వెనక్కి తగ్గిన పవన్.. నైరాశ్యంలో జనసేన శ్రేణులు

ABN , First Publish Date - 2021-03-13T22:40:08+05:30 IST

తిరుపతి ఉప ఎన్నిక పోటీ విషయంలో జనసేనాని పవన్‌కల్యాణ్ వెనక్కి తగ్గారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప

వెనక్కి తగ్గిన పవన్.. నైరాశ్యంలో జనసేన శ్రేణులు

అమరావతి: తిరుపతి ఉప ఎన్నిక పోటీ విషయంలో జనసేనాని పవన్‌కల్యాణ్ వెనక్కి తగ్గారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగతారని ప్రకటించారు. ఇందుకు ఆయన సుదీర్ఘమైన వివరణ కూడా ఇచ్చారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని వారు గట్టిగా చెప్పారని తెలిపారు. ‘జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమని భావించాం. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉంటే తప్పకుండా ఈ స్థానాన్ని బీజేపీకి వదిలిపెడతామని ఆది నుంచి చెబుతున్నాం. బీజేపీ అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి స్థానాన్ని 1999లో బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం’ అని పవన్ పేర్కొన్నారు.


గతంలో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే వీర్రాజు ప్రకటనపై జనసైనికులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జనసేన అభ్యర్ధే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికపై అప్పట్లో రెండు పార్టీల మధ్య పెద్ద హంగామే నడిచింది. తిరుపతిలో బలమైన సామాజికవర్గం జనసేనకు మద్దతిచ్చే అవకాశం ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడాన్ని ప్రస్తావించింది. రాష్ట్రానికి హోదా గురించి బీజేపీ అక్కడే హామీ ఇచ్చి.. మాట మార్చడం, తిరుపతి అభివృద్ధి అంతా తామే చేశామని కమలనాథులు చెబుతున్నా తిరుపతికి ఒక్క అంతర్జాతీయ విమానం లేకపోవడం, ఐఐటీ ఇచ్చినా సొంత భవనాలకు నిధులు మంజూరు చేయకపోవడం లాంటివన్నీ జనసేన గుర్తించింది. బీజేపీ పోటీ చేసినా ప్రజలు ఆదరించే అవకాశం లేదని, మనమే అభ్యర్థిని బరిలో నిలుపుదామని పవన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే రెండు పార్టీల అభిప్రాయాలతో ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బీజేపీ అభ్యర్థినే తిరుపతి బరిలో దింపాలని సూచించింది. అయితే ఈ సారి మాత్రం సోము వీర్రాజు కాస్త జాగ్రత్త పడ్డారు. ఏపీ బీజేపీ పర్యవేక్షకులు మురళీధరన్‌ తన ట్విట్టర్ ఖాతాలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలుపుతున్నామని ప్రకటించారు.


అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలని విశ్లేషకులు చెబుతున్నారు. మొదట్లో సోము వీర్రాజు ప్రకటనతో జనసైనికులు మూకుమ్మడిగా బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించారు. తాజాగా మురళీధరన్ ప్రకటనతో జనసేన నుంచి పెద్ద నిరసనను ఎదురు కాలేదు. అంతేగాక జనసైనికులు పలు సూచనలు చేయడం గమనార్హం. తిరుపతి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందని, బీజేపీకి టికెట్‌ కేటాయించడం వల్ల ఓటింగ్‌పై ప్రభావం ఉంటుందని జనసేన నేత కిరణ్‌ రాయల్‌ పేర్కొన్నారు. ఇక్కడ పవన్‌పై సెటైర్లు కూడా వస్తున్నాయి. పవన్ ప్రగల్భాలు బయటికి మాత్రమేనని, ఆయనెప్పుడూ తెరవెనుక మాత్రమే ఉంటారనే విమర్శలు వస్తున్నాయి. 

Read more