విదేశీ టీకాలకు మార్గం సుగమం!

ABN , First Publish Date - 2021-06-03T09:01:00+05:30 IST

దేశ ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసే ఉద్దేశంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి సంస్థల టీకాలకు అత్యవసర అనుమతులను వేగవం తం చేసే పనిలో పడింది. ఆయా సంస్థలు ఎప్పట్నుంచో అడుగుతున్న నష్టపరిహార

విదేశీ టీకాలకు మార్గం సుగమం!

నష్టపరిహార మినహాయింపుపై కేంద్రం సుముఖం..

ఇవ్వడానికి సిద్ధమన్న ఆరోగ్యశాఖ వర్గాలు

విదేశీ టీకాలకు మార్గం సుగమం!

నష్టపరిహార మినహాయింపుపై కేంద్రం సుముఖం

అదే జరిగితే.. టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలపై

బ్రిడ్జి ట్రయల్స్‌ ఎత్తివేతకు షరతులతో డీసీజీఐ ఓకే

అన్నీ కుదిరితే జూలై నుంచి అక్టోబరు నడుమ

5 కోట్ల ఫైజర్‌ టీకా డోసులు అందుబాటులోకి

టీకాలకు పేటెంట్లు వద్దు: భారత్‌.. బ్రిక్స్‌ మద్దతు

2 ప్రభుత్వ రంగ సంస్థలకు కొవాగ్జిన్‌ టెక్నాలజీ

భారత్‌ బయోటెక్‌-ఐఐఎల్‌, బిబ్‌కాల్‌ ఒప్పందం

టీకాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం చర్యలు

ఆయా కంపెనీలను కోర్టుల్లో సవాల్‌ చేయలేం


న్యూఢిల్లీ, జూన్‌ 2: దేశ ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసే ఉద్దేశంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి సంస్థల టీకాలకు అత్యవసర అనుమతులను వేగవం తం చేసే పనిలో పడింది. ఆయా సంస్థలు ఎప్పట్నుంచో అడుగుతున్న నష్టపరిహార మినహాయింపు ఇవ్వడానికి సిద్ధమైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలు కూడా ఈ మినహాయింపులనిచ్చాయని, ఇక్కడ కూడా ఇవ్వడంలో సమస్య ఉండదని ఆ వర్గాలు వివరించాయి. ‘‘ఆ కంపెనీలు మనదేశంలో అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే నష్టపరిహార మినహాయింపునివ్వడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశాయి.


భారత ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైన మరో మినహాయింపు బ్రిడ్జి ట్రయల్స్‌. అంటే.. ఏదైనా ఔషధం/టీకాపై విదేశాల్లో, విదేశీయులపై నిర్వహించిన ట్రయల్స్‌ విజయవంతం కావచ్చు. అదే ఔషధం/టీకా మనదేశ ప్రజలకు అంతగా సరిపడకపోవచ్చు. లేదా ఇంకా బాగా పనిచేయొచ్చు. అది ఎలా పనిచేస్తోందో తెలియడానికి ఇక్కడి ప్రజలపై ఆ ఔషధం/టీకాతో నిర్వహించే ట్రయల్స్‌ను బ్రిడ్జి ట్రయల్స్‌ అంటారు. అలాంటి ట్రయల్స్‌ను స్పుత్నిక్‌-వి టీకా కోసం మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఆస్ట్రాజెనెకా టీకా కోసం సీరమ్‌ సంస్థ నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌తో అల్లాడిపోతూ మూడో వేవ్‌ ముప్పు ముంగిట ఉన్నందున భారతదేశం ఫైజర్‌, మోడెర్నా కంపెనీలకు షరతులు పెట్టే పరిస్థితుల్లో లేదు. అందుకే అమెరికా, యూకే, జపాన్‌ దేశాల్లో ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అత్యవసర వినియోగ అనుమతులు పొందిన, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) జాబితాలో ఉన్న టీకాలకు ఆ ట్రయల్స్‌ నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వీజీ సోమానీ తెలిపారు. అంతేకాదు.. ఆ టీకాలు ఆయా దేశాల నేషనల్‌ కట్రోల్‌ లేబొరేటరీల ధ్రువీకరణ పొందితే మనదేశానికి వచ్చాక ప్రతి బ్యాచ్‌లోనూ కొన్ని టీకాలను ఇక్కడి కసౌలీలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబొరేటరీలో పరీక్షించాలన్న నిబంధన నుంచి కూడా మినహాయించినట్టు వెల్లడించారు.


