వరికి విరామం

ABN , First Publish Date - 2021-09-05T07:16:01+05:30 IST

అద్దంకి ప్రాంతంలో ఐదు దశాబ్దాలుగా సాగర్‌ ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. వివిధ కారణాలో ఏటికేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది.

వరికి విరామం
సాగర్‌ ఆయకట్టులో ఖాళీగా ఉన్న మాగాణి భూమి

స్వచ్ఛంద క్రాప్‌ హాలిడేకు రైతులు సిద్ధం

పెరిగిన సాగు వ్యయం 

గిట్టుబాటు కాని ధరలు

పెట్టుబడి ఖర్చులు కూడా రాని దయనీయం

ఆరుతడికే సాగునీరని ప్రకటించిన ప్రభుత్వం

మొక్కజొన్న వైపు అధికశాతం మంది మొగ్గు 

సాగర్‌ ఆయకట్టులో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈసారి మాగాణి సాగుకు విరామం ప్రకటించేందుకు పలు గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారు. డ్యాంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వరి సాగుకు ఎక్కువ మంది విముఖత చూపుతున్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో సాగర్‌ నీరు విడుదల కాక క్రాప్‌ హాలిడే ప్రకటించుకున్న అన్నదాతలు, ఈసారి అందుకు భిన్నంగా సాగర్‌ నీరు వస్తున్నా సాగుకు ససేమిరా అంటున్నారు. వరికి పెట్టుబడి ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, ధరలు లేకపోవడం ఇందుకు కారణమైంది. దీనికితోడు ఆరుతడికే సాగర్‌ నీరు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో కూడా అనేక మంది వెనక్కి తగ్గుతున్నారు. దీంతో 1.70లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఏబీసీ పరిధిలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం 15వేల ఎకరాలకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అదేసమయంలో మొక్కజొన్న సాగు వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతుండటంతో దాని విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది.

అద్దంకి, సెప్టెంబరు 4 : అద్దంకి ప్రాంతంలో ఐదు దశాబ్దాలుగా సాగర్‌ ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. వివిధ కారణాలో ఏటికేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది రైతులు పంట విరామానికి సిద్ధమవడంతో అది మరింత తగ్గే అవకాశం ఉంది.  అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ (ఏబీసీ)పరిధిలో మన జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రారంభంలో మాగాణి సాగు అధికంగా, మెట్ట సాగు తక్కువగా జరిగేది. క్రమేపీ చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో మాగాణి తగ్గించి మెట్ట పైర్లు సాగు చేస్తున్నారు. అదే సమయంలో గతంలో సుబాబుల్‌ సాగు లాభదాయకంగా ఉండటంతో చివరి ఆయకట్టులోని కొంత మంది రైతులు అటువైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం సుబాబుల్‌ కర్రకు ధరలు కూడా లేకపోవటంతో దాని విస్తీర్ణం భారీగా తగ్గింది. వరి సాగు వ్యయం గణనీయం గా పెరగటం, సుబాబుల్‌ కర్రకు ధరలు లేకపోవటంతో ప్రస్తుతం పలు గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న సాగుకు సిద్ధమవుతున్నారు.  సాగర్‌  నీరు విడుదలైతే వరి మినహా వేరే పంట సాగు చేసేందుకు అవకాశం లేని పలు గ్రామాల రైతులు మూకుమ్మడిగా మాట్లాడుకొని మాగాణి సాగుకు విరామం ప్రకటించుకుంటున్నారు. 


పెరిగిన డీజిల్‌, ఎరువులు, కూలి రేట్లు

వరి సాగు వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దీనికి డీజిల్‌ ధర తోడైంది. ఎరువులు, కూలీల రేట్లు కూడా పెరిగాయి. ఎకరాకు సరాసరిన పెట్టుబడి ఖర్చు రూ.30 వేలు అవుతుండగా, దిగుబడి 25 నుంచి  30 బస్తాలకు మించటం లేదు. దీంతో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ.30 వేలకు మించి రాబడి రావడం లేదు.  ఇక మొక్కజొన్న సాగుకు కూడా ఎకరాకు రూ.25 వేలు ఖర్చవుతున్నప్పటికీ 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.1850 కాగా, బహిరంగ మార్కెట్‌లో రూ.2000 వరకూ ఉంది.  పంట దిగుబడులు వచ్చిన సమయంలో బయట మార్కెట్‌లో ధర తగ్గినా క్వింటా రూ.1500 వరకూ ఉంటుందని, దీంతో సరాసరిన ఎకరాకు రూ. 60 వేలు వస్తుందని రైతులు చెప్తున్నారు. ఖర్చులు పోను ఎకరాకు రూ. 30 వేలు మిగులుతాయని వారు చెప్తున్నారు. 


ప్రత్యామ్నాయ పంటలకు వీలుకాని  పొలాల్లోనే వరి సాగు

గత ఏడాది ఏబీసీ పరిధిలో 38 వేల ఎకరాల్లో మాగాణి, 1.10 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు సాగయ్యాయి. మొక్కజొన్న సాగు విషయానికి వస్తే గత సంవత్సరం అద్దంకి ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాల లోపుగానే ఉంది. ఇక ఈ ఏడాది ఏబీసీ పరిధిలో మాగాణి సాగు గత ఏడాది కంటే సగం తగ్గే అవకాశం ఉందని అంచనా. సాగర్‌ నుంచి సాగు నీరు సెప్టెంబరు 1వ తేదీ నుంచి మార్చి వరకూ ఆరుతడి పంటలకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో వరి సాగు విస్తీర్ణం మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలకు వీలుకాని పొలాల్లో మాత్రమే మాగాణి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.  దీంతో వరి సాగు 15 వేల ఎకరాలకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. 


మొక్కజొన్న విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం 

వరి సాగుకు రైతులు దూరమవుతున్న నేపథ్యంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది అద్దంకి ప్రాంతంలో 40వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని అంచనా. అద్దంకి మండలం గోవాడలో గత ఏడాది వెయ్యి ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 300 ఎకరాలకు మించే పరిస్థితి కన్పించడం లేదు. సుమారు 700 ఎకరాల్లో మొక్క జొన్నసాగు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా బల్లికురవ, అద్దంకి, సంతమాగులూరు  మండలాల్లోని పలు గ్రామాల్లో గత ఏడాది మాగాణి సాగు చేసిన పొలాల్లో ఈ ఏడాది మొక్కజొన్న వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 



Updated Date - 2021-09-05T07:16:01+05:30 IST