Abn logo
Sep 28 2021 @ 04:08AM

పవన్‌కు ఎప్పుడు ప్రశ్నించాలో తెలీదు: పోసాని

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను అకారణంగా తిట్టవద్దని జనసేన అధినేతపవన్‌కల్యాణ్‌కు రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి హితవు పలికారు. పవన్‌ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, ఆయనకు ఎప్పుడు ప్రశ్నించాలో తెలియదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘రిపబ్లిక్‌’ సినిమా వేడుకకు వచ్చి సాయితేజ్‌ గురించి మాట్లాడాలి కానీ ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పవన్‌ ప్రజల మనిషి కాదని ధ్వజమెత్తారు. జగన్‌కు కులపిచ్చి ఉందని పవన్‌ నిరూపించగలరా?అని ప్రశ్నించారు. ‘‘పవన్‌ పారితోషికం రూ.10 కోట్లా? 50కోట్లా? పది అయితే తనతో నాలుగు చిత్రాలు చేస్తా. ఆయన సినిమా టికెట్‌ రేట్లు రూ. 500, రూ.1000 అంటే ఏమిటి? సామాన్య ప్రజల్ని హింసించడమే కదా! తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న సమస్యలున్నాయి. ముందు వాటిని పరిష్కరించండి’’ అని పోసాని సూచించారు.