లాడినప్పుడు ఇతరులు చేసే వాదనల్లో హేతుబద్ధత ఉన్నట్లు అనిపించినప్పటికీ పై చేయి బిజెపికే లభిస్తుందని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1999 మే 6న కార్గిల్‌లో పాకిస్థాన్ పారామిలటరీ దళాలు చొరబడి ద్రాస్, కక్సర్, ముష్కో, బటాలిక్ సెక్టార్లలో ప్రవేశించిన రెండు వారాల తర్వాత కానీ భారత్‌కు ఉప్పందలేదు. ఈ చొరబాటు జరిగినప్పుడు భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ విపి మాలిక్ పోలండ్‌లో ఉన్నారు. కార్గిల్‌లో జరిగింది పూర్తిగా గూఢచార వర్గాల వైఫల్యమని అనేక మంది సైనిక కమాండర్లు వ్యాఖ్యానించారు. 1998 నవంబర్‌లోనే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ముషారఫ్ అంతర్గత సమావేశంలో ఈ చొరబాటు గురించి చర్చించారు. అయితే ఈ విషయాన్ని మన గూఢచార సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఉపగ్రహ చిత్రాలు తీయడంలో కూడా మనం వెనుకబడి ఉన్నామని సుబ్రహ్మణ్యం కమిటీ నిగ్గు తేల్చింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడడంలో తల మునకలైన సైన్యం లద్దాఖ్, కార్గిల్‌ల రక్షణను మరిచిపోయిందని, పాకిస్థాన్, చైనాల నుంచి దీని వల్ల ముప్పు వచ్చే అవకాశాలున్నాయని కూడా కమిటీలో ఉన్న రక్షణ నిపుణులు హెచ్చరించారు. విచిత్రమేమంటే కార్గిల్ ఘటన జరగడానికి నాలుగు నెలల ముందే వాజపేయి లాహోర్‌కు చరిత్రాత్మక బస్సు యాత్ర జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న అయిదు దశాబ్దాల హింసాకాండకు స్వస్తి చెప్పాలని వాజపేయి, పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నిర్ణయించారు. కాని ఇరువురు ప్రధానులకూ మరో నాలుగు నెలల్లో తమ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందన్న విషయం ఏ మాత్రం తెలియదు.


నిజానికి కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాజపేయి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. కార్గిల్ యుద్ధంలో దాదాపు 500 మందికి పైగా భారత సైనికులు మరణించినప్పటికీ కోల్పోయిన ప్రాంతాలను భారత్ తిరిగి దక్కించుకోలిగింది. గూఢచార వర్గాల వైఫల్యం గురించి అంతటా చర్చ జరిగినప్పటికీ వాజపేయి ప్రభుత్వం తన వైఫల్యాలను విజయంగా మార్చుకోగలిగింది. 1999జూలైలో కార్గిల్ యుద్ధం ముగియగా సరిగ్గా మూడు నెలల తర్వాత జరిగిన సార్వత్రక ఎన్నికల్లో బిజెపి 182 సీట్లను సాధించుకోగలిగింది. స్వదేశీ, విదేశీ నినాదాల మధ్య బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడిపోయి 114 సీట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. భారత రాజకీయాల్లో కశ్మీర్‌కు ఉన్న పాత్ర ఏమిటో 1999 ఎన్నికలే నిరూపించాయి. 1999లోనే కాదు, 2019లో కూడా కశ్మీర్ బిజెపికి విజయం సాధించిపెట్టిందని అంగీకరించకతప్పదు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో 40 మంది సిఆర్‌ఎఫ్ జవాన్లు మరణించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో 12 రోజులకు ఫిబ్రవరి 26న బాలాకోట్ లో సర్జికల్ దాడులు జరిపించారు. మేలో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో బిజెపి గతంలో  కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించింది. మోదీ ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పదని ప్రతిపక్షాలన్నీ భావిస్తున్న తరుణంలో తిరుగులేని నేతగా అధికారంలోకి వచ్చారు.