ఇన్ని మినహాయింపులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా, ఆయా టీకాలకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న డిమాండ్‌ దృష్ట్యా భారతీయులకు అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పట్టొచ్చని వైద్యనిపుణులు భావి స్తున్నారు. ఫైజర్‌ సంస్థ మనదేశానికి జూలై-అక్టోబరు నడుమ 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అన్నీ కుదిరి, అనుమతులొస్తే జూలైలో ఫైజర్‌ టీకా కోటి డోసులు మనదేశానికి చేరుకుంటాయి. ఆగస్టు, సెప్టెంబ రు, అక్టోబరు నెలల్లోనూ మరో కోటి డోసుల చొప్పున అందుబాటులోకి వస్తాయి. మోడెర్నా మాత్రం ప్రభుత్వం అన్ని అనుమతులిచ్చినా, ఈ ఏడాదిలో టీకాలు పంపే పరిస్థితిలో లేమని చెప్పేసింది. అంటే మోడెర్నా కంపెనీ టీకాలు వచ్చే ఏడాది దాకా అందుబాటులోకి రావు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మాత్రం ఈ ఏడాది చివరికల్లా దేశ ప్రజల్లో అర్హులైనవారందరికీ టీకాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. డిసెంబరు చివరికల్లా 250 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు ఆయన వివరించారు. స్పుత్నిక్‌ టీకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని.. మరిన్ని డోసుల కోసం ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకే ప్రైవేటు ఆస్పత్రులు కూడా దిగుమతులు చేసుకునేలా నిబంధనలు సడలించామని ఆయన గుర్తుచేశారు. ‘‘దేశ ప్రజలకు కరోనా టీకాలు వేయడంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. టీకా కార్యక్రమం మరో 7-8 నెలల పాటు కొనసాగుతుంది. ఆలోగా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా అందుతుంది’’ అని ఆయన భరోసా ఇచ్చారు. 


టీకాలకు పేటెంట్లు వద్దు: బ్రిక్స్‌

టీకాల మేధోహక్కుల ఎత్తివేత ప్రతిపాదనకు బ్రిక్స్‌ మద్దతిచ్చింది. రానున్న రెండు దశాబ్దాల్లో మరిన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, పెనుసవాళ్లు ఏర్పడే పరిస్థితి ఉందని.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ముప్పు అందరిదీ అయినప్పుడు బాధ్యత కూడా అందరిదీ అవుతుందని చెప్పారు. ప్రపంచం ముప్పు ముంగిట ఉన్న సమయంలో టీకాలకు మేధోహక్కులు ఉండకూడదన్న భారత్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల వాదనపై ఆయ న ఇలా స్పందించారు. డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘బలహీనులను, తమ గొంతు వినిపించలేనివారిని కాపాడడానికి.. ఈ కారుచీకటిలో కాంతిపుంజాలను చూడడానికి.. ఇది ఒక అవకాశం. కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రపంచమంతా ఒక్కటి అనే ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించడానికి తగిన సమయమిది’’ అన్నారు.


కాగా.. హర్షవర్ధన్‌ స్థానంలో కెన్యా ఆరోగ్య మంత్రి ప్యాట్రిక్‌ అమోత్‌ డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక.. కరోనా వ్యాక్సిన్లపై మేధోహక్కులను ఎత్తివేయాలన్న భారత్‌, దక్షిణాఫ్రికా తదితర 60కి పైగా దేశాల వాదనకు బ్రిక్స్‌ (బ్రెజిల్‌-రష్యా-ఇండియా-చైనా-సౌతాఫ్రికా దేశాల కూటమి) మద్దతు ప్రకటించింది. మేధోహక్కుల మినహాయింపునకు సంబంధించి 60కి పైగా దేశాలు కలిసి ప్రపంచ వాణిజ్య సంస్థకు చేసిన ప్రతిపాదన జూన్‌ 8-9 తేదీల్లో చర్చకు రానుంది.


ఏమిటీ నష్టపరిహార మినహాయింపు?

టీకా వల్ల ఏదైనా దుష్ప్రభావం సంభవిస్తే నష్టపరిహారం కోరుతూ ఆ టీకాను తయారుచేసిన కంపెనీపై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని చట్టాలు కల్పించాయి. ప్రభుత్వం ఆయా కంపెనీలకు నష్టపరిహార మినహాయింపునిస్తే.. ప్రజలకు ఆ టీకాల వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలిగితే ఆయా కంపెనీలపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఆ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. ప్రస్తుతం మనదేశంలో టీకాలు సరఫరా చేస్తున్న భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ సంస్థలకు ఈ మినహాయింపు లేదు. ఫైజర్‌, మోడెర్నా వంటి సంస్థలు మాత్రం.. ప్రస్తుత నిస్సహాయ పరిస్థితులను అదనుగా చేసుకుని.. ‘మాకు ఆ మినహాయింపునిస్తేనే మీ దేశానికి టీకాలు సరఫరా చేస్తాం. లేదంటే లేదు. నిర్ణయం మీదే’ అని తెగేసి చెబుతున్నాయి. దీనికితోడు.. గత ఏడాది డిసెంబరు 2న యూకే ప్రభుత్వం ఫైజర్‌, మోడెర్నా కంపెనీలకు నష్టపరిహార నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.


ఇలాంటి విషయాల్లో ఎంతో కఠినంగా వ్యవహరించే అమెరికా సైతం ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలకు ఆ మినహాయింపునిచ్చింది. వీలైనంత వేగంగా దేశ ప్రజలందరికీ టీకా వేయించాలనుకున్న అన్ని దేశాలూ ఆ కంపెనీలకు ఈ మినహాయింపును ఇచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికీ తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు ఫైజర్‌, మోడెర్నాకు గనకఆ మినహాయింపునిస్తే రేపు భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ సంస్థలు కూడా అడగవన్న హామీ లేదు. 

Updated Date - 2021-06-03T09:01:00+05:30 IST