పావ్‌భాజీ తినడం వల్ల బరువు పెరుగుతారా?

ABN , First Publish Date - 2021-07-09T18:12:18+05:30 IST

మనం తీసుకునే ఆహార పదార్థాలు, వాటిని తయారుచేసే విధానం వల్ల అవి ఆరోగ్యకరమైనవా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత ఆరోగ్యకరమైనవైనా, మోతాదు మించితే అదే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. ఇంట్లో పావ్‌భాజీ తయారు చేసినప్పుడు భాజీ లేదా

పావ్‌భాజీ తినడం వల్ల బరువు పెరుగుతారా?

ఆంధ్రజ్యోతి(09-07-2021)

ప్రశ్న: నెలకు రెండుసార్లు పావ్‌భాజీ తినడం వల్ల బరువు పెరుగుతారా?


- మృణాళిని, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మనం తీసుకునే ఆహార పదార్థాలు, వాటిని తయారుచేసే విధానం వల్ల అవి ఆరోగ్యకరమైనవా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత ఆరోగ్యకరమైనవైనా, మోతాదు మించితే అదే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. ఇంట్లో పావ్‌భాజీ తయారు చేసినప్పుడు భాజీ లేదా కూర తయారీలో తక్కువ నూనె వాడడం, ఎక్కువ ఆలుగడ్డల బదులుగా పిండి పదార్థాలు తక్కువగా ఉండే కాలీఫ్లవర్‌, కాప్సికం, క్యారట్‌, ఉల్లి, టమోటా మొదలైన కూరగాయలను అధిక మోతాదులో వాడడం వల్ల దీనిని ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. ఈ భాజీతో తినే రొట్టెముక్కలను కూడా ఎక్కువ వెన్న, నెయ్యి లేదా నూనెలతో కాలుస్తూ ఉంటారు. ఈ కొవ్వుపదార్థాల పరిమాణాన్ని తగ్గించి వాడడం ద్వారా ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. కేవలం ఒకటి లేదా చిన్నవైతే రెండు మాత్రమే రొట్టె/ బన్‌ ముక్కలతో పరిమిత మోతాదుల్లో భాజీ లేదా కూరను తీసుకున్నట్లయితే నెలలోనే కాదు, వారానికి రెండుసార్లు తీసుకున్నాపర్లేదు. అయితే ఒకవేళ సాయంత్రం స్నాక్స్‌గా దీనిని తినేట్టయితే ఆ రాత్రి భోజనం తగ్గించి కెలోరీలు నియంత్రణలో ఉంచవచ్చు. ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడే సాధ్యం. ఒకవేళ బయట తినేదైనా, బయటి నుంచి తెప్పించుకునేదైనా అయితే దానిని ఆరోగ్యకరంగా చేయడం మన చేతిలో లేదు కాబట్టి, నెలకొకసారి మించి తీసుకోకపోవడమే మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-09T18:12:18+05:30 IST