Sep 2 2021 @ 19:44PM

నీతి – నిజాయతీ – సేవా – సింప్లిసిటీకి పర్యాయపదం!

ఆ పేరు వినిపిస్తే అభిమానులకు పూనకాలే! 

ఆయన స్టైల్‌ – మేనరిజం టాలీవుడ్‌కి ఓ ట్రెండ్‌ 

సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేని క్రేజ్‌ ఆయనది..

పదేళ్లు హిట్‌ లేకపోయినా క్రేజ్‌ తగ్గిందిలే..

ఆయన వ్యక్తిత్వంతో రెట్టింపు అభిమానుల్ని సంపాదించుకున్నారు..

నీతి – నిజాయతీ – సేవా – సింప్లిసిటీకి ఆయనొక పర్యాయపదం... 

ఆయనే పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌!!

గురువారం పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం...


మెగాస్టార్‌ చిరంజీవి బ్యాగ్రౌండ్‌తో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ స్వయంకృషితో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్‌కల్యాణ్‌. 1996లో విడుదలైన తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలుకొని ఖుషి వరకూ వరుస విజయాలతో దూసుకెళ్లి పవర్‌స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత పదేళ్లు హిట్లు లేకపోయినా అభిమానుల ప్రేమ రెట్టింపు అయిందే తప్ప తగ్గిందేలేదు. పవన్‌కల్యాణ్‌ సంపాదించిన అభిమానం వెనుక కేవలం సినిమాలే కాదు.. ఆయన మనస్తత్వం కూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన పంథా వేరని చాలా సందర్భాల్లో చిరంజీవి చెబుతుంటారు. దానికి తగ్గట్టే ఎవరికైనా కష్టం అంటే ముందుంటే వ్యక్తుల్లో పవన్‌ కల్యాణ్‌ ముందు వరుసలో ఉంటారు. 


ఆ స్టైలే వేరప్పా...

‘నువ్వు నందా అయితే, నేను బద్రి బద్రినాథ్‌ నాథ్‌’,  ‘నాకో తిక్కుంది, దానికో లెక్కుంది’, నేను సింహం లాంటోడిని.. అది గెడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటా.. మిగతాది అంతా సేమ్‌ టు సేమ్‌’లాంటి డైలాగ్స్‌లు, తనదైన శైలి ఫైట్లు, డాన్స్‌లతో అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చేశారు. నేటితరం యువతపై పవన్‌ ప్రభావం ఎక్కువనే చెప్పాలి. మామూలుగా హీరోలకు ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ పవన్‌ కల్యాణ్‌కు ఫ్యాన్స్‌ కాదు భక్తులుంటారు. సినిమాల్లో పవన్‌ ఓ స్టైల్‌, మేనరిజం వాడారంటే అభిమానులు కొద్దిరోజులపాటు ఆ ట్రెండ్‌నే పాటిస్తారు. 

అభిమానులే బలం.. 

'పాటొచ్చి పదేళ్లు అయింది.. అయినా క్రేజ్‌ తగ్గలా' అని గబ్బర్‌సింగ్‌లో అలీ చెప్పిన డైలాగ్‌ పవన్‌ కల్యాణ్‌కు వంద శాతం సరిపోతుంది. పదేళ్లు సక్సెస్‌లు లేకపోయినా అభిమానులు మాత్రం పవన్‌ వెంటే ఉన్నారు. సినిమా ఫెయిల్‌ అయిన ప్రతిసారి అభిమానుల గుండెల్లో ప్రేమ పెరిగింది కానీ... ఒక్క అభిమాని ప్రేమను మాత్రం పవన్‌ కోల్పోలేదు. అందుకే పవన్‌కు యువత అభిమానమే బలం. నీతి – నిజాయతీ – సేవా – సింప్లిసిటీకి ఆయనొక పర్యాయపదమని అభిమానులు గర్వంగా చెప్పుకొంటారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు ఇతర చిత్రాలకు తేడా ఉంటుంది. ఆయన చిత్రాల్లో మాట, పాటలు, పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు పవన్‌. ఆయనే ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

గన్‌ ఉండాల్సిందే...

పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలంటే ఆ సినిమాలో గన్‌లు ఉన్నాయంటే చాలు ఆయన వెంటనే ఒప్పుకుంటారు అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఏ సినిమా తీసుకున్నా బుల్లెట్ల మోత మోగాల్సిందే! గబ్బర్‌సింగ్‌లో గన్‌తో చేసిన హంగమా అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'భీమ్లా నాయక్‌'లోనూ ఇవే ఆసక్తికరంగా మారనున్నాయి. 


బాక్సాఫీస్‌ బద్దలే...

పవన్‌కల్యాణ్‌తో సినిమాలు చేయాలని నిర్మాతలు క్యూ కడుతుంటారు. తెరపై ఆయన కనిపిస్తే కాసుల వర్షమే! బాక్సాఫీస్‌ బద్దలే అని ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ‘పవన్‌ కల్యాణ్‌కి ప్రత్యేకంగా కథ అక్కర్లేదు. ఆయన తెర మీద కనిపిేస్త చాలని ఇటీవల ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ అన్న సంగతి తెలిసిందే! ఇదే మాట గతంలో చాలామంది దర్శకులూ చెప్పారు. పవన్‌కి ఉన్న క్రేజ్‌, ఆయనకున్న అభిమానగణం అలాంటిది. కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇందుకే రాశారేమో! ప్రకృతికి పెద్ద ప్రేమికుడు...

టాలీవుడ్‌ టాప్‌హీరోల్లో ఒకరై,  కోట్లలో అభిమానులు, ఆరాధించేవారు ఉన్న పవన్‌కల్యాణ్‌ మాత్రం సింప్లిసిటీకి మారుపేరుగా ఉంటారు. హీరోల్లోనే ఆయనకు పెద్ద ఫ్యాన్స్‌ ఉన్నారు. తీరిక దొరికితే.. ఫామ్‌ హౌస్‌లో పొలం పనులు చేయడం పుస్తకాలు చదవడం ఇదే ఆయన పని. స్నేహానికి కూడా ఆయన ఇచ్చే విలువ మాటల్లో చెప్పలేనిదని అలీ, ఆనంద్‌సాయి, త్రివిక్రమ్‌ తరచూ చెబుతుంటారు. స్థాయితో సంబంధం లేకుండా ఆయన వ్యక్తులతో మెలుగుతుంటారు. ప్రకృతికి పెద్ద ప్రేమికుడు పవన్‌కల్యాణ్‌. 


తన వంతు సేవ చేస్తూనే...

స్టార్‌ హీరోగా ఎదిగిన ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజాలకు ఏదో ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలని ఆయన తపిస్తుంటారు. పకృతి వైపరీత్యాలు ఎవురైనప్పుడు విరాళాలు ఇచ్చి ఆదుకునే వారిలో పవర్‌స్టార్‌ ముందుంటారు. చిత్ర పరిశ్రమలోనూ ఆన ఆదుకున్న కుటుంబాలు, ఆర్టిస్ట్‌లు ఎందరో ఉన్నారు. అంతేకాకుండా ప్రాంతాలతో సంబంధంలేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారాయన. వృధ్ధాశ్రమాలకు, అనాధ శరణాలయాలకు తన వంతుసేవ చేస్తూనే ఉంటారు.


చిరునవ్వే సమాధానం...

వృత్తిరీత్యా, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి విమర్శలు చేసిన వారిని కూడా పవన్‌ ఎవరినీ పల్లెత్తి మాట అనరు.  నవ్వుతూ తన పని తాను చేసుకుంటారు. మూడు పెళ్లిలు చేసుకున్నాడని, అలా చేసుకుంటూనే ఉంటాడని విమర్శించిన నాయకులకు సైతం ధీటైన సమాధానం ఇచ్చే స్థాయి ఉన్నా కాలమే సమాధానం చెబుతుందన్నట్లు చిరునవ్వు నవ్వుతారు. అయితే ఆయనకు జరిగిన మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు చట్టబద్దంగానే జరిగాయని సన్నిహితులు చెబుతుంటారు.