ఈ దేశంలో అత్యధికులకు కశ్మీర్‌లో ఏమి జరుగుతున్నది అన్నదానితో పెద్దగా సంబంధం లేదు. కశ్మీర్‌కు వారు వెళ్లినా వెళ్లకపోయినా అది ఈ దేశంలో అంతర్భాగం అన్న విషయమై రెండో అభిప్రాయానికి తావు లేదని అనేకమంది భావిస్తారు. అందువల్ల ఈ కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కావడం అనేది దేశభక్తికి సంబంధించిన అంశంగా వారి మనోభావాల్లో ఇంకిపోయింది. రెండవసారి అధికారంలోకి రావడంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. కశ్మీర్‌ను భారత దేశంలో అంతర్భాగం చేసేందుకు తాను తీసుకునే ఏ చర్యకైనా భారత ప్రజలు ఆమోద ముద్ర వేస్తారన్న ఆత్మ విశ్వాసంతోనే ఆయన ఈ చర్య తీసుకున్నారు. దేశమంతటా లాక్‌డౌన్ విధించినా, కశ్మీర్‌లో లాక్‌డౌన్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గతంలో లాగా ఉగ్రవాదుల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. 370 అధికరణ రద్దు చేసిన తర్వాత పది నెలలకు ఇటీవలే మరోసారి పుల్వామాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్‌లో ఎప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంటుందో తెలియదు. ఎప్పుడు నెలకొన్నా సరే, కశ్మీర్ విషయంలో మిగతా ప్రాంతాల్లో భారత ప్రజల మనోభావాలు మారే అవకాశం లేదనేది మోదీ విశ్వాసం. మోదీ అక్కడితో ఆగలేదు. 2019 ఆగస్టు 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 370 అధికరణ రద్దు గురించి మాట్లాడుతూ తాను కశ్మీర్ గురించి మాట్లాడుతున్నానంటే ఆక్రమిత కశ్మీర్ గురించి, అందులో భాగమైన అక్సాయిచిన్ గురించి మాట్లాడుతున్నానని అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆక్రమిత కశ్మీర్‌తో సహా మొత్తం కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు తాము ప్రాణాలైనా ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇవాళ లద్దాఖ్‌లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి అమిత్ షా మాటలకు సంబంధం లేదని చెప్పలేము. కశ్మీర్ లో 370 అధికరణ రద్దు చేసిన నాటి నుంచీ ఆక్రమిత కశ్మీర్‌ను మళ్లీ స్వాధీనం చేసుకునే చర్యల్ని భారత్ ప్రారంభించిందని చెప్పడానికి గల్వాన్ లోయలో రహదారి వంతెనను వేగంగా నిర్మించడమే నిదర్శనమని రక్షణ నిపుణులు అంటున్నారు. గత అక్టోబర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. ఇది సరిహద్దుల్లో అత్యంత వ్యూహాత్మకమైన షెయాక్- డిబి రోడ్ కు అనుసంధానం చేస్తుంది. తద్వారా ఆక్రమిత కశ్మీర్‌లో ప్రవేశించడానికి అత్యంత సులభం అవుతుంది. అయితే అక్రమిత కశ్మీర్‌కూ, చైనాకూ అవినాభావ సంబంధం ఉన్నది. 1950లలో చైనా లద్దాఖ్‌లోని అక్సాయి చిన్‌ను ఆక్రమించింది. 1962 తర్వాత అక్సాయి చిన్‌కు దారిని కల్పిస్తూ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొంత భూమిని చైనాకు పాకిస్థాన్ ధారాదత్తం చేసింది. తద్వారా చైనా – పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌కు తెర లేచింది. గల్వాన్ లోయపై నిర్మిస్తున్న రోడ్డు వంతెన ద్వారా తన ప్రయోజనాలు దెబ్బతింటుందని చైనా భావిస్తున్నందువల్లే సంఘర్షణకు దిగింది. మే నెలలోనే చైనా దళాలు పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి చేరుకున్నాయని, గల్వాన్ నది పొడవునా 3-4 కిమీ లోపలికి చొచ్చుకు వచ్చాయని స్థానికులు చెప్పారు. దీని వల్ల ఎత్తైన పర్వత ప్రాంతాలనుంచి భారత సైనిక దళాల కదలికలను గమనించేందుకు చైనాకు అవకాశం లభించింది.


కాని జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన తర్వాత గల్వాన్ లోయలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. చైనా సైనికులు వెనక్కి వెళ్లారో లేదో కూడా సమాచారం లేదు. అఖిల పక్ష సమావేశంలో ప్రధాని స్వయంగా చైనా ఏ పోస్టూ ఆక్రమించలేదని ప్రకటించారు. మన సైనికులు చైనా సైనికులతో పోరాడుతూ పోరాడుతూ మరణించారన్నారు. ఎక్కడ పోరాడారు? ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న విషయం తెలియదు. అఖిల పక్ష సమావేశంలో ప్రధానమంత్రి ఏ వివరాలూ వెల్లడించలేదు. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య, విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలపై అధికారిక ప్రకటన చేస్తే కాని చైనా వెనక్కు తగ్గిందా లేదా అన్నది స్పష్టంగా తెలిసే అవకాశాలు లేవు.


కశ్మీర్‌తో ముడివడిన మోదీ ప్రభుత్వ దేశ భక్తి ఇప్పుడు చైనా సరిహద్దుల వరకు చేరుకుంది. మరో వైపు చైనా ఒత్తిడితో నేపాల్ భారత్‌తో సరిహద్దు వివాదాన్ని రేపుతోంది. నేపాల్‌లో టిబెట్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాలను చైనా స్వాధీనం చేసుకుంటూనే అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఒక దేశాధినేత ఎన్నిదేశాలు తిరిగి ఎంతగా సత్సంబంధాలు ఏర్పర్చుకున్నా సరే తన దేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ఆ దేశం పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోగలగాలి. భారత దేశంలో అంతర్గతంగా పరిస్థితులు ఇప్పుడేమీ అంత ప్రశాంతంగా లేవు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దెబ్బతినిపోగా, కరోనా మూలంగా వ్యాపార సంస్థలు మూతపడడం, ఉపాధి కల్పన దెబ్బతినడం తీవ్రతరమైంది. ప్రభుత్వం ప్రజలనుంచే డబ్బులు వసూలు చేయాలని భావిస్తోందని రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో చైనా లద్దాఖ్‌లో వీరంగం చేస్తోంది. ప్రజల మధ్య సంబంధాలు పెంచుకోవాలని మహాబలిపురంలో భారత –చైనా దేశాధినేతలు ఒప్పందాలు కుదుర్చుకుని సంవత్సరం కాకముందే ఇరు దేశాల సైనికులు మాత్రం కొట్టుకుని ప్రాణాలు అర్పించారు. బహుశా చైనా దేశాధినేతకైనా, భారత దేశాధి నేతకైనా సమస్యలనుంచి దృష్టి మళ్లించడానికి యుద్ధ భాష తోడ్పడుతుందేమో? దేశ భక్తి అత్యంత ప్రభావ శాలి అని ఒప్పుకోక తప్పదు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి