నిజమే పవన్‌! ఏమిటీ వెలితి?

ABN , First Publish Date - 2021-04-05T21:39:28+05:30 IST

జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా ప్రీ ఈవెంట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రముఖ పౌరహక్కుల నాయకుడైన న్యాయవాది గుంటూరు చంద్ర

నిజమే పవన్‌! ఏమిటీ వెలితి?

జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా ప్రీ ఈవెంట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రముఖ పౌరహక్కుల నాయకుడైన న్యాయవాది గుంటూరు చంద్ర (లాయర్ భువనగిరి చంద్రశేఖర్)ని తలుచుకున్నారు. చంద్రకు, పవన్‌కు మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2007లోని ఒక సందర్భంలో "సినిమా రంగంలో ఉన్నా, అద్దాలమేడల్లో నివసిస్తున్నా, లక్షల రూపాయల లగ్జరీ కార్లలో తిరుగుతున్నా నిత్యం ఏదో వెలితిగానే ఉంది..." అంటూ పవన్ కళ్యాణ్ నుంచి ఒక భావోద్వేగపూరితమైన ప్రకటన వెలువడింది. సమాజాన్ని సమదృష్టితో చూసే చంద్ర అప్పుడు స్పందించారు. "నిజమే పవన్! ఏమిటీ వెలితి?" అని ఆలోచనాత్మకమైన ఒక వ్యాసాన్ని ఆయన ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది కేవలం పవన్‌కు మాత్రమే పరిమితం కాదు.... అటువంటి భావసారూప్యత గల అందరికీ చంద్ర రాసిన వ్యాసం వర్తిస్తుంది. ఈ వ్యాసం ప్రచురితమైన తర్వాత చంద్ర, పవన్ మరింత దగ్గరయ్యారు. వారి అనుబంధం చిరకాలం కొనసాగింది. చంద్ర కలం నుంచి జాలువారిన ఆ వ్యాసం మళ్ళీ ఇప్పుడు మీ కోసం...


నిజమే పవన్‌! ఏమిటీ వెలితి?


విజయదశమి మరుసటి రోజు సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ ఒక సామాజిక "సేవాసంస్థ (కామన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)ను స్థాపించి దానికి కోటి రూపాయల విరాళం ప్రకటించి వార్తలకెక్కారు. అయితే అదే రోజు ఆయన హృదయాంతరాళం నుంచి అలవోకగా జాలువారిన జీవిత అస్తిత్వవేదనను మీడియా అంతగా పట్టించుకోలేదు. తనదైన శైలిలో రివాల్వర్‌ చేబూని, ఆ నిర్జీవ ఆయుధాన్నిఆయన ముద్దు పెట్టుకున్న దృశ్యాల మధ్య యువకథానాయకుడి అంతర్వేదన కనుమరుగైంది. “ఇరవై ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నా, అద్దాల మేడల్లో ఉంటున్నా, లక్షల రూపాయల విలువచేసే కార్లలో తిరుగుతున్నా నిత్యం ఏదో వెలితిగానే ఉంది" అన్నారు పవన్‌కళ్యాణ్‌.


అలాస్కాలో 20వ శతాబ్ది మొదట్లో బంగారం కోసం పరుగెత్తిన అమెరికన్ల “గోల్డ్‌రష్‌' లాంటి సంపద లాలసతో పరుగుపందెంలో జీవితాలు కోల్పోతున్నఆధునిక తెలుగు ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదీల ప్రతి ఒక్కరి జీవితానుభవానికి రూపం ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌ను మెచ్చుకోవాల్సి వుంది. ఏమిటి వెలితి? ఖరీదైన కార్లున్నా, అద్దాల మేడలున్నా జీవితంలో వెలితి ఎందుకు వెంటాడుతోంది? సంపద పెంపొందే కొద్దీ రాజకీయ నేతలు బాకాలూదే అభివృద్ధి అనుభవంలోకి వచ్చేకొద్దీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరివ్యాప్తమయ్యే కొద్దీ ఈ వెలితి విస్తరిస్తూ అగాధంలా వ్యాపిస్తోంది ఎందువల్ల? పవన్‌కళ్యాణ్‌ చెప్పినట్లు అది ప్రతినిత్యం మనల్ని ఎందుకు ఆవరించి, ఆవహించి ఉంటోంది?


సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్తున్న రాజకీయవేత్తలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంది. ధనార్జనలోనో, అధికారాన్నినిలబెట్టుకోవడంలోనో, భూ బకాసుర జీవితంలోనో సతమతమయ్యే ప్రభువులూ, వారి అవినీతికి కాపలాదార్లుగా మారి అధికారాన్ని తిరిగి అందుకోవాలనే ప్రయత్నంలో నిమగ్నమైన ప్రతిపక్షనేతలూ ఇలాంటి ప్రశ్నలను పట్టించుకున్నపాపాన పోవడం లేదు. సంపద అధికారం చుట్టూ ప్రదక్షణ చేస్తున్న మన రైట్‌, లెఫ్ట్‌ రాజకీయ ప్రపంచంలో పవన్‌కళ్యాణ్‌ చెప్పిన జీవితంలో వెలితి ఇంకా ప్రవేశించాల్సి ఉంది. ఈ వెలితి సృష్టికర్తలు వాళ్ళే. కుటుంబ సంబంధ సంక్షోభం వల్లా, కోల్పోతున్న ఇమేజ్‌ను తిరిగి పాందేందుకూ సామాజిక సేవను పవన్‌కళ్యాణ్‌ ఒక ఎత్తుగడగా ప్రయోగిస్తున్నారని సందేహించే వారున్నారు కానీ, నిత్య జీవిత వేదనను వ్యక్తీకరించినప్పుడు ఇది 'గుండె గొంతుకలోన కొట్టాడుతున్నాది!' అన్నవిధంగా ప్రతిధ్వనించిన విషయాన్ని ఎవరూ కాదనలేరు.


ఇది ఆయన అనుభవంలోనిదే కాదు. సమూహ జీవితాన్ని విసర్జించడమే స్వేచ్చగా భ్రమించి అణుమాత్రం వ్యక్తులమై, ఆర్థిక మానవులమై, ప్రకృతి నుంచి దూరమై, ప్లాస్టిక్‌ జీవితాన్ని, వర్చువల్‌ ప్రపంచాన్ని వరించి చివరకి వస్తువుల వినియోగదారులుగా తప్ప మరే గుర్తింపుకు నోచుకోని అధమాధమ జీవితాలను గడుపుతున్న మన ప్రతి ఒక్కరి అనుభవంలోనిదే ఈ వెలితి.


పదిహేడు, పద్దెనిమిదవ శతాబ్దాల్లో పారిశ్రామిక విప్లవంతో పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఆధునికత మనిషికీ మనిషికీ మధ్య పేగు సంబంధాన్ని తెంచి ఆర్థిక సంబంధాలను ప్రతిష్టించింది. అంతకుముందున్న సమూహ జీవితాన్ని విచ్చిన్నం చేసి ప్రకృతి నుంచి మనిషిని వేరుచేసింది. షెల్లీ, బైరాన్‌, కీట్స్‌ లాంటి రొమాంటిక్‌ కవులు తమ కవితల ద్వారా ఈ సమూహజీవిత విచ్చిన్నంపై నిరసన గళాలను విప్పారు. నీషే లాంటి తత్వవేత్తలు దేవుడు మరణించాడనీ, దేవుడిని మానవుడే చంపేశాడని అక్రోశించారు. ఈ సందర్భం గురించే - కారల్‌ మార్క్స్‌ తన తొలి రచనల్లో మానవజాతి ఆవిర్భావం తర్వాత అత్యంత బాధాకరమైన అనుభవంగా సామూహికత విచ్చిన్నాన్నీ, వ్యక్తి ఆవిర్భావాన్నీ అభివర్ణించారు. అందుకే తిరిగి సమూహ జీవితాన్ని ఎలా ప్రతిష్టించాలన్నదే తర్వాతి కాలంలో అన్ని రాజకీయ సిద్ధాంతాల గమ్యంగా మారింది.


కాపిటలిజం అనేది భూస్వామ్యం, రాచరికం లాంటి అంతకు ముందున్నసమాజాల తర్వాత వచ్చిన ఒకానొక ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. మనుషులను కలిపి ఉంచిన బంధాలను తుంచేసి వ్యక్తిగత లాభాపేక్షగల మనుషులను సృష్టించి యంత్ర అవసరాలకు మానవ అవసరాలను లోబర్చిన మహమ్మారి అని ప్రేమ్‌ శంకర్‌ ఝూ, అశిష్‌ నంది లాంటి మేధావులు ప్రకటించారు.


