పాత లెక్కలు చెబితేనే కొత్తవి!

ABN , First Publish Date - 2022-01-24T08:41:22+05:30 IST

‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అడ్వాన్సుగా నిధులు కావాలని రాష్ట్రం లేఖ రాసింది.

పాత లెక్కలు చెబితేనే  కొత్తవి!

ఇచ్చిన నిధులు ప్రాజెక్టు డైరెక్టర్ల ఖాతాల్లో వేస్తేనే మళ్లీ సొమ్ములు

పలు ప్రాజెక్టుల అడ్వాన్స్‌ నిధులపై ఏపీ సర్కారుకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ

ప్రభుత్వానికి ఈ లేఖ చెంపపెట్టు కాదా!

ఆర్థిక అరాచకానికి ఇంతకన్నా సాక్ష్యమేంటి?

టీడీపీ నేత పట్టాభి ఫైర్‌.. లేఖ విడుదల


అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అడ్వాన్సుగా నిధులు కావాలని రాష్ట్రం లేఖ రాసింది. గతంలో ఇలాగే తీసుకున్న అడ్వాన్సు నిధులు ఏమయ్యాయని కేంద్రం ప్రశ్నించింది. ముందు ఆ నిధులను ఆయా ప్రాజెక్టుల డైరెక్టర్ల ఖాతాల్లో వేస్తేనే కొత్త అడ్వాన్సుల సంగతి ఆలోచిస్తామని బదులిచ్చింది. కేంద్రం రాసిన ఈ లేఖ రాష్ట్రానికి చెంప పెట్టు కాదా! రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం ఏస్థాయికి చేరిందో ఇంతకన్నా సాక్ష్యమేంటి’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖను విడుదల చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి డాక్టర్‌ ప్రసన్న ఈ నెల 17న రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు లేఖ రాశారు.


విదేశీ రుణ సహాయంతో రాష్ట్రంలో చేపట్టిన గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు, రోడ్లు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు, మండలాల అనుసంధాన రోడ్ల ప్రాజెక్టు పనులకు అడ్వాన్సు నిధులు విడుదల చేయాలని రావత్‌ రాసిన లేఖకు సమాధానంగా ప్రసన్న ఈ లేఖ రాశారు. గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం గతంలో అడ్వాన్సుగా తీసుకొన్న రూ.525 కోట్లు ఏమయ్యాయో ముందు లెక్కలు చూపించాలని ఈ లేఖలో కేంద్రం అడిగింది. ఈ పని చేస్తేనే తదుపరి అడ్వాన్సుల గురించి ఆలోచిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. తీసుకొచ్చిన నిధులను అడ్డగోలుగా పౌడర్లు, స్నోలకు ఖర్చు చేయడం వల్లే ఇప్పుడు కేంద్రంతో ఇలా లేఖ రాయించుకోవాల్సిన దౌర్భాగ్యం రాష్ట్రానికి పట్టింది’’ అని పట్టాభి విమర్శించారు. 


క్రమశిక్షణ ఏదీ?

రాష్ట్రానికి ఇకపై నిధులు ఇవ్వడానికి కేంద్రం పలు షరతులు పెట్టిందని పట్టా భి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే కేంద్రం కర్ర పట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘ఇక ముందు ఈ ప్రాజెక్టులకు ఏ నిధులు ఇచ్చినా సరిగ్గా వారం రోజుల్లో ఆ ప్రాజెక్టు డైరెక్టర్ల ఖాతాల్లో నిధులు జమ కావాలని, ప్రతి నెలా పనుల పురోగతి.. పనులు చేసిన వారికి చేసిన చెల్లింపులపై నెలవారీ నివేదికలు ఇవ్వాలని కేం ద్రం ఆదేశించింది. అవి సవ్యంగా ఉంటేనే ఆ తర్వాత నిధులు వస్తాయని, లేకపోతే రావని స్పష్టంగా తేల్చిచెప్పింది. తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు. దేనికి ఖర్చు చేస్తున్నారో చెప్పరు’’ అని పట్టాభి విమర్శించారు.  

Updated Date - 2022-01-24T08:41:22+05:30 IST