నేనున్నానని..!

ABN , First Publish Date - 2020-12-03T06:40:33+05:30 IST

జనసేనాని కదిలారు. బుధవారం జిల్లాలో పర్యటించారు.

నేనున్నానని..!

రైతులకు జనసేనాని భరోసా

అడుగడుగునా కన్నీటి కథలే

నిండా ముంచేసిన ‘నివర్‌’ 

 బాధలు చెప్పుకుని కంటతడి పెట్టిన కర్షకులు


ఇంటికి చేరాల్సిన పంటను ‘నివర్‌’ మింగేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరిని, కోతలు పూర్తయినా, పొలంలోనే ఉన్న పనలను, కుప్పలను.. తుఫాను పొట్టనపెట్టుకుంది. తూర్పు కృష్ణా ప్రాంతంలో ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో జనసేనాని కదిలారు. బుధవారం జిల్లాలో పర్యటించారు. కష్టాలు చెప్పుకుని కంటతడి పెట్టిన రైతులను ఓదార్చారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. భూ యజమానులకు సమానంగా కౌలు రైతులకు కూడా ఈ నెలాఖరులోగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

అవనిగడ్డ/ చల్లపల్లి/ మోపిదేవి/పామర్రు/ఘంటసాల :

   నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు జిల్లాలో బుధవారం పర్యటించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌... నేనున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటన సాగింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా పర్యటనకు బయలు దేరారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నియోజకవర్గాల ఇన్‌చార్జులు పవన్‌కు స్వాగతం పలికారు. ఉయ్యూరు నుంచి పంటలను పరిశీలించడం మొదలుపెట్టారు. పొలాల్లో ఉన్న రైతులతో మాట్లాడారు. ఎకరానికి ఎంత ఖర్చయింది? ఇప్పుడు తుఫాను కారణంగా ఎంత నష్టం జరిగింది? అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్‌ వారితో మాట్లాడుతున్నప్పుడు పలువురు రైతులు తమ సమస్యలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25-30వేలు ఇవ్వాలని పవన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో పర్యటించారు. పంట పొలాల్లోకి దిగి పంటలను పరిశీలించారు. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చులు అవుతున్నాయని రైతులు పవన్‌కు వివరించారు. తుఫాన్లు వచ్చినప్పుడల్లా సర్వం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పొలాల నుంచి నీరు బయటకు వెళ్లలేదని వాపోయారు. మోపిదేవి మండలంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమాయ్యారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు ఏ మాత్రమూ సరిపోవడం లేదని రైతులు వివరించారు. పామర్రు నియోజకవర్గంలో పెద్దపూడి అడ్డరోడ్డు వద్ద పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య పవన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను కలవడం కోసం కొంతసేపు రెడ్డయ్య వేచి ఉన్నారు. రైతులకు ఏ ప్రభుత్వంలోనూ న్యాయం జరగడం లేదని రెడ్డయ్య వ్యాఖ్యానించారు. వారికి అండగా నిలవాలని పవన్‌ను కోరారు. జిల్లాలో మొత్తం 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పవన్‌ చెప్పారు. భూ యజమానులకు సమానంగా కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని పవన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ పరిహారాన్ని నెలాఖరు నాటికి చెల్లించాలని డెడ్‌లైన్‌ విధించారు. జరిగిన పంట నష్టంపై నివేదికను కేంద్రానికి పంపుతానని పవన్‌ హామీ ఇచ్చారు. ఇటీవల చల్లపల్లిలలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుమారులను పవన్‌ ఓదార్చారు. రూ.లక్ష చెక్కు ఆర్థిక సాయంగా ఇచ్చారు. 

Updated Date - 2020-12-03T06:40:33+05:30 IST