మానవజాతి లక్షణమైన సమూహత్వం నశించడం మనుషులను ఒంటరి వాళ్లను చేసింది. దాన్నే స్వేచ్చ పేరిట పైకెత్తారు. డబ్బు తప్ప ఏ ఆప్యాయ మానవ సంబంధాన్ని కూడా సహించలేని ఆధునికత ఎన్నో వెర్రితలలు వేసింది. గత కాలం నాటి స్మృతులను చెరిపింది. మతపరమైన, సాంస్కృతికపరమైన, ఆత్మిక సంబంధమైన ప్రతి రంగాన్నీ ఆర్థిక కార్యాచరణకు లోబడేలా చేసింది. సెన్సెక్స్‌ ఉత్థానపతనాల్లో, జాతీయ స్థూల ఆదాయంలో అభివృద్ధిని చూసుకుంటూ మురిసేలా చేసింది. ఆధునిక బాధలు సృష్టించి వాటికి నివారణోపాయాలను మార్కెట్‌గా మలిచింది ఆధునికతే.


బ్రిటీష్‌వారి వలస పాలనలో మనకు దిగుమతైన ఆధునికతకు దేశం యావత్తూ బలైంది. జాతిమూలాల నుంచి తుంచి వేయబడిన అణుమాత్ర మానవులు, పాశ్చాత్య ఆధునిక వృక్షానికి అంటుగట్టిన బతుకులు - ఇవి దేశవిద్రోహ చిత్రపటంలో భాగమయ్యాయి. నాటి రాజారామ మోహన్‌రాయ్‌, కందుకూరి, గురజాడ నుంచి నేటి మన్మోహన్‌ సింగ్‌, చంద్రబాబు, వైయస్‌ వరకూ సంస్కర్తలు అందరూ ఈ క్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళే తప్ప దీన్ని నిలువరించిన వారు లేరు. వామపక్ష రాజకీయాలు సైతం ఈ క్రమానికి మరో పార్శ్వం మాత్రమే. మావోయిస్టులు మినహాయింపు కారు. క్రమంగా జాతిహీనులుగా పాశ్చాత్య నాగరికతను అనుకరించే నకిలీలుగా మనం తయారయ్యాం. ఈ క్రమం స్వాతంత్ర్యానంతరం కొనసాగేందుకు అవసరమైన ఆంగ్ల మాననపుత్రులూ ఆధునిక పాలనా చట్రాలూ తయారయ్యాకనే ప్రత్యక్ష వలస పాలనను బ్రిటీష్‌వారు ముగించారు. గ్రామ స్వరాజ్యాలను, స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థను కలలుగన్న గాంధీజీని ఆధునిక భారత రాజ్యపాలన పక్కకు పెట్టింది. గాంధీలోని అహింసామూర్తికి మాత్రమే తగు ప్రచారం కల్పించారు. (ఇటీవల గాంధీగారి గురించిన సినిమాలన్నీ ఈ కోవలోవే)


ప్రపంచీకరణ, మన ఆర్థిక విధానాలలో ప్రపంచ బ్యాంకు జోక్యం ఈ క్రమాన్ని వేగవంతం చేసింది. కాంక్రీట్‌ నిర్మాణాల్లో జీవ సమాధులు నిర్మించుకుంటూ సైబర్‌ కేపుల్లో మెదళ్ళు పోగొట్టుకుంటూ ప్రకృతిని పరిహరిస్తూ పంచభూతాలను శాసించేందుకు ఉవ్విళ్లూరుతున్నాం. సెల్‌ఫోన్‌ను చేబూని ప్రపంచమంతా నా గుప్పెట్లోనే అనే ఐడియాతో విర్రవీగుతున్నాం.


ఇప్పుడు మనం నిరంతరం పరిగెడుతున్నాం. ఎలిస్‌ ఇన్‌ ది వండర్‌ లాండ్‌లో చెప్పినట్లుగా ఉన్నచోట ఉండాలంటే పరుగెత్తాల్సిన సమాజాన్ని సృష్టించుకున్నాం. మరింత ముందుకు వెళ్ళాలంటే రెండింతలు వరిగెట్టాలి. అలిసిన వాళ్లను సేదదీర్చడం కొనుగోలు సరుకైంది. ఆప్యాయత కరువైంది. వందల టీవీ ఛానళ్లు, సినిమాలు మనకు సాంస్కృతిక తృప్తిని ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.


