జగన్ ఆర్థిక అవకతవకల పరంపర వేగంగా ముందుకెళ్తోంది: పట్టాభి

ABN , First Publish Date - 2021-12-01T19:48:38+05:30 IST

జగన్ ఆర్థిక అవకతవకల పరంపర నానాటికీ వేగంగా ముందుకెళ్తోందని పట్టాభిరామ్ విమర్శించారు.

జగన్ ఆర్థిక అవకతవకల పరంపర వేగంగా ముందుకెళ్తోంది: పట్టాభి

విజయవాడ: సీఎం జగన్ ఆర్థిక అవకతవకల పరంపర నానాటికీ వేగంగా ముందుకెళ్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ షెల్, సూట్ కేస్ కంపెనీలు పెట్టి మనీలాండరింగ్‌తో అర్జించిన నైపుణ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సూట్ కేస్, షెల్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గవర్నర్‌తో పాటు మరికొంతమంది ఐఏఏస్‌లను షేర్ హోల్డర్లుగా పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఆద్వర్యంలోని అన్నిశాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సోసైటీల సొమ్ముని  ఏపీ స్టేట్ పైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్‌లో డిపాజిట్ చేయాలని జీవో 1998 ఇచ్చారన్నారు. దాన్ని సమర్ధించుకోవటం కోసం  పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ సొమ్ము రూ. 9.60 కోట్లు, ఏపీ ఆయిల్ కోఆపరేటివ్ ఫెడరేషన్  డబ్బు రూ. 5 కోట్లు  దోపిడీకి గురయ్యాయయని, బ్యాంకుల్లో ఉన్నడబ్బుకి  భద్రతలేదంటూ జీవో 1998 విడుదల చేశారని విమర్శించారు.


పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవటం సురక్షితం కాదని చెబుతూ ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని పట్టాభి ప్రశ్నించారు. దేశంలో ఇలాంటి జీవో ఎవరు ఇచ్చి ఉండరన్నారు. బ్యాంకుల్లో డబ్బు సురక్షితం కాదని అంటున్న జగన్ రెడ్డి.. వాటి నుంచి అప్పులు ఎలా తీసుకుంటున్నారని నిలదీశారు. అప్పులు ఇవ్వడానికి జగన్ రెడ్డికి బ్యాంకులు కావాలి..  డబ్బు దాచుకోవడానికి బ్యాంకులు పనికిరావా? అని అన్నారు. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేశారని, డ్వాక్రా, పంచాయితీలు, విశ్వవిద్యాయాల నిధులు అన్నికాజేశారని ఆరోపించారు. ప్రజల డబ్బు కొల్లగొట్టేందుకు ఇప్పుడు ఏపీ స్టేట్ పైనాన్షియల్  సర్వీసెస్ కార్పోరేషన్ అనే సూట్ కేస్ కంపెనీతో మరో కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు. దీనిపై అనుమానాలున్నాయని రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు లేఖ రాసినా.. ఎందుకు సమాధానం ఇవ్వలేదని పట్టాభిరామ్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-01T19:48:38+05:30 IST