భౌతిక సంపద లాలస, ధనార్జన పరాయణత్వం, పాశ్చాత్య సంస్కృతి అనుకరణ ఎప్పటికీ పాశ్చాత్యులతో సమానంగా నిలపలేవు. వారిది రైలు ఇంజనైతే మిగిలిన దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ దాని బోగిలే, బోగిలెప్పటికీ రైలింజన్‌లు కాలేవు. రైలింజన్‌ మాత్రమే ప్రతిసారీ ముందుంటుంది. అలా ఎప్పటికీ ఆధునిక పరుగు పందెంలో మనం వెనుకనే ఉంటాం. ఈ పరుగుకు విరామంలేదు. గమ్యం ఎప్పటికప్పుడు దూరంగా జరుగుతూ ఉంటుంది.


స్వదేశీ ప్రాతిపదికన దేశీయ ఆధునిక జీవిత పునర్నిర్మాణం ద్వారా, పాశ్చాత్య నాగరికతను విసర్జించడం ద్వారా మనం జీవితంలో వెలితిని పోగొట్టుకోవచ్చు. వినియోగప్రపంచాన్ని జీవితం నుండి బహిష్కరించడం ద్వారా తిరిగి పొందవచ్చు. రాజకీయ వ్యాకరణాన్ని సవరించి తాత్వికతను, జీవిత దర్శనాన్ని రాజకీయాల్లో భాగంచేసి తత్వదారిద్ర్యాన్ని రాజకీయ రంగం నుంచి పారదోలడంతో వెలితికి పరిష్కారం దొరుకుతుంది.


జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పినట్లు ఆధునికతను వదిలించుకోవడం కష్టం కావచ్చు. గౌతమ బుద్ధుడు రాజ్యాన్నీ, భార్యాపుత్రులనూ వదిలేసి రాజ ప్రసాదం నుంచి నిశిరాత్రి బయటకు నడిచిన విధంగా జరగకపోవచ్చు. కానీ ఆధునికతను మన ప్రధాన శత్రువుగా గుర్తించడం ఆ దిశగా ఒక ముందడుగు అవుతుంది. పవన్‌కళ్యాణ్‌ అన్నట్లు ఒక మనిషి బతకడానికి ఇంతింత సంపదలు అవసరమా! అని ప్రల్నించుకోవడం అందుకు దోహదం చేస్తుంది. సంపదే జీవితంగా మారిన స్థితి నుంచి, సామూహికతే సంపదగా జీవించే స్థితికి మారే ప్రయత్నం చేయాల్సివుంది. మనదికాని బ్రతుకును వదిలేసి, నేలమీద కాళ్ళూని బతకడంలో ఆనందాన్ని అనుభవించి పలవరించాల్సివుంది.



నవంబర్‌ 20, 2007 - ఆంధ్రజ్యోతి దినపత్రిక


ఆధునిక జీవితంలో వెలితి గురించి పవన్‌ కళ్యాణ్‌ పామర భాషలో చెప్పినదే ఆధునిక భారత నిర్మాత పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు సైతం అనుభవంలోకి వచ్చింది. తన అస్తిత్వ వేదనను ఆత్మకథలో ఇలా చెప్పారు. “నేను ప్రాక్‌ పశ్చిమ సంస్కృతిలో మిశ్రమాన్ని. సర్వత్రా బహిష్కృతుడిని. ఎక్కడా సుఖం లేనివాణ్ణి. జీవితం గురించిన నా ఆలోచనలు, దృక్కోణాలు ప్రాచ్యం కంటే బహుశా పశ్చిమానికి దగ్గరివి. కానీ భారతదేశం తన బిడ్డలందరిలాగే పలు విధాలుగా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. నేను ఆ వారసత్వాన్ని వదులుకోలేను. ఇటీవల సముపార్జించిన ఆధునికతను వదులుకోలేను. పాశ్చాత్యానికి ఆగంతకుడిని, పరాయివాడిని. దానిలో ఎప్పటికీ భాగం కాలేను. కానీ నా స్వదేశంలోనూ ప్రవాసినే అనే భావన కొన్నిసార్లు కలుగుతోంది.” 


మనదేశంలో మనమే ప్రవాసులమైన స్థితి పవన్‌కళ్యాణ్‌ చెప్పిన వెలితికి కారణం. ఈ వెలితిని పూరించుకునేందుకు పాశ్చాత్య అభివృద్ధి మార్గంలో మరింతగా ప్రయాణిస్తూ పోయాం. వెలితి పరిధిని అలా విస్తరించుకుంటూ పోతున్నాం. వంటగ్యాస్‌నే కాదు జీవితాన్ని సైతం ఫ్రైవేటీకరించుకుంటున్నాం. వినియోగవస్తు వ్యామోహంతో వస్తువుల యజమానులుగా జీవితంలో అసంపూర్తిని పరిష్కరించుకోవాలనే నిరంతర తపనతో వేగిపోతున్నాం. వినియోగ మార్కెట్‌లో ఇవాల్టిది రేపటికి పాతదయ్యే అనిశ్చితత్వం మన జీవితాల్లోకి వస్తువ్యామోహంతో ప్రవేశిస్తుంది. 


ఉమ్మడి కుటుంబాలకు చరమగీతం పాడాం. పరమాణు కుటుంబాలను స్వాగతించాం. ఇప్పుడిక ఎవరి పడగ్గదిలో వాళ్ళం పక్కపక్కనే కాలం గడువుతూ ఆప్యాయతానురాగాలకే కాదు సంభాషణకు కూడా వీడ్కోలు పలికాం. సంతానాన్ని అమెరికా విమానం ఎక్కించి, వారు పంపే డాలర్లకు కాపలాగా మారి జీవిత సాయం సంధ్యలో మాట్లాడే మనుషుల కోసం వెంపర్లాడి వృద్ధాశ్రమాలను నిర్మించుకుంటున్నాం. ధనార్జనే ధ్యేయంగా విదేశీ విషపూరిత పానీయాల ప్రచారానికి సైతం ఒడిగట్టి పండ్ల రసాల మాధుర్యాన్ని మర్చిపోయేలా చేస్తున్నాం. మనసుకు ఓదార్పునిచ్చే విశ్వాసాల సేతువులను కూల్చేసి కూలిపోయే వంతెనలను హేతుబలంతో కట్టుకుంటున్నాం. ప్రకృతిని పెద్ద పెట్టున ధ్వంసిస్తూ కుండీలో పూలమొక్కలకు నీళ్లు పోస్తూ తృప్తిపడుతున్నాం. మన భాషను తుడిచిపెట్టే పాశ్చాత్య మాయాప్రపంచాన్ని వరించి ప్రాచీన భాష హోదా పోటీలో తెలుగును నిలబెడుతున్నాం. క్రికెట్‌ వినోదానికి చొంగకారుస్తూ దేశీయ క్రీడలను మట్టుపెడుతున్నాం. విదేశీ మందుల కంపెనీలకు శరీరాలను అప్పజెప్పి పెరట్లో ఉన్న స్వదేశీ వైద్యానికి తిలోదకాలిస్తున్నాం. నిజజీవితాన్ని నిజం కాదని భావించి ఇమేజెస్‌లో జీవిస్తున్నాం. ప్రతిరంగాన్ని పాశ్చాత్యీకరించుకున్నాం.


పవన్‌కళ్యాణ్‌ చెప్పిన వెలితి మనం నిర్మించుకున్న పాశ్చాత్య ప్రపంచం నుంచి దిగుమతౌతున్నదే. ఈ వెలితి ప్రకృతి నుంచి మనం దూరంగా జరగగా వచ్చినదే. సమూహ జీవితం విచ్చిన్నం కావడంవల్ల ఏర్పడిందే. దేశీయ, సాంస్కృతిక జీవితాన్ని కోల్పోవడం వల్ల వచ్చిందే. ఈ వెలితికి మరోపేరు అభివృద్ధి, దాని లెఫ్ట్‌ నామం అభ్యుదయం, విప్లవం. ఈ వెలితి విస్తరణపైనే పాశ్చాత్య ప్రపంచం ప్రపంచ మార్కెట్‌ ఆధారపడి ఉన్నాయి.

Updated Date - 2021-04-05T21:39:28+05:30